రెండు రోజుల్లో వస్తానని చెప్పి..

30 May, 2018 12:45 IST|Sakshi
అరాఫత్‌(ఫైల్‌)

తైవాన్‌లో బద్వేలు వాసి ఆత్మహత్య

బద్వేలు అర్బన్‌: ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన ఓ యువకుడు రెండు రోజుల్లో ఇంటికి వస్తానన్నాడు.. ఇంతలో ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. తాను ఉంటున్న గదిలో మంగళవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. బద్వేలు పట్టణంలోని శాస్త్రీనగర్‌లో నివసించే జిందేషా సాహెబ్‌కు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వారిలో మూడో వాడైన షేక్‌ మహమ్మద్‌ అరాఫత్‌(34) అనంతపురంలోని ఎస్‌కే యూనివర్సిటీలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఏడాది నుంచి తైవాన్‌లోని చో యాంగ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీస్‌లో పోస్ట్‌ డాక్టర్‌ ఫెలో రీసెర్చ్‌గా ఉంటున్నాడు. ఈయనకు ప్రొద్దుటూరుకు చెందిన బీబి అయీషాతో మూడేళ్ల క్రితం వివాహం కాగా, 10 నెలల బాబు ఉన్నాడు.

రంజాన్‌ మాసం కావడంతో ఇంటికి వస్తున్నానని తల్లిదండ్రులకు, భార్యకు రెండు రోజుల క్రితం ఫోన్‌లో విషయం తెలిపారు. ఆ మేరకు టికెట్‌ కూడా బుక్‌ చేసుకున్నాడు. ఇంతలో ఏం జరిగిందో.. ఏమో తెలియదు కానీ తైవాన్‌లోని ఇండియన్‌ ఎంబసీ నుంచి అక్కడి అధికారులు బద్వేలులోని అరాఫత్‌ సోదరునికి ఫోన్‌ చేశారు. అరాఫత్‌ ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన విషయాన్ని వారు తెలిపారు. ‘ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం సాధించాలని విదేశాలకు వెళ్లి శవమై వస్తున్నావా’.. అంటూ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.

మరిన్ని వార్తలు