ఆడపిల్ల పుట్టిందని కుమార్తెను చంపేశారు..

24 Sep, 2019 11:51 IST|Sakshi
స్పందనలో అర్జీ పరిశీలిస్తున్న ద్వారకా తిరుమలరావు 

సాక్షి, అమరావతి : ‘ఆడపిల్ల పుట్టిందని కుమార్తెను చంపేశారు..’  ‘హోటల్‌లో బకాయిలు చెల్లించమంటే డీజీపీ పేరు చెప్పి బెదిరిస్తున్నాడు..’ ‘ఆక్రమణలో ఉన్న నా పొలం నాకు అప్పగించినందుకు కృతజ్ఞతలు..’ ఇలా ఫిర్యాదుదారులు విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ను కలసి వినతులు అందజేశారు. సోమవారం కమిషనరేట్‌లో నిర్వహించిన ‘స్పందన’ కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వాటిని సీపీ ద్వారకా తిరుమలరావు, జాయింట్‌ సీపీ నాగేంద్రకుమార్, డీసీపీ కోటేశ్వరరావు పరిశీలించి సమస్యల పరిష్కారానికి స్టేషన్‌ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 166 ఫిర్యాదులు వచ్చాయి. వీటన్నింటిని వారంలోగా పరిష్కరించాలని సీపీ ఆదేశించారు. 

నిజం చెప్పండి.. 
‘సార్‌.. మాది మచిలీపట్నం మండలం గిలకలదిండి గ్రామం. మాకు ఇద్దరు సంతానం. కుమార్తె దివ్యను పల్లితుమ్మలపాలెం గ్రామానికి చెందిన కార్పెంటర్‌ అంకాని రాంకుమార్‌కు ఇచ్చి వివాహం చేశాం. ఆ సమయంలో కట్నం కింద ఎకరం పొలం, పసుపు కుంకుమ కింద రూ.50 వేలు ఇచ్చాం. దివ్య జనవరిలో ఆడపిల్లకు జన్మనిచ్చింది. కూతురుని చూడడానికి తండ్రి మూడు నెలలు మా ఇంటికే రాలేదు. ఐదో నెలలో కుమార్తెను అత్తవారింటికి పంపాం. వారు మూడు నెలల కిందట విజయవాడ శివార్లలోని పెనమలూరుకు వచ్చి నివసిస్తున్నారు. గత ఆగస్టు 20న తన బాబాయ్‌కు ఫోన్‌ చేసి తనను భర్త కొడుతున్నాడంటూ.. అదనపు కట్నం తెచ్చివ్వాలని వేధిస్తున్నాడంటూ.. తాను ఇంటికి వచ్చేస్తానంటూ బోరుమని విలపిస్తూ చెబుతుండగానే ఫోన్‌ కట్‌ అయింది. ఆ తర్వాత సాయంత్రం 5.30 గంటల సమయంలో మాకు ఫోన్‌ చేసి మీ కుమార్తె ఉరి వేసుకుని చనిపోయింది. మచిలీపట్నానికి ఆమెను తీసుకొస్తున్నామంటూ చెప్పి ఫోన్‌ పెట్టేశారు. అనుమానంతో కేసు పెట్టాం.. పెనమలూరు పోలీసులను ఎన్నిసార్లు ప్రయత్నించినా సరైన సమాధానం చెప్పడం లేదు. కుమార్తెను అత్తామామలు, బావ, భర్త కలసి చంపేశారు. పోస్టుమార్టం రిపోర్టులో ఏముందో చెప్పాలని వేడుకున్నా.. ఫలితం లేదు. మీరే మాకు న్యాయం చేయండి’ 
– బడుగు కనకదుర్గా, ఆదిశేషు, తల్లిదండ్రులు, పల్లితుమ్మలపాలెం

బిల్లు అడిగితే బెదిరిస్తున్నాడు.. 
లంకా దినకర్‌ మా హోటల్‌లో రెండున్నర నెలల పాటు ఉన్నాడు. బిల్లు అడిగిన ప్రతిసారి టీడీపీ నేతలతో ఫోన్లు చేయించేవాడు. వారు కూడా ఖాళీ చేసే సమయంలో డబ్బు మొత్తం చెల్లిస్తాడని చెప్పారు. చివరకు రూమ్‌ ఖాళీ చేసినా బిల్లు డబ్బులు రూ.2.50 లక్షలు చెల్లించలేదు. నిలదీస్తే డీజీపీ గౌతంసవాంగ్‌ పేరు చెబుతున్నాడు. అరెస్టు చేయిస్తానని బెదరిస్తున్నాడు. 
– శ్రీనివాస్, మేనేజర్, వైబ్రెంట్‌ హోటల్‌

నా పొలం నాకు దక్కింది.. 
సార్, ఆక్రమణలో ఉన్న నా పొలం మీ జోక్యంతో నాకు దక్కింది. తనఖా పెట్టిన తన భూమిని ఆక్రమించిన వారి నుంచి నా పొలం తిరిగి నాకు అప్పగించమని మీకు గత వారం ఫిర్యాదు చేయగా.. తక్షణమే మీరు స్పందించి నాకు న్యాయం చేశారు. మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. 
– డొకుపర్తి సత్యనారాయణ, ముస్తాబాద, గన్నవరం

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు