అస్తమించిన ‘సంధ్య’

23 Dec, 2017 08:38 IST|Sakshi
కేంద్ర మాజీమంత్రి దత్తాత్రేయ కాళ్లు పట్టుకుని విలపిస్తున్న సంధ్య తల్లి

సంధ్య మృతితో దిక్కుతోచని స్థితిలో ఆమె కుటుంబం

కార్తీక్‌ను తానే పోలీసులకు అప్పగించానన్న అతడి తల్లి

హతురాలి కుటుంబానికి ప్రముఖుల పరామర్శ

కనుమూసిన ప్రేమోన్మాది బాధితురాలు ప్రేమోన్మాది నిప్పంటించడంతో తీవ్రంగా గాయపడిన సంధ్యారాణి మృత్యువుతో పోరాడి శుక్రవారం ఉదయం గాంధీ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచింది. దీంతో లాలాపేట్‌ భజన సమాజం ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సంధ్య మృతితో ఆమె కుటుంబం ఓ ఆధారాన్ని కోల్పోయింది. జరిగిన ఘటనపై మహిళా సంఘాలు తీవ్రస్థాయిలో స్పందించాయి. నిందితుని కఠినంగా శిక్షించాలని నినదించాయి. 

సాక్షి, సిటీబ్యూరో: ఆమె కుటుంబానికి సంధ్య సంపాదన సైతం ఓ ఆధారం. ఆమె మరణంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. లాలాపేట ప్రాంతానికి చెందిన సావిత్రి భర్త దాసు కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. అనంతరం సావిత్రి తన సంతానంతో కలిసి వినోభానగర్‌లో కొంతకాలం నివసించారు. ఆపై కొన్నాళ్ల క్రితం అక్కడ నుంచి లాలాపేట్‌లోని భజన సమాజం ప్రాంతంలోని అద్దె ఇంట్లోకి మారారు. సావిత్రికి ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. కుమారులు సాయికుమార్, వినోద్, కిరణ్‌లలో అనారోగ్య కారణాల నేపథ్యంలో వినోద్‌ ఇంటికే పరిమితమయ్యాడు. కుమార్తెలు సరిత, సుజాత, సంధ్యారాణిలలో సరితకు వివాహం కాగా.. సుజాత, సంధ్యరాణి చిరుద్యోగాలు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. సంధ్య సోదరులైన సాయికుమార్, కిరణ్‌లు స్థానికంగా చిన్న ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారు. వీరంతా కలిసే నివసిస్తున్నారు. సంధ్య మరణంతో ప్రస్తుతం ఆ కుటుంబం ఓ దిక్కును కోల్పోయినట్లయ్యింది. శుక్రవారం ఉదయం 7.30 గంటలకు సికింద్రా బాద్‌లో ఉన్న  గాంధీ ఆస్పత్రి బరŠన్స్‌ వార్డులో మృతిచెందిన సంధ్య మృతదేహానికి అక్కడి మార్చురీలో పోస్టుమార్టం పరీక్షలు నిర్వహిం చారు. అక్కడకు ఆమె కుటుంబసభ్యులు, బంధువులు, బస్తీవాసులు పెద్దసంఖ్యలో చేరుకున్నారు.

వారి రోదనలతో మార్చురీ ప్రాంతం శోకసంద్రంగా మారింది. విగతజీవిగా పడున్న కుమార్తెను చూసి సంధ్య తల్లి గుండెలవిసేలా విలపించారు. నిందితుడు కార్తీక్‌ను సజీవదహ నం చేయాలని అప్పుడే తన కుమార్తె ఆత్మ శాంతిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మాజీ మంత్రి, పార్లమెంట్‌ సభ్యుడు బండారు దత్తాత్రేయ, మాజీ మేయర్‌ బండ కార్తీకరెడ్డి మార్చురీ వద్ద సంధ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. సంధ్యారాణి కుటుంబాన్ని అన్నివిధాల ఆదుకునేందుకు కృషి చేస్తామన్నారు. హతురాలి తల్లి సావిత్రి ఎంపీ దత్తాత్రేయ కాళ్లు పట్టుకుని రోధిస్తూ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, తనకు కలిగిన కడుపుకోత ఎవరికీ కలగకుండా చర్యలు చేపట్టాలని వేడుకోవడం అక్కడి వారి కళ్లు చెమర్చేలా చేసింది. సంధ్య కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలని, కార్తీక్‌ను కఠినంగా శిక్షించాలని మాజీ మేయర్‌ బండ కార్తీకరెడ్డి డిమాండ్‌ చేశారు. పోస్టుమార్టం అనంతరం సంధ్యారాణి మృతదేహాన్ని ప్రత్యేక అంబులెన్స్‌లో శాంతినగర్‌లోని వారి ఇంటికి తరలించారు. స్థానిక కార్పొరేటర్‌ ఆలకుంట సరస్వతి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.5 వేలు ఆర్థిక సహాయం అందించారు. మహిళా సంఘాల నేతలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు సంధ్య మృతదేహానికి శ్రద్ధాంజలి ఘటించారు.

సంధ్య మృతదేహం వద్ద విలపిస్తున్న తల్లి
సంధ్య కుటుంబ సభ్యులు, బంధువులు మాట్లాడుతూ గతంలో వరంగల్‌ జిల్లాలో యాసిడ్‌ దాడి జరిగినప్పుడు 24 గంటలు గడవక ముందే అక్కడి పోలీసులు నిందితుల్ని ఎన్‌కౌంటర్‌ చేశారు. ఇప్పుడు కార్తీక్‌ను అలాగే చేయాలని డిమాండ్‌ చేశారు. కుటుంబ సభ్యులు, బంధువుల ఆశ్రునయనాల మధ్య సాయంత్రం 4 గంటలకు లాలాపేటలోని హిందూ శ్మశానవాటికలో సంధ్యారాణి అంత్యక్రియలు జరిగాయి. సంధ్య కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. సంధ్య మృతదేహానికి ఆమె ఇంటి వద్ద నివాళులర్పించిన ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. అంతక్రియల నిమిత్తం రూ.20 వేలు ఆర్థిక సాయం అందించారు. ఆయన మాట్లాడుతూ... సంధ్యారాణి ఘటన చాలా బాధాకరం అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గస్తీని పెంచుతామన్నారు. ప్రేమ పేరుతో వేధింపులకు గురవుతున్న యువతులు పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. స్థానిక శాసన సభ్యులు, మంత్రి పద్మారావు శబరిమల పర్యటనలో ఉన్నారని, వారు నగరానికి రాగానే మాట్లాడి సంధ్యారాణి కుటుంబానికి డబుల్‌ బెడ్‌రూం ఇంటితో సహా ఇతర సహాయ సహకారాలు అందేలా కృషిచేస్తానని పేర్కొన్నారు.

కార్తీక్‌ను నేనే పోలీసులకు అప్పగించా
సంధ్యారాణి నిత్యం మా బస్తీ మీదుగా వెళ్తుండేది. ప్రతిరోజు తనను చూసి నవ్వేదని కార్తీక్‌ చెప్పేవాడు. ఆఫీసుకు వెళ్లడానికి ఇబ్బందిగా ఉందనడంతో అప్పు చేసి బైక్‌ కొనిచ్చా. అనేకసార్లు సంధ్యారాణిని బండిపై ఎక్కించుకొని లాలాపేట బస్టాండ్‌లో కనిపించాడు. అమ్మాయి ఎవరు అని అడిగితే, మేమిద్దరం ప్రేమించుకుంటున్నామని చెప్పాడు. ఆమె కోసమంటూ నాతో ఎన్నోసార్లు రకరకాల వంటకాలు వండించుకుని తీసుకువెళ్లాడు. గురువారం రాత్రి ఫోన్‌ చేసి ‘సంధ్యపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాను అమ్మా! బతికుందో లేదో తెలీదు, నేను కూడా చనిపోవడానికి మౌలాలి రైల్వేస్టేషన్‌కు వచ్చాను’ అని చెప్పాడు. నువ్వు చనిపోతే అమ్మాయి కుటుంబ సభ్యులు మన కుటుంబంపైకి వస్తారు. అక్కడే ఉండు అంటూ నేను వెళ్లాను. కార్తీక్‌ను స్వయంగా తీసుకువెళ్లి పోలీసులకు అప్పగించాను.     – ఊర్మిల (కార్తీక్‌ తల్లి)

మరిన్ని వార్తలు