ఆటో డ్రైవర్‌ నమ్మకద్రోహం!

2 Nov, 2019 06:04 IST|Sakshi
సీజ్‌ చేసిన ఆటోను చూపుతున్న డీఎస్పీ శ్రీనివాసులు

పంచాయతీ కార్యదర్శికి పిడిబాకుతో బెదిరింపు 

రూ.16లక్షల పింఛన్‌ సొమ్ముతో దుండగుడి పరారీ 

ప్రజల అప్రమత్తతతో గంటన్నర వ్యవధిలోనే పట్టివేత 

దోపిడీకి సహకరించిన మరో ముగ్గురినీ అరెస్ట్‌ చేసిన పోలీసులు 

ఆటో డ్రైవర్‌ను నమ్మడమే ఆ మహిళా అధికారి తప్పయ్యింది. ప్రతి నెలా భారీ మొత్తంలో తీసుకొస్తున్న ‘పింఛన్‌’ నగదుపై ఆ డ్రైవర్‌ కన్నుపడింది. తనమిత్రుల ద్వారా దోపిడీకి కుట్ర పన్నాడు. పథకం ప్రకారం తను కాకుండా మరొక మిత్రుడి ఆటోలో ఆమె ఎక్కేలా చేసి మరొక మిత్రుడి ద్వారా మార్గం మధ్యంలో బెదిరించి రూ.16 లక్షల దోపిడీకి తెగబడ్డాడు. ఈ హఠాత్పరిణామంతో ఆ అధికారి గట్టిగా కేకలు వేశారు. సమీపంలోని గ్రామస్తులు అప్రమత్తమవడం, పోలీసులూ రంగప్రవేశం చేయడంతో గంటన్నర వ్యవధిలోనే ఆ దొంగను పట్టుకున్నారు. అతడితో సహా నలుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.  

సాక్షి, యల్లనూరు/పుట్లూరు: పింఛన్‌దారులకు అందించే రూ.16 లక్షల సొమ్మును కొందరు దుండగులు పంచాయతీ కార్యదర్శిని బెదిరించి దోపిడీ చేసిన కేసును పోలీసులు 90 నిమిషాల్లో ఛేదించారు. ఈ కేసుకు సంబందించిన వివరాలను తాడిపత్రి డీఎస్పీ శ్రీనివాసులు శుక్రవారం పుట్లూరు పోలీస్‌ స్టేషన్‌లో మీడియాకు వెల్లడించారు. నార్పల మండల కేంద్రానికి చెందిన నాగలక్ష్మి యల్లనూరు మండలం చింతకాయమంద గ్రామపంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈమె ప్రతి రోజూ నార్పల నుంచి ఎ.కొండాపురానికి బస్సులో వెళ్లి, అక్కడి నుంచి ఆటోలో చింతకాయమందకు చేరుకునేవారు. ఎ.కొండాపురం నుంచి ఆంజనేయులు అనే వ్యక్తి ఆటోలో ప్రయాణించేవారు. ప్రతి నెలా పింఛన్‌ బట్వాడా కోసం రూ.లక్షల్లో నగదు తీసుకుని వెళ్తుండేది. ఈ విషయాన్ని ఆంజనేయులు గమనించాడు. ఎలాగైనా పింఛన్‌ డబ్బును కాజేయాలని పథకం వేశాడు. తన మిత్రులైన కుళ్లాయప్ప, శ్రీనివాసులు, సుధాకర్‌లతో కలిసి చోరీకి పథకం వేశాడు. 

అమలు చేశారిలా...
వైఎస్సార్‌ పింఛన్‌ కానుక కింద నవంబర్‌ నెలకు సంబంధించిన డబ్బును ఒకటో తేదీన పంపిణీ చేయాల్సి ఉంది. అక్టోబర్‌ 31న పంచాయతీ కార్యదర్శి నాగలక్ష్మి యల్లనూరు ఆంధ్రాబ్యాంకులో రూ.16 లక్షల నగదును డ్రా చేశారు. ఆ నగదును తీసుకుని నార్పలకు వెళ్లిన ఆమె శుక్రవారం ఉదయం చింతకాయమంద గ్రామంలో పింఛన్లు పంపిణీ చేయడానికి ఆర్టీసీ బస్సులో ఎ.కొండాపురం చేరుకున్నారు. పథకం ప్రకారం ఆంజనేయులు ఆమె ఎక్కడ వస్తోందో ఫోన్‌ చేసి అడిగాడు. ఆమె బస్సు దిగానని చెప్పిన తర్వాత ఈ రోజు తన ఆటోను ఫైనాన్స్‌ వారు తీసుకెళ్లారని, రాలేకపోతున్నానని చెప్పాడు. దీంతో ఆమె మరొక ఆటో కోసం అలా ముందుకు వచ్చింది. అప్పటికే ఆంజనేయులు మిత్రుడైన శ్రీనివాసులు ఆటో సిద్ధంగా ఉంచుకున్నాడు. ఆమెను ఆటోలో ఎక్కించుకున్నాడు. ఆదే ఆటోలో కుళ్లాయప్ప కూడా ప్రయాణికుడిగా కూర్చున్నాడు. ఈ ఆటోను సుధాకర్‌ ద్విచక్రవాహనంలో అనుసరిస్తూ వస్తున్నాడు. తిమ్మంపల్లిలో ప్రయాణికులు దిగి వెళ్లగా.. ఆరవీడు గ్రామం సమీపంలో కుళ్లాయప్ప పిడిబాకుతో పంచాయతీ కార్యదర్శిని బెదిరించి.. ఆమె వద్ద నుంచి రూ.16 లక్షల నగదున్న బ్యాగును తీసుకుని అక్కడి అరటి తోటల్లోకి పరారయ్యాడు.
 
గ్రామస్తులు పట్టుకున్న దొంగ, బ్యాగులోని పింఛన్‌ సొమ్ము 

గంటన్నర వ్యవధిలోనే దొంగలు పట్టివేత 
డబ్బు అపహరణ విషయం తెలియగానే స్థానికులు.. పోలీసులు అప్రమత్తమయ్యారు. గంటన్నర వ్యవధిలోనే దొంగలను పట్టుకున్నారు. ఉన్నతాధికారులు పోలీసులను రంగంలోకి దింపి ఆరవీడు నుంచి ఇతర గ్రామాలకు వెళ్లే అన్ని దారులలో గాలింపు చర్యలు చేపట్టారు. ఇదే సమయంలో గ్రామ ప్రజలను అప్రమత్తం చేయడంతో దాదాపు 1000 మంది పోలీసులకు సహకరిస్తూ దుండగుడి కోసం గాలించారు. దీంతో చిలమకూరు గ్రామ సమీపంలో గ్రామస్తుల సహకారంతో కుళ్లాయప్పను పట్టుకున్నారు. ఇతడిని విచారించగా ఈ పథకంలో ఆటో డ్రైవర్‌ శ్రీనివాసులు, వాసాపురం గ్రామానికి చెందిన సుధాకర్‌తో పాటు ప్రధాన సూత్రధారి ఆటో డ్రైవర్‌ ఆంజనేయులు గురించి తెలిసింది. ఈ మేరకు నలుగురినీ అరెస్ట్‌ చేయడంతో పాటు రూ.16 లక్షల నగదు, ఆటో, ద్విచక్రవాహనం, పిడిబాకును సీజ్‌ చేశామని డీఎస్పీ తెలిపారు. కాగా ఈ కేసును ఛేదించిన రూరల్‌ సీఐ దేవేంద్రకుమార్, ఎస్‌ఐ మోహన్‌కుమార్, కానిస్టేబుల్‌ లింగరాజు, స్పెషల్‌ పార్టీ పోలీస్‌ మోహన్‌లతో పాటు సిబ్బందిని ఆయన అభినందించారు. 

మరిన్ని వార్తలు