బీటెక్‌ పట్టభద్రుల గంజాయి దందా

1 Mar, 2019 09:51 IST|Sakshi
పోలీసుల అదుపులో నిందితులు   

రాజేంద్రనగర్‌: జల్సాలకు అలవాటు పడిన ముగ్గురు బీటెక్‌ పట్టభద్రులు సంపాదన కోసం అక్రమ మార్గాన్ని ఎంచుకున్నారు. విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం నుంచి వివిధ మార్గాల ద్వారా గంజాయిని సేకరించి నగరంలోవిక్రయిస్తూ ఎక్సైజ్‌ పోలీసులకు చిక్కారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం జిల్లాకు చెందిన కె.అఖిల్, ఎస్‌.కె.నయీం, టి.భానుతేజ ముగ్గురూ స్నేహితులు.  బీటెక్‌ పూర్తి చేసిన వీరు ఉద్యోగ అన్వేషణలో భాగంగా నగరానికి వచ్చి మణికొండ ప్రాంతంలో గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. జల్సాలకు అలవాటు పడిన వీరు అందుకు అవసరమైన డబ్బులు సంపాదించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించారు.

ఈ నేపథ్యంలో గంజాయికి డిమాండ్‌ ఉన్నట్లు గుర్తించారు. స్వయంగా విశాఖ జిల్లా, అరకు ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళి గంజాయిని కోనుగోలు చేశారు. ఈ సందర్భంగా వారికి పలువురు గంజాయి విక్రేతలతో పరిచయం ఏర్పడింది. దీనిని ఆసరాగా తీసుకుని గత మూడు నెలలుగా గంజాయిని తెప్పించి వాటిని ప్యాకెట్ల రూపంలో విద్యార్థులు, అడ్డా కూలీలు తదితరులకు విక్రయిస్తున్నారు. దీనిపై సమాచారం అందడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పోలీసులు గురువారం మణికొండ ప్రాంతంలో కాపు కాశారు.

రోడ్‌ నెంబర్‌ 5 మీదుగా వెళుతున్న అఖిల్, నయీంలను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. వీరు ఉంటున్న గదిలో తనిఖీలు చేసి  విక్రయానికి సిద్దంగా ఉన్న తొమ్మిది కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల రాకను పసిగట్టిన భానుతేజ పరారైనట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. దాడిలో సీఐ శ్రీధర్, ఎస్సై కురుమానాయకులు, కానిస్టేబుళ్లు సుధాకర్, కృష్ణారావు, రవికుమార్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు