ఆటోడ్రైవర్‌ దారుణ హత్య

19 Feb, 2020 12:26 IST|Sakshi
మృతదేహాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ, సీఐ

సంగం మండలంలో ఘటన

మృతదేహాన్ని పరిశీలించిన నెల్లూరు రూరల్‌ డీఎస్పీ  

నెల్లూరు, సంగం: మండలంలోని తరుణవాయి సమీపంలో ఉన్న దువ్వూరు కాలువ బ్రిడ్జిపై ఓ ఆటో డ్రైవర్‌ దారుణహత్యకు గురైయ్యాడు. మంగళవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మృతుడు వెంగారెడ్డిపాళెం గ్రామానికి చెందిన బొడ్డుపల్లి రాఘవ (35)గా సంగం పోలీసులు గుర్తించారు. వారి కథనం మేరకు.. మండలంలోని వెంగారెడ్డిపాళెం గ్రామానికి చెందిన రాఘవ 10 సంవత్సరాల క్రితం అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులున్నారు. రాఘవ ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. రెండునెలలుగా అతను గాంధీజనసంఘానికి చెందిన ఓ వివాహితతో సన్నిహితంగా ఉండసాగాడు. సోమవారం మహిళ భర్త వెంకటేష్‌ ఇంట్లో ఉండడాన్ని గమనించక రాఘవ ఆమెపై చాక్లెట్‌ విసిరాడు. ఈక్రమంలో వెంకటేష్‌ రాఘవతో ఘర్షణ పడ్డాడు. అదేరోజు రాత్రి 8 గంటల అనంతరం ఫూటుగా మద్యం సేవించిన రాఘవను వెంకటేష్‌ కొట్టి తరుణవాయి సమీపంలో ఉన్న దువ్వూరు కాలువ బ్రిడ్జిపై పడేసి గొంతుపై కాలితో నులిమి చంపివేసినట్లుగా పోలీసులు తెలుసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎస్సై శ్రీకాంత్‌ ఇచ్చిన సమాచారంతో నెల్లూరు రూరల్‌ డీఎస్పీ రాఘవరెడ్డి, బుచ్చిరెడ్డిపాళెం ఇన్‌చార్జి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరావు మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు కొడుకు రాఘవకు తల్లి వసంతమ్మ ఫోన్‌ చేసింది. రాఘవ సంగం సమీపంలో ఉన్నానని చెప్పాడు. రాత్రి 9 గంటలు అయినా ఇంటికి రాకపోవడంతో మళ్లీ ఆమె ఫోన్‌ చేసింది. అయితే రాఘవ తీయలేదు. మంగళవారం ఉదయం సంగం పోలీసులను ఆశ్రయించాలని అనుకునేలోగా గాంధీజనసంఘానికి చెందిన యువకులు రాఘవ ఓ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో తరుణవాయి సమీపంలోని దువ్వూరుకాలువ వద్ద చచ్చిపడి ఉన్నాడని చెప్పడంతో వసంతమ్మ, రాఘవ భార్య ప్రశాంతి వెంగారెడ్డిపాళెం గ్రామస్తులతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. కుటుంబానికి ఆధారంగా ఉన్న రాఘవ మృతితో తమకు దిక్కెవరంటూ రోదించారు.

మరిన్ని వార్తలు