ఆటోమేటిక్‌గా లేపేస్తాడు..

28 May, 2019 13:29 IST|Sakshi
నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న ఆటోలు

ఆటోలే లక్ష్యంగా చోరీలు ఇప్పటి వరకు 38 వరకు చోరీ

24 ఆటోలను స్వాధీనం

చేసుకున్న రాజమహేంద్రవరం  పోలీస్‌లు

నిందితుడి అరెస్ట్, రూ.27 లక్షల విలువైన ఆటోల స్వాధీనం

రామచంద్రపురం గ్రామానికి చెందిన రాజులపూడి రామ సత్యనారాయణ ఆటోలో రాజమహేంద్రవరం సాయి హాస్పిటల్‌ వద్దకు రోగులను తీసుకువచ్చి ఆటో రోడ్డు పై ఉంచి రోగులను తీసుకొని ఆసుపత్రిలోపలికి వెళ్లాడు. తిరిగి వచ్చే సరికి ఆటో చోరీకి గురైంది.

కొవ్వూరుకు చెందిన అంకాబత్తుల దావీదు రాజమహేంద్రవరం ఆసుపత్రికి రోగులను తీసుకొ ని వచ్చాడు. రోగులను ఆసుపత్రి లోపలకు తీసుకువెళ్లి తిరిగి వచ్చి చూసే సరికి ఆటో చోరీకి గురైంది.  
కాతేరు గ్రామానికి చెందిన పెంటపాటి శ్రీనివాసరావు ఆటోను జాంపేట చేపల మార్కెట్‌ వద్ద ఉంచి చేపలు కొనుక్కునేందుకు లోపలకు వెళ్లి తిరిగి వచ్చి చూడగా ఆటో మాయమైంది. ఇలా ఈ ఏడాది రాజమహేంద్రవరంలోని వివిధ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో 21 ఆటోలు చోరీకి గురయ్యాయి.
రాజమహేంద్రవరం క్రైం : ఆటోల చోరీలపై నిఘా పెట్టిన అర్బన్‌ జిల్లా ఎస్పీ ప్రత్యేక నిఘా పెట్టారు. ఆటోలను చోరీ చేస్తున్న నిందితుడిని అరెస్ట్‌ చేసి అతడి వద్ద నుంచి 24 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. ఆ చోరీ వివరాలను రాజమహేంద్రవరం అడిషనల్‌ ఎస్పీ వైవీ రమణకుమార్‌ సోమవారం ఏఆర్‌ గ్రౌండ్స్‌లోని,  త్రీటౌన్‌ క్రైం పోలీస్‌ స్టేషన్‌ వద్ద  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. విజయవాడ, నిడమానూరు గ్రామానికి చెందిన నెల్లిమర్ల నరసింహారావు ఆటోడ్రైవర్‌గా పలు ప్రాంతాల్లో పని చేశాడు. జిల్లాలో సామర్లకోట, రాజమహేంద్రవరం, రాజేంద్ర నగర్‌లో కొంత కాలం ఆటో నడుపుతూ జీవించాడు.

రాజమహేంద్రవరంపై అవగాహన ఉండడం, జిల్లాలో అతడికి నామవరం, రామచంద్రపురం ప్రాంతాల్లో బంధువులు ఉండడంతో ఈ జిల్లాలోనే ఎక్కువ ఆటో చోరీలకు పాల్పడ్డాడు. 2014 మార్చి నెలలో గండేపల్లిలో తొలిసారిగా ఒక ఆటో చోరీ చేసి దానిని అమ్మేశాడని, అనంతరం 2019లో ఇప్పటి  వరకు వరుసగా రాజమహేంద్రవరంలో వేర్వేరు ప్రాంతాల్లో 38 ఆటోలు చోరీ చేశాడని తెలిపారు. 24 ఆటోలు విజయవాడలో రాజేష్‌ అనే మెకానిక్‌ షెడ్‌లో పెట్టి కిరాయికి తిప్పుతుండేవాడని వివరించారు. సోమవారం క్రైం డీఎస్పీకి వచ్చిన సమాచారం మేరకు అడిషనల్‌ ఎస్పీ వై.వి.రమణ కుమార్‌ సూచనల మేరకు హెడ్‌ కానిస్టేబుల్‌ పెద్ది రాజు, హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీను, హెడ్‌ కానిస్టేబుల్‌ కిషోర్‌, కానిస్టేబుల్‌ బషీర్‌తో కలసి రాజమహేంద్రవరం త్రీటౌన్‌ ఎస్సై ఆదినారాయణ, కె.శ్రీనివాసరావు కలిసి దాడి చేసి ముద్దాయిని గండేపల్లిలో బంధువుల ఇంటికి వెళ్తుండగా రాజమహేంద్రవరం గామన్‌ ఇండియా బ్రిడ్జి వద్ద నిఘా వేసి పట్టుకున్నట్టు ఏఎస్పీ వైవీ రమణకుమార్‌ తెలిపారు. నిందితుడు నేరం అంగీకరించాడని, అతడి వద్ద నుంచి 24 ఆటోలు స్వాధీనం చేసుకున్నామని, త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోరీ చేసిన మరో 14 ఆటోలు రికవరీ చేయ్యాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. సోమవారం రిమాండ్‌ నిమిత్తం కోర్టుకు తరలిస్తున్నామని తెలిపారు. ముద్దాయిని చాకచక్యంగా పట్టుకొని అతడి నుంచి ఆటోలు రికవరీ చేసిన క్రైం డీఎస్పీ కె. శ్రీనివాసరావు, ఆదినారాయణ, సిబ్బంది, శ్రీను, పెద్దిరాజు, రమణ, బషీర్‌లను అడిషనల్‌ ఎస్పీ రమణ కుమార్‌ అభినందించారు. వీరికి ఎస్పీ చేతుల మీదుగా రివార్డులు ఇచ్చేందుకు సిఫారసు చేస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు