నర్సు నిర్వాకం : రెండు ముక్కలుగా శిశువు

11 Jan, 2019 10:57 IST|Sakshi

 ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దారుణం

ప్రసవ సమయంలో బిడ్డను బలవంతంగా లాగిన నర్సు

రెండు ముక్కలైన  శిశువు

జైపూర్‌: ప్రభుత్వ ఆసుపత్రుల సిబ్బంది నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలిచిన ఉదంతం ఒకటి రాజస్థాన్‌లో జరిగింది. తీవ్ర నిర్లక్ష్యంతో పుట్టబోయే బిడ్డని ఈ లోకాన్ని చూడకముందే  పొట్టన పెట్టుకుని, తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది ఓ నర్సు.  రాజస్థాన్‌, జైసల్మేర్‌లోని రాంగఢ్‌  ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది.  

వివరాల్లోకి వెళ్తే...దీక్షా కన్వర్‌ అనే మహిళకు నొప్పులు మొదలు కావడంతో జైసల్మేర్‌లోని రాంగఢ్‌ ఆరోగ్య కేంద్రానికి వెళ్లింది. అయితే ప్రసవ సమయంలో అక్కడి నర్సు శిశువును బలవంతంగా లాగింది. దీంతో  శిశువు రెండు ముక్కలుగా  విడిపోయింది. బిడ్డ కాళ్లు, సగం భాగం మాత్రమే బయటకి వచ్చి, మిగిలిన తల భాగం గర్భంలోనే ఉండిపోయింది.  అయితే ఈ సంగతిని దాచిపెట్టి, మాయమాటలు చెప్పిన సదరు నర్సు..లోపల మాయ ఉండిపోయిందంటూ వేరే ఆసుపత్రికి పంపించింది. దీంతో కుటుంబ సభ్యులు ఆ మహిళను జోధ్‌పూర్‌లో వేరే ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అసలు విషయాన్ని గుర్తించి, కుటుంబసభ్యులకు పరిస్థితి వివరించారు. ఆపరేషన్‌ చేసి, తల్లిని రక్షించారు.  

ఈ సంఘటనతో హతాశులైన బంధువులు, దీక్ష భర్త తిలోక్‌ భాటి ఆసుపత్రి సిబ్బంది నిర్వాకంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించి తమ బిడ్డను పొట్టన పెట్టుకున్నారని వాపోయారు. అంతేకాదు మద్యం సేవించిన ఆసుపత్రి సిబ్బంది తనతో అనుచితంగా ప్రవర్తించారని తిలోక్‌ భాటి ఆరోపించారు. ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు శిశువు మొండెం భాగాన్ని స్వాధీనం చేసుకున్నారు.  అనంతరం ఇద్దరు నిందితులపై  కేసు నమోదు చేశారు. 

మరిన్ని వార్తలు