రిమ్స్‌లో శిశువు అపహరణ

11 Jul, 2018 02:27 IST|Sakshi

సీసీ కెమెరాలకు చిక్కకుండా జాగ్రత్తలు  

రెండు గంటల వ్యవధిలోనే ఛేదించిన పోలీసులు

తల్లి ఒడికి శిశువు.. కిడ్నాప్‌ కథ సుఖాంతం  

ఆస్పత్రిలో పనిచేసిన వారే నిందితులు  

ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆస్పత్రిలో నవజాత శిశువును అపహరించిందో మహిళ. సీసీ కెమెరాలకు చిక్కకుండా ఆస్పత్రి నుంచి బయటపడి.. పక్కా ప్రణాళికతో జిల్లా దాటేందుకు పన్నిన వ్యూహం బెడిసికొట్టింది. ఫిర్యా దు అందిన క్షణాల్లోనే స్పందించిన పోలీసులు.. రెండు గంటల వ్యవధిలోనే శిశువును తల్లి ఒడికి చేర్చారు. ఈ ఘటన మంగళవారం రిమ్స్‌ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. ఇటీవల హైదరాబాద్‌ సుల్తాన్‌బజార్‌ ప్రభుత్వ ఆస్ప త్రిలో శిశువు కిడ్నాప్‌ ఘటన మరువకముందే ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆస్పత్రిలో పసికందు అపహరణ కలకలం సృష్టిం చింది.

ఆదిలాబాద్‌ జిల్లా నార్నూర్‌ మండలం చోరపల్లికి చెందిన గణేష్‌ భార్య మమత ఆరు రోజుల క్రితం రిమ్స్‌ ఆస్పత్రిలో మగ శిశువుకు జన్మనిచ్చింది. మంగళవారం డిశ్చార్జి కావాల్సి ఉంది. ఆదిలాబాద్‌ పట్టణం పిట్టలవాడకు చెందిన సోయం పుష్పలత, నగేష్‌ దంపతులకు సంతానం లేదు. వీరిద్దరూ గతంలో రిమ్స్‌ ఆస్పత్రిలో పని చేశారు. పుష్పలత ఏఎన్‌ఎంగా శిక్షణ పొం దగా.. నగేష్‌ ఫుడ్‌ స్టోర్‌లో పని చేశాడు.

పిల్లలు లేకపోవడంతో రిమ్స్‌లో శిశువును అపహరించాలని నిర్ణయించారు. వీరికి ఆస్పత్రి పరిసరాలు తెలిసి ఉండటంతో సీసీ కెమెరాలకు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వేకువజామున 3 గంటల ప్రాంతంలో శిశువును అపహరించిన పుష్పలత.. రేడియాలజీ విభా గంలోకి వెళ్లి అక్కడ ఉన్న చిన్న గేటు నుంచి ఆస్పత్రి బయటపడింది. అయితే.. మమత స్పృహలోకి వచ్చి శిశువు కనిపించకపోవడంతో తెల్లవారుజామున 3.15కి రిమ్స్‌ పోలీసు ఔట్‌ పోస్టు సిబ్బందికి ఫిర్యాదు చేసింది.
 
వేకువజామున చెక్‌పోస్టులు.. తనిఖీలు
సమాచారం అందుకున్న ఆదిలాబాద్‌ డీఎస్పీ నర్సింహారెడ్డి, టూటౌన్‌ సీఐ స్వామి రిమ్స్‌కు చేరుకుని ఘటన వివరాలను ఎస్పీ విష్ణు ఎస్‌ వారియర్‌కు తెలిపారు. ఆయన ఆదేశాల మేర కు సరిహద్దు ప్రాంతాలతోపాటు మండలాల్లో ఎస్‌ఐలు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు.

నేరడిగొండ చెక్‌పోస్టు వద్ద జీపులో వెళ్తున్న మహిళను అనుమానించిన పోలీసులు ఆమె వివరాలు అడగడంతో అసలు విషయం బయటపడింది. తాను తీసుకెళ్తున్న పసికందును రిమ్స్‌ నుంచి తెచ్చానని చెప్పడంతో పోలీసులు పుష్పలత, నగేష్‌లను అదుపులోకి తీసుకున్నారు. శిశువుపై ఉన్న చిన్న గుడ్డ ఆధారంగా గుర్తుపట్టిన తల్లి తన బిడ్డేనని చెప్పడంతో ఆమెకు అప్పగించారు. నిందితులను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు