భార్య, కుమార్తె సహా వ్యక్తి ఆత్మహత్య

15 Mar, 2019 12:48 IST|Sakshi
మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలిస్తున్న దృశ్యం

తిరుచ్చి సెందన్నీర్‌పురంలో ఘటన

అన్నానగర్‌: తిరుచ్చి సెందన్నీర్‌పురంలో బుధవారం భార్య, కుమార్తె సహా ఆటో డ్రైవర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు అతను రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  తిరుచ్చి సెందన్నీర్‌పురం పారి వీధిలో ఓ ఇంటి మొదటి అంతస్థులో అద్దెకున్న బాల సహాయరాజ్‌ (43) ఆటో డ్రైవర్‌. ఇతని భార్య యువరాణి(40), కుమార్తె ముత్తులక్ష్మి (25). ముత్తులక్ష్మి నర్సింగ్‌ చదువుతోంది. వీరి ఇల్లు రెండు రోజులుగా మూసివేసి ఉంది. ఈ స్థితిలో ఆ ఇంటి యజమాని విజయలక్ష్మి అద్దె నిమిత్తం బాల సహాయరాజ్‌ ఫోన్‌కి కాల్‌ చేసింది. ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ రావడంతో అనుమానంతో విజయలక్ష్మి బుధవారం రాత్రి 7 గంటల సమయంలో నేరుగా మొదటి అంతస్థుకు వెళ్లింది.

అక్కడ దుర్వాసన రావడంతో కిటికీలో లోపలికి చూడగా బాల సహాయరాజ్‌ ఒంటరిగా, యువరాణి, ముత్తులక్ష్మి ఒకే చీరకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. దిగ్భ్రాంతి చెందిన ఆమె వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. పొన్‌మలై సహాయ పోలీసు కమిషనర్‌ బాలమురుగన్, సీఐ కావేరి అక్కడికి వచ్చి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు. కుళ్లిన స్థితిలో ఉన్న ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తిరుచ్చి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఇంట్లో తనిఖీ చేయగా బాలసహాయరాజ్‌ రాసిన ఓ లేఖ లభించింది. అందులో ‘మా చావుకు ఎవరూ కారణం కాదని, యువరాణి అక్క సుశీల వద్ద తీసుకున్న రూ.50 వేల నగదు కోసం నా ఆటోని అమ్మి అప్పు తీర్చండి’ అని రాసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పొన్‌మలై పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు