‘ఐటీ గ్రిడ్స్‌’ నిందితులకు బెయిల్‌

11 Jun, 2019 03:02 IST|Sakshi

షరతులతో ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు 

సాక్షి, హైదరాబాద్‌: ఓటర్ల డేటా, ఆధార్‌ వంటి వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేశారనే ఆరోపణలున్న కేసులో ఐటీ గ్రిడ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండి డి.అశోక్, ఆ సంస్థ డైరెక్టరైన ఆయన భార్య శ్రీలక్ష్మికి షరతులతో కూడిన బెయిల్‌ మంజూరైంది. అత్యంత కీలకమైన ఓటర్, ఆధార్, వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేశారని ఐటీ గ్రిడ్స్‌పై డేటా విశ్లేషకులు టి.లోకేశ్వర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై హైదరాబాద్‌లోని ఎస్సార్‌నగర్, మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్లల్లో కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో పోలీసుల దర్యాప్తునకు సహకరిస్తామని, తమకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని వారిద్దరూ దాఖలు చేసిన వ్యాజ్యాలను సోమవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ గండికోట శ్రీదేవి విచారించారు.

ఇద్దరికీ షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేశారు. రూ.25 వేల విలువైన పూచీకత్తులను ఇద్దరూ సమర్పించాలని, సంబంధిత పోలీస్‌స్టేషన్లలో రోజూ హాజరుకావాలని, ఏదైనా కోర్టులో పాస్‌పోర్టులు సరెండర్‌ చేయాలని, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని హైకోర్టు షరతులు విధించింది. ఐటీ గ్రిడ్స్‌తో టీడీపీ చేతులు కలిపి కీలకమైన ఓటర్ల వివరాలను ఆ కంపెనీకి అందజేసిందని, అందులో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వారి ఓట్లను తొలగించే ప్రయత్నం చేశారని లోకేశ్వర్‌రెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో గత నెల 25న రంగారెడ్డి జిల్లా కోర్టు బెయిల్‌ దరఖాస్తులను తిరస్కరించగా ఇప్పుడు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.  

మరిన్ని వార్తలు