‘అశ్లీలం’ క్లిక్‌ చేస్తే బుక్కే!

9 Mar, 2020 09:41 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

‘అశ్లీలం’తో సైబర్‌నేరగాళ్ల కొత్త ఎత్తుగడ

క్రెడిట్‌/డెబిట్‌ కార్డుల సమాచారం తస్కరణ

ఆన్‌లైన్‌ ద్వారానే అందినకాడికి నగదు స్వాహా

బహుపరాక్‌ అంటున్న సైబర్‌ క్రైమ్‌ పోలీసులు

సాక్షి, సిటీబ్యూరో: మీరు సీరియస్‌గా బ్రౌజింగ్‌ చేస్తుండగానో..సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌లో మునిగి ఉండగానో... ‘ఆకర్షించే’ విధంగా పాప్‌అప్స్‌ వచ్చాయా..? హఠాత్తుగా మీ మెయిల్‌ ఐడీకి గుర్తుతెలియని అడ్రస్‌ నుంచి ‘ఫొటోలతో’ కూడిన ఈ–మెయిల్‌ వచ్చిందా..? అలాంటి వాటిని క్లిక్‌ చేసే ముందు ఒక్కక్షణం ఆగండి. అవి మిమ్మల్ని నిలువునా బుక్‌ చేసే ప్రమాదం ఉందని గుర్తుంచుకోండి. అదెలా సాధ్యం అనుకుంటున్నారా..? ఇది చదవండి...

సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఇటీవల ఓ ఫిర్యాదు అందింది. విద్యార్థిగా ఉన్న ఓ యువకుడి ఖాతా నుంచి రూ.10 లక్షలు గోల్‌మాల్‌ అయ్యాయన్నది దాని సారాంశం. ప్రాథమికంగా దర్యాప్తు చేపట్టిన అధికారులు అతగాడు ఓ అశ్లీల వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ కావడంతో ఈ మోసం చోటు చేసుకుందని గుర్తించారు. క్రెడిట్, డెబిట్‌æ కార్డులకు సంబంధించిన వ్యక్తిగత వివరాలతో పాటు నెట్‌ బ్యాంకింగ్‌కు ఉపకరించే రహస్య అంశాలను తస్కరించేందుకు సైబర్‌ నేరగాళ్లు అశ్లీలంతో ఎర వేస్తున్నారని పోలీసులు గుర్తించారు. దీనిపై అప్రమత్తంగా ఉండాలని సైబర్‌ క్రైమ్‌ అధికారులు సూచిస్తున్నారు.

ఆ వివరాలే కీలకం...
ఓ వ్యక్తికి చెందిన సొమ్మును ఆన్‌లైన్‌లో స్వాహా చేయడానికి సైబర్‌ నేరగాళ్లకు అతడి క్రెడిట్‌/డెబిట్‌ కార్డుకు చెందిన నెంబర్, సీవీవీ కోడ్‌లతో పాటు కొన్ని వ్యక్తిగత వివరాలూ అవసరం. ఇంటర్‌నెట్‌కు బ్యాంకింగ్‌కు సంబంధించి లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ కచ్చితంగా ఉండాల్సిందే. వీటన్నింటితో పాటు వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌  (ఓటీపీ) సైతం ఎంటర్‌ చేయాల్సిందే. ఇవి లేకుండా ఆన్‌లైన్‌లో డబ్బు కాజేయడం సాధ్యం కాదు. సాధారణంగా ఈ వివరాల కోసం సైబర్‌ నేరగాళ్లు వివిధ పేర్లు, వెరిఫికేషన్లు అంటూ, బ్యాంకు అధికారుల పేర్లతో ఫోన్లు చేయడం, మెయిల్స్‌ పంపడంతో పాటు సూడో సైట్లు సృష్టించే వారు. ఇప్పుడు మరో ‘అడుగు ముందుకు’ వేసి ‘అశ్లీలం దారి’ పట్టారని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చెప్తున్నారు. 

యువకులే టార్గెట్‌గా సైట్లు...
ఈ వ్యవహారంలో సైబర్‌ నేరగాళ్ల వల్లో ఎక్కువగా యువకులే పడుతున్నారు. వీరిని టార్గెట్‌గా చేసుకుని ఆకర్షించేందుకు ఇంటర్‌నెట్‌లో కొన్ని అశ్లీల వెబ్‌సైట్లను సైతం నేరగాళ్ళు రూపొందిస్తున్నారు. దీని సమాచారం, అర్ధనగ్న, నగ్న చిత్రాలతో కూడిన పాప్‌ అప్స్‌ను వివిధ సామాజిక నెట్‌వర్కింగ్‌ సైట్లతో పాటు వెబ్‌సైట్లకు లింక్‌ చేయడంతో పాటు అప్‌లోడ్‌ చేస్తున్నారు. వీటిని ఆకర్షితులవుతున్న యువత క్లిక్‌ చేసిన వెంటనే అవి ఓపెన్‌ అవుతున్నాయి. ఆ తరవాతే అసలు ఘట్టం ప్రారంభమవుతోంది. ఆ సైట్‌లోకి పూర్తిగా లాగిన్‌ కావాలన్నా, అందులో పొందుపరిచిన వీడియోలు, ఫొటోలు ఓపెన్‌ కావాలన్నా కొంత మొత్తం రుసుం చెల్లించాలంటూ ప్రత్యేక లింకు ఏర్పాటు చేస్తున్నారు. 

నేరుగా చేరిపోతున్న వివరాలు...
ఆ ప్రకారం ఆయా సైట్లలోకి లాగిన్‌ కావడానికి, వీడియోలు–ఫొటోలు చూడటానికి కార్డులు, నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా నగదు చెల్లించి సభ్యత్వం తీసుకోవాలని అక్కడ ఉంటోంది. దీంతో ‘కార్డుల’ వివరాలు, నెట్‌ బ్యాంకింగ్‌కు సంబంధించిన సమాచారాన్ని ‘వినియోగదారులు’ అందులో పూరిస్తున్నారు. ఈ వివరాలన్నీ నేరుగా సైబర్‌ నేరగాళ్లకు చేరిపోతున్నాయి. ఇవన్నీ వారి చేతికి చిక్కిన తర్వాత ఇక కావాల్సింది ఓటీపీ మాత్రమే. దీనికోసం సదరు వెబ్‌సైట్‌లోనే ప్రత్యేక లింకు ఏర్పాటు చేస్తున్నారు. ఓపక్క ఈ వివరాలతో ఆన్‌లైన్‌ లావాదేవీలు పూర్తి చేసి... ఓటీపీ వచ్చే విధంగా ఆప్షన్‌ ఎంచుకుని వేచి చూస్తున్నారు. ఆ యువకుడు వెబ్‌సైట్‌లో ఏర్పాటు చేసిన లింకులో దీన్ని పొందుపరిచిన వెంటనే లావాదేవీ పూర్తి చేసి ఆన్‌లైన్‌లో స్వాహా చేస్తున్నారు. ఈ వివరాలను వినియోగించి వారు తేలిగ్గా ఖాతాలు ఖాళీ చేయడమో, ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసి ‘కార్డు’లకు చిల్లు పెట్టడమో చేస్తున్నారు. ఈ నేరాలకు పాల్పడే వారు వినియోగిస్తున సర్వర్లు విదేశాల్లో ఉంటుండటంతో వారికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడం కూడా అసాధ్యంగా మారుతోందని అధికారులు చెప్తున్నారు.  

అలాంటి వారికి నైతికత ఉండదు  
‘ఆన్‌లైన్‌ షాపింగ్, చెల్లింపులు చేసేప్పుడు పూర్తి నమ్మకమైన సైట్ల ద్వారానే చేపట్టాలి. అశ్లీల సైట్లు నిర్వహించే వారికి నైతికత ఉండదన్నది గుర్తుంచుకోండి. అలాంటి వాళ్లు మీ కార్డులకు సంబంధించిన, ఆన్‌లైన్‌ ఖాతాల వివరాలు తెలిస్తే కచ్చితంగా దుర్వినియోగం చేస్తారు. ఈ తరహా నేరాల్లో మోసపోవడం ఎంత తేలికో... నిందితులు చిక్కడం, నగదు రికవరీ కావడం అంత కష్టం. అప్రమత్తంగా ఉండటం ద్వారానే సైబర్‌ నేరగాళ్లకు చెక్‌ చెప్పవచ్చు. ఇలాంటి అశ్లీల వెబ్‌సైట్ల వద్ద కొన్ని సందర్భాల్లో భయంకరమైన వైరస్‌లు కూడా కంప్యూటర్లు, ల్యాప్‌టాప్స్, స్మార్ట్‌ఫోన్లలోకి వచ్చి చేయతాయి. ఫలితంగా అవి పాడవటంతో పాటు డేటా మొత్తం క్రాష్‌ అయ్యే ప్రమాదం ఉంది.’– సైబర్‌ క్రైమ్‌ అధికారులు 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు