నాలుగునెలల బాలుడి మృతి

26 Sep, 2019 13:19 IST|Sakshi

 వ్యాక్సిన్‌ వికటించిందని తల్లిదండ్రుల ఆరోపణ

అనారోగ్యంతోనే చనిపోయాడని డాక్టర్‌ వెల్లడి

నెల్లూరు,విడవలూరు: వ్యాధి నిరోధక వ్యాక్సిన్‌ వికటించి తమ నాలుగునెలల బాలుడు మృతిచెందాడని మండలంలోని దంపూరు గిరిజనకాలనీకి చెందిన ఆడిపూడి చెంచయ్య – చెంచమ్మ దంపతులు ఆరోపించారు. బుధవారం వారు వివరాలు వెల్లడించారు. చెంచయ్య – చెంచమ్మ దంపతులకు రెండో సంతానంగా నాలుగు నెలలు క్రితం బాలుడు జన్మించాడు. అతనికి గత శనివారం వావిళ్లకు చెందిన ఏఎన్‌ఎం పెంటా వ్యాక్సిన్‌ చేసి మాత్ర ఇచ్చింది. వ్యాక్సిన్‌ చేసిన గంట తర్వాత బాలుడు ఏడవటం మొదలుపెట్టాడు. పాలు పట్టించబోతే తాగలేదు. దీంతో తల్లి ఏఎన్‌ఎం ఇచ్చిన మాత్రలో కొంత భాగాన్ని బాలుడికి వేసింది. అయితే ఎలాంటి మార్పురాకపోగా సాయంత్రానికి బాలుడు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. తల్లిదండ్రులు అతను నిద్రపోతున్నాడని భావించారు. ఆదివారం ఉదయం బాలుడు లేవకపోవడంతో వెంటనే నెల్లూరులోని ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడ కొంతసేపు చికిత్స అందించిన తర్వాత బాలుడు మృతిచెందాడని వైద్యులు చెప్పారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చి సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విషయమై ఏఎన్‌ఎంను అడగ్గా బాలుడికి షుగర్, గుండెజబ్బు, మూర్ఛ వ్యాధులున్నట్లుగా చెప్పిందని తల్లిదండ్రులు వాపోయారు.

ఏఎన్‌ఎం శిరీషా నిర్లక్ష్యం కారణంగానే బాలుడు మృతిచెందాడని వారు ఆరోపించారు. దీనిపై రామతీర్థం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యుడు నరేంద్ర మాట్లాడుతూ బాలుడికి షుగర్, మూర్చ, గుండె జబ్బులున్నట్లు నెల్లూరు ప్రభుత్వ వైద్యశాల వైద్యులు నిర్ధారించారని, అందువల్లే మృతిచెందాడని తెలిపారు. వ్యాక్సిన్‌ బాలుడితోపాటు మరో ముగ్గురికి కూడా వేశారని, అయితే వారికి ఏమి కాలేదని తెలియజేశారు. 

మరిన్ని వార్తలు