అయేషా మీరా కేసు; దూకుడు పెంచిన సీబీఐ

29 Jan, 2019 19:55 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన బీఫార్మసీ విద్యార్థిని అయేషా మీరా హత్య కేసు దర్యాప్తులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసులో ఇప్పటికే సీబీఐ పలువురిని విచారించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అయేషా మీరా కేసును తొలుత దర్యాప్తు చేసిన పోలీసులను ప్రశ్నించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా అప్పటి కమిషనర్‌ సీవీ ఆనంద్‌ సహా,  ఈ కేసులో ప్రత్యేక అధికారిగా వ్యవహరించిన నల్గొండ ఎస్పీ రంగనాథ్‌ను సీబీఐ విచారించనుంది. వీరితో సహా ముగ్గురు కమిషనర్లు, ముగ్గురు ఏసీపీలు, తొమ్మిది మంది కానిస్టేబుళ్లపై సీబీఐ విచారణ చేపట్టనుంది.

అయేషా మీరా హత్యకేసు..
కృష్ణాజిల్లా విజయవాడలోని ఇంబ్రహీంపట్నం హాస్టల్‌లో 2007 డిసెంబర్‌లో ఆయేషా మీరా దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సత్యంబాబును 2008 ఆగస్టు 17న నిందితుడిగా అరెస్టు చేశారు. సెల్‌ఫోన్‌ దొంగతనం కేసులో సత్యంబాబు పట్టుబడటంతో అతడిని.. ఆయేషా హత్య కేసులో నిందితుడిగా చూపించారనే ఆరోపణలు వచ్చాయి. హత్య కేసును విచారించిన విజయవాడ మహిళా కోర్టు 2010 సెప్టెంబర్‌ 29న సత్యంబాబును దోషిగా నిర్ధారిస్తూ జీవిత ఖైదు విధించింది. దీంతో సత్యంబాబు హైకోర్టును ఆశ్రయించగా, అతడిని నిర్దోషిగా ప్రకటిస్తూ గత ఏడాది మార్చి 31న తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు