ఒంటరి మహిలళే వారి టార్గెట్‌!

19 Jul, 2019 11:57 IST|Sakshi

దోపిడీ గ్యాంగ్‌ అరెస్ట్‌.. అందులో ఓ మహిళ 

ఆటోలో ఎక్కించుకుని లైంగికదాడి, దోపిడీ

పట్టుపడిన నలుగురూ సత్తెనపల్లి వాసులే

ప్రధాన నిందితుడు రమేష్‌పై జిల్లాలో 12 కేసులు 

సాక్షి, గుంటూరు: ఒంటరిగా రోడ్డుపై నిలిచి ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని, ఆటోలో ప్రయాణికుల మాదిరిగా ఎక్కించుకుని నిర్జీవ ప్రదేశాలకు తీసుకెళ్లి దోపిడీ, లైంగికదాడికి పాల్పడిన ప్రధాన నిందితుడితో పాటు, అతడికి సహకరించిన మరో ముగ్గురు ముఠా సభ్యులను కూడా గుంటూరు అర్బన్‌ సీసీఎస్‌ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. సీసీఎస్‌ పోలీసు స్టేషన్‌లో ఏఎస్పీ ఎస్‌.రాఘవ విలేకరులకు వివరాలు వెల్లడించారు.

సత్తెనపల్లికి చెందిన పల్లపు రమేష్, అతడి భార్య దుర్గ, స్నేహితులు తన్నీరు గోపి, నూర్‌బాషా ఖాశింలు ముఠాగా ఏర్పడ్డారు. సులువైన మార్గంలో డబ్బు సంపాదించేందుకు పథకం వేశారు. అందుకు ఆటోను ఎంచుకుని డ్రైవర్‌గా రమేష్, మిగిలిన ముగ్గురు ప్రయాణికుల్లా రోడ్డుపై వెళుతున్న ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని వారి ఆటోలో ఎక్కించుకునేవారు. ఈ నెల 2వ తేదీన అమరావతి మండలం 14వ మైలుకు చెందిన ఓ మహిళ నిడుముక్కల గ్రామానికి వెళ్లేందుకు వేచి చూస్తున్న సమయంలో ఆటో ఎక్కించుకుని నిర్జీవ ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడటంతో పాటు, బంగారం చోరీ చేశారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయగా, గురువారం నలుగురు నిందితులు గుంటూరులోని పూలమార్కెట్‌ సెంటర్‌లో బంగారం విక్రయించేందుకు యత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరాలకు పాల్పడినట్లు నిందితులు అంగీకరించడంతో వారి వద్ద ఉన్న బంగారు వస్తువులు స్వాధీనం చేసుకుని, ఆటోను సీజ్‌ చేశారు. ప్రధాన నిందితుడు      పల్లపు రమేష్‌పై సత్తెనపల్లి, తెనాలి, గుంటూరు అర్బన్‌ పరిధిలోని నల్లపాడు పోలీసు స్టేషన్‌లో మొత్తం 12 కేసులు నమోదయ్యాయని ఏఎస్పీ వివరించారు. నిందితులను పట్టుకోవాడానికి కృషి చేసిన అధికారులు, సిబ్బందిని ఏఎస్పీ అభినందించారు. సమావేశంలో డీఎస్పీ శ్రీలక్ష్మి, సీఐలు శేషగిరిరావు, మల్లికార్జునరావు, వెంకట్రావు, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు