ఆరిన ఇంటిదీపం

15 May, 2019 07:29 IST|Sakshi
బాలుడి మృతదేహం , విరాట్‌ (ఫైల్‌)

విద్యుదాఘాతంతో 18 నెలల బాలుడి మృతి

గుండెలుబాదుకున్న తల్లిదండ్రులు

ధారూరు: ఆ ఇంటిదీపం ఆరిపోయింది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమారుడు అంతలోనే కానరాని లోకాలకు తరలివెళ్లాడు. విద్యుదాఘాతానికి గురై కన్నవారికి తీరని దుఃఖాన్ని మిగిల్చాడు. ఈ విషాదకర సంఘటన ధారూరు మండలంలోని తరిగోపులలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన బేగరి రాజు, స్వప్న దంపతులకు 18 నెలల బాబు విరాట్‌ ఉన్నాడు. గ్రామంలో తాగునీటి కొరత తీవ్రంగా నెలకొంది. మిషన్‌ భగీరథ నీరు రెండు, మూడు రోజులకొకసారి వస్తున్నాయి.

అవి కూడా తక్కువగా సరఫరా అవుతున్నాయి. దీంతో గ్రామంలో చాలామంది నల్లా పైప్‌కు సింగిల్‌ ఫేస్‌ మోటార్‌ను ఉపయోగిస్తుంటారు. ఈక్రమంలో రాజు భార్య స్వప్న మంగళవారం పైపునకు మోటారు బిగించి ఇంట్లో నీళ్లు పడుతోంది. అయితే, మోటార్‌కు ఉన్న విద్యుత్‌తీగ తెగిపోవడంతో అలాగే అతికించి దానికి టేప్‌ వేయలేదు.  ఈక్రమంలో తల్లి నీళ్లు పడుతుండగా బాలుడు విరాట్‌ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు విద్యుత్‌ తీగ తేలిన వద్ద తాకడంతో విద్యుదాఘాతానికి గురై అచేతనంగా పడిపోయాడు. కొద్దిసేపటికి కుటుంబీకులు గమనించి చికిత్స నిమిత్తం వికారాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొద్దిసేపటికే బాలుడు తుదిశ్వాస వదిలాడు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమారుడు అంతలోనే కన్నుమూయడంతో బాలుడి తల్లి స్వప్న రోదించిన తీరు హృదయ విదారకం. రాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

గతంలో అనారోగ్యంతో కూతురు..  
రాజు, స్వప్న దంపతులకు మొదటి కాన్పులో కూతురు పుట్టింది. గతేడాది ఆమె అనారోగ్యంతో మృతిచెందింది. రెండో సంతానంగా  విరాట్‌ పుట్టాడు. అతడు విద్యుత్‌ షాక్‌తో మృతి చెందడంతో ఆ దంపతులు రోదనలు మిన్నంటాయి. ఆ దేవుడికి ఏ పాపం చేశాం.. ఇద్దరు పిల్లలను తీసుకుపోయాడని రాజు, స్వప్న దంపతులు గుండెలుబాదుకుంటూ రోదించిన తీరు పలువురికి కంటతడి పెట్టించింది.  

>
మరిన్ని వార్తలు