సంచలన కేసులో రేపు శిక్షలు ఖరారు

7 Nov, 2017 20:12 IST|Sakshi

కోల్‌కతా : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన క్రైస్తవ సన్యాసిని అత్యాచార కేసులో నిందితులను.. దోషులుగా న్యాయస్థానం నిర్ధారించింది. ప్రధాన నిందితుడు నజ్రుల్‌ ఇస్లాంను అత్యాచార కేసులో.. నజ్రుల్‌తోపాటు మిగతా వారిని దోపిడీ కేసులో దోషులుగా గుర్తిస్తున్నట్లు జిల్లా సెషన్స్‌ కోర్టు తెలిపింది. 

ఆరుగురు బంగ్లాదేశీయులను... వారికి ఆశ్రయం కల్పించిన గోపాల్‌ సర్కార్‌ అనే వ్యక్తిని దోషులుగా తేల్చింది. తీర్పు సందర్భంగా జడ్జి కుంకుమ్‌ శర్మ చేసిన వ్యాఖ్యలివే. ‘‘ఈ ఘటనతో పశ్చిమ బెంగాల్‌ పరువు పోయింది. మదర్ థెరిసా, సిస్టర్ నివేదిత లాంటి వాళ్లు సేవలందించిన నేల ఇది. అలాంటి చోట నిరాడంబరంగా సేవలందిస్తున్న ఓ ముదుసలి సన్యాసిని అతి కిరాతంగా అత్యాచారం చేశారు. వీరికి సమాజంలో తిరిగే హక్కు ఏ మాత్రం లేదు’’ అన్నారు. తొలుత ఇది సాముహిక అత్యాచారంగా భావించినప్పటికీ.. దర్యాప్తులో కాదని తేలిందని జడ్జి వివరించారు. బుధవారం వీరికి శిక్షలు ఖరారు చేయనున్నట్లు కోర్టు తెలిపింది. కాగా, వారి శిక్షలు జీవిత ఖైదు పడే అవకాశం ఉన్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ అనింద్య రౌత్‌ చెప్పారు.

బంగ్లాదేశ్‌ కు చెందిన నజ్రుల్ ఇస్లాం  అలియాస్‌ నోజు మిగతా వారితో కలిసి మార్చి 14, 2015న నదియా జిల్లాలోని రానాఘాట్‌లోని ఓ చర్చిలో దోపిడీకి పాల్పడ్డారు. ఆ సమయంలో నజ్రుల్‌ 71 ఏళ్ల క్రైస్తవ సన్యాసినిని దారుణంగా అత్యాచారం చేశాడు. ఆపై మిగతా వారంతా అక్కడి కంప్యూటర్లు, డబ్బుతో పరారయ్యారు. దేశ వ్యాప్తంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని క్రైస్తవ సంఘాలు, మహిళా సంఘాలు పెద్ద ఎత్తున్న ఆందోళన చేపట్టాయి. 

ఘటన తర్వాత గోపాల్‌ శర్మ అనే వ్యక్తి నిందితులందరికీ తన ఇంట్లో ఆశ్రయం కల్పించాడు. ఆపై ప్రధాన నిందితుడు నోజును జూన్ 17, 2015న సీల్దా రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. రానాఘాట్‌ బంగ్లాదేశ్‌కు కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉండగా.. గెడె స్టేషన్ నుంచి రైలు మార్గం ద్వారా వారు దేశంలోకి ప్రవేశించినట్లు దర్యాప్తులో తేలింది. మొత్తం 42 మందిని విచారించిన పోలీసులు. నోజుతోపాటు 10 మందికి ఐడెంటిఫికేషన్‌ పెరేడ్‌ నిర్వహించారు. ఇందులో సన్యాసినితోపాటు సెక్యూరిటీ గార్డు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు