చేసేది బీటెక్‌.. పనులు లోటెక్‌..

28 Oct, 2017 11:43 IST|Sakshi
నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న నగలు చూపుతున్న సీఐ వెంకటరత్నం

జల్సాల కోసం చోరీల బాట

దొంగతనం కేసులో ఇంజనీరింగ్‌ విద్యార్థి అరెస్ట్‌

5 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం

వివరాలు వెల్లడించిన వరంగల్‌ జీఆర్‌పీ సీఐ వెంకటరత్నం

వరంగల్‌ , రైల్వేగేట్‌: ఏం చేసైన ఎంజాయ్‌ చేయాలి.. జల్సా చేస్తూ సుఖపడాలి అనుకున్న ఓ బీటెక్‌ విద్యార్థిని దొంగతనం కేసులో పోలీసులు అరెస్ట్‌ చేశారు. నగరంలోని వరంగల్‌ జీఆర్‌పీ సీఐ జూపల్లి వెంకటరత్నం శుక్రవారం విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం.. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాకు చెందిన చౌహన్‌ సురజ్‌(21) హైదరాబాద్‌లోని సీఎంఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్నాడు. కాగా, ఈ నెల 21న కొత్తగూడెం నుంచి కుటుంబ సభ్యులతో పుష్‌పుల్‌ రైలులో వస్తున్న చిట్టి శ్రీనివాస్‌ భార్యకు చెందిన హ్యాండ్‌బ్యాగును వరంగల్‌ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ ఫామ్‌–2లో  రాత్రి 11.30 గంటలకు అపహరించాడు. దీంతో అదే రాత్రి బాధితులు వరంగల్‌ జీఆర్‌పీలో ఫిర్యాదు చేశారు.

దీంతో జీఆర్‌పీ పోలీసులు నేరస్తుడి కోసం తీవ్రంగా గాలించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో శుక్రవారం వరంగల్‌ రైల్వేస్టేషన్‌లో అనుమనాస్పదంగా కనిపిం చిన నిందితుడు చౌహన్‌ సిరజ్‌ను అరెస్ట్‌ చేశారు. అలాగే అతను అపహరించిన బ్యాగుతో పాటు అందులో ఉన్న 5తులాల బంగారు హారం, కమ్మలు, మాటీలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వెంకటరత్నం పేర్కొన్నారు. అనంతరం నిందితున్ని రిమాండ్‌కు తరలించామన్నారు. సమావేశంలో ఆర్‌పీఎఫ్‌ సీఐ రవిబాబు, జీఆర్‌పీ ఎస్సైలు పి.శ్రీనివాస్, ఎస్‌.శ్రీనివాస్, రాజేందర్, జితేందర్‌రెడ్డి, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు