ఆటో బోల్తా

21 May, 2019 08:24 IST|Sakshi
ఆటో డ్రైవర్‌ సయ్యద్‌ ముజీబ్‌

ముగ్గురు ప్రయాణికులతో పాటు హోంగార్డుకు గాయాలు

ట్రాఫిక్‌ తనిఖీల నుంచి తప్పించుకునే క్రమంలో ప్రమాదం

బంజారాహిల్స్‌: ట్రాఫిక్‌ పోలీసులు తనిఖీలు చేస్తుండగా వారి నుంచి తప్పించుకునే క్రమంలో వేగంగా వేగంగా వెళుతున్న ఓ ఆటో అదుపుతప్పి బోల్తాపడటంతో ముగ్గురు ప్రయాణికులతో పాటు ఆటోనే ఆపేందుకు యత్నించిన ట్రాఫిక్‌ హోంగార్డుకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదానికి కారకుడైన ఆటో డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధిత హోంగార్డు జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే... కార్మికనగర్, బ్రహ్మశంకర్‌ నగర్‌కు చెందిన సయ్యద్‌ ముజీబ్‌ ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. సోమవారం ఉదయం ఆటోలో ముగ్గురు ప్రయాణికులను ఎక్కించుకుని ఫిలింనగర్‌ వైపు నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టుకు వెళుతుండగా జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 36 సమీపంలోని కళాంజలి మలుపు వద్ద జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ ఎస్‌ఐ లఖన్‌రాజ్‌ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేస్తున్నారు.

దీనిని గుర్తించిన ముజీబ్‌ వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆటో వేగం పెంచాడు. ఆటోను ఆపేందుకు ప్రయత్నించి హోంగార్డు ఫణీందర్‌ను ఢీకొట్టి ముందుకు వెళ్లగానే ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ముజీబ్‌తో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న డి.చందు అనే ప్రయాణికుడికి స్వల్ప గాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆటోకు సంబందిన పత్రాలను తనిఖీ చేయగా 17 పెండింగ్‌ చలానాలు ఉన్నట్లు తేలింది. చలానాల విషయం బయటపడుతుందనే      భయంతో ముజీబ్‌ పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడని ఈ క్రమంలోనే తనకు, ప్రయాణికులకు కూడా స్వల్ప గాయాలయ్యాయని హోంగార్డు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొనిదర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్‌ పోలీసులు ఆటోను సీజ్‌ చేశారు. 

మరిన్ని వార్తలు