కిడ్నాప్‌ల కలవరం

18 Mar, 2019 13:40 IST|Sakshi
బాలుడిని కిడ్నాప్‌ చేసి తీసుకెళుతున్న మహిళ (సీసీ టీవీ ఫుటేజి) (ఇన్‌సెట్‌లో) బాలుడు వీర (ఫైల్‌ఫొటో)

తిరుమలలో మూడునెలల బాలుడి అపహరణ

3నెలలు గడవక ముందే

మరో చంటిపిల్లాడి కిడ్నాప్‌

తిరుమల: శ్రీవారి సన్నిధిలో మూడునెలల బాబు కిడ్నాప్‌ ఉదంతం కలకలం రేపుతోంది. ఆది వారం వేకువజాము లేపాక్షి సమీపంలోని షాపింగ్‌ కాంప్లెక్స్‌ వద్ద నిద్రిస్తున్న బాలుడిని ఓ గుర్తు తెలియని మహిళ కిడ్నాప్‌ చేసి ఉడాయిం చింది. బాలుడి తల్లిదండ్రులు తమిళనాడుకు చెందిన మహవీర్, కౌసల్య దంపతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలిసులు బాలుడి జాడ కోసం గాలిస్తున్నారు.  లేపాక్షి  పరిసర ప్రాంతాల్లోని  సీసీ టీవీ  ఫుటేజ్‌లను పరిశీలించిన పోలీసులు బాబును ఎత్తుకెళ్లిన నిందితురాలి విజువల్‌ కనుగొన్నారు. కిడ్నాపర్‌ తిరుమలను వదిలివెళ్లిపోయారా లేదా అక్కడే ఉన్నారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

వసతి లేకనే వెతలు..
స్వామి వారి దర్శనార్థం నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. సాధారణ రోజుల్లో మినహా వారాంతాలు, పర్వదినాల్లో భక్తులకు వసతి సదుపాయం దొరకని పరిస్ధితి. దీంతో భక్తులు తిరుమలలోని ఖాళీ ప్రదేశాలు, పార్కులు, రోడ్ల పైనే సేదతీరుతుంటారు. దీన్ని అదునుగా తీసుకుంటున్న కొందరు పక్కా ప్లాన్‌తో కిడ్నాప్‌లకు పాల్పడుతున్నారు.

రద్దీ ప్రాంతాలే టార్గెట్‌..
ఇలా కొన్నేళ్లుగా చిన్నారుల కిడ్నాప్‌ తిరుమలలో సర్వసాధారణమైపోయింది. రద్దీ ప్రాంతా లనే టార్గెట్‌గా చేసుకుంటున్నారు.
2012 జూన్‌లో యాత్రికుల సముదాయం –1లో తమిళనాడు రాష్ట్రం అంబత్తూరుకు చెందిన రాజు, తంగప్రియ దంపతులకు చెందిన 8 నెలల బాలుడిని ఓ దుండగుడు అపహరించుకుపోయాడు. నేటికి బాబు జాడ తెలియరాలేదు.
అదే ఏడాది ఆగస్టు 31న నెల్లూరుకు చెందిన యశ్వంత్‌ అనే బాలుడు అపహరణకు గురయ్యాడు. ఈ రెండు కేసులు అపరిష్కృతంగానే ఉన్నాయి.
గత ఏడాది జనవరి 28న ఆదిలాబాద్‌కు చెందిన సంతోష్‌ దంపతులు వారి కుమారుడు ఆదిత్యతో యాత్రికుల  సముదాయం– 1లో బస చేశారు. నిద్రలేచేసరికి బాబు కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయిం చారు. పోలీసులు శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న ఆస్థానమండపం వద్ద బాబుని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు.
ఆ తర్వాత రోజే అనంతపురం జిల్లాకు చెందిన మహాత్మా, వరలక్ష్మి దంపతుల కుమార్తె నవ్యశ్రీని గుర్తు తెలియని వ్యక్తి కిడ్నాప్‌ చేశాడు. నాలుగు రోజుల తర్వాత మహబూబ్‌ నగర్‌ మేడ్చల్‌ వద్ద పోలీసులు నిందితుడిని పట్టుకుని పాపను వారి తల్లిదండ్రులకు అప్పగించారు.
జూన్‌ 14న అనంతపురం జిల్లా ఛాయాపురానికి చెందిన వెంకటేశ్వర్లు దంపతులు తమ పిల్లలతో ఆలయం వద్ద సేదతీరారు. ఎనిమిది నెలల చెన్నకేశవులను గుర్తుతెలియని వ్యక్తి అపహరించుకెళ్లాడు. 16 రోజుల తర్వాత తమిళనాడు నామక్కల్‌లో నిందితులను పోలీసులు అరెస్టు చేసి బాబును కాపాడారు.
ఈ ఉదంతం మరువకముందే జూలై 23న  శ్రీకాళహస్తికి చెందిన సురేష్‌ దంపతుల కుమార్తెను యాత్రికుల సముదాయం–4 వద్ద ఓ మహిళ అపహరించుకెళ్లింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు విస్తృతంగా గాలించిన పోలీసులు బెంగళూరులో కిడ్నాపర్‌ను అరెస్టు చేసి పాపను తల్లిదండ్రులకు అప్పగించారు.
గత ఏడాది డిసెంబర్‌ 28న మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్‌ కుమారుడు వీరేష్‌ యాత్రి కుల వసతి సముదాయం వద్ద అదృశ్యమయ్యాడు. 56 గంటలపాటు పోలీసులు గాలించడంతో బాబు ఆచూకీ లభ్యమైంది. డిసెం బర్‌ 30న మహారాష్ట్ర పోలీసులు అనుమానంతో బాబును కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సోషియల్‌ మీడియా ద్వారా తిరుమలలో బాలుడు కిడ్నాప్‌ అయిన విషయాన్ని గుర్తించిన మహారాష్ట్ర పోలీసులు అర్బన్‌ జిల్లా పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు బాలుడిని స్వాధీనం చేసుకుని తల్లిదండ్రులకు అప్పగించి కిడ్నాప్‌ కథకు సుఖాంతం పలికారు.

ఫిర్యాదుల్లో ఆలస్యం..
పోలీసులు అప్రమత్తంగా ఉన్నా భక్తుల ముసుగులో నిందితులు తిరుమలకు చేరుకుని చాకచక్యంగా చంటి పిల్లలను అపహరించుకుపోతున్నారు. మరోవైపు పిల్లలను ఎత్తుకెళ్లిన వెంటనే వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఆలస్యం చేయడంతో కిడ్నాపర్లు సులువుగా తిరుమల దాటేస్తున్నారు. దీంతో కిడ్నాప్‌ కేసులను ఛేదించడం పోలీసులకు కష్టతరంగా మారుతోంది. ఈ కారణంగానే గతంలోని రెండు కేసులలో పురోగతి కనిపించని పరిస్ధితి. ఇక ప్రస్తుతం కిడ్నాప్‌నకు గురైన వీరేష్‌ ఉదంతంలోనూ ఇదే పరిస్థితి పోలిసులకు ఎదురైంది. బాబు అదృశ్యమైన నాలుగు గంటల తర్వాత తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.
తిరుమలలో జరుగుతున్న వరుస కిడ్నాప్‌లను ఛాలెంజ్‌గా స్వీకరిస్తున్న పోలీసులు ఆలస్యంగానైనా ఛేదిస్తున్నారు. అదే పిల్లలు కిడ్నాప్‌ అయిన వెంటనే వారి తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం చేరవేస్తే మాత్రం కిడ్నాపర్ల ఆటకట్టించడం పోలీసులకు సులభతరంగా మారే అవకాశముంది.

మరిన్ని వార్తలు