జనం సొమ్ముతో జల్సా

13 Jun, 2018 12:27 IST|Sakshi
స్వాధీనం చేసుకున్న నగదు, బంగారు ఆభరణాలు

బ్యాంక్‌లో డబ్బు షేర్స్‌లో పెట్టి..కటకటాలపాలైన ఉద్యోగి

సాధారణ కుటుంబం నుంచి అసాధారణ స్థాయికి ఎదగాలని పేరాశ

చీటింగ్‌ కేసులో ముగ్గురి అరెస్టు

రూ. 56.76 లక్షల నగదు, 1.718 కిలో గ్రాముల బంగారు స్వాధీనం

కడప అర్బన్‌ : సామాన్య కుటుంబం నుంచి వచ్చిన మార్తల గురుమోహన్‌రెడ్డి డిగ్రీ వరకు చదివి బ్యాంకు ఉద్యోగిగా సెలెక్ట్‌ అయ్యాడు. ఉద్యోగం చేస్తూ భార్య, పిల్లలను పోషించుకుని జీవితం సాగించాల్సిన ఆయన.. డిగ్రీ చదువుతున్న వయసు నుంచే వ్యాపార రంగంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలలుగన్నాడు. అయితే తన ప«రిధిలో, అందుబాటులో ఉన్న నగదు, సహోద్యోగులను ఉపయోగించుకుని తద్వారా డబ్బు తీసుకుని.. వారి కళ్లు గప్పి ఏకంగా షేర్‌ మార్కెట్‌లో పెట్టాడు. ఉద్యోగంలో చేరిన కొన్నేళ్లకే.. షేర్‌ మార్కెట్‌ మోజుతో కటకటాల పాలయ్యాడు. మొదటగా మైదుకూరు ఎస్‌బీఐలో పని చేసే సమయంలోనే ఏటీఎంలలో డబ్బులు పెడుతూ.. రూ.30–40 లక్షలు కాజేశాడు. ఈ విషయాన్ని అప్పట్లో బ్యాంకు అధికారులు పసిగట్టి సస్పెన్షన్‌ చేశారు. వెంటనే ఆ మొత్తాన్ని చెల్లించడంతో తిరిగి పోరుమామిళ్లలోని రంగసముద్రం ఎస్‌బీఐ బ్రాంచ్‌కు క్యాషియర్‌గా పంపించారు.

రంగసముద్రంలో చెలరేగాడు
రంగసముద్రం ఎస్‌బీఐ బ్రాంచ్‌లో క్యాషియర్‌గా పని చేస్తున్న మహిళా ఉద్యోగి.. క్యాష్‌ ఇన్‌చార్జిగా ఉన్న గురుమోహన్‌రెడ్డిని నమ్మి సేఫ్‌ లాకర్‌ నుంచి నగదును తీసుకొచ్చి మరలా పెట్టడం లాంటి ప్రక్రియను అప్పగించింది. అమాయకురాలైన ఆమె అతని చర్యలను పసిగట్టలేకపోయింది. దీంతో ఖాతాదారులకు సంబంధించిన దాదాపు రూ.2.50 కోట్ల మేరకు బంగారు ఆభరణాలు, నగదు కాజేశాడు. ఆ డబ్బులను ఏటీఎంలో పెట్టేటపుడు తీసుకునే వాడు. ఉదాహారణకు రూ. 40 లక్షలు నగదును మిషన్‌లో పెట్టేటపుడు అందులో కొన్ని లక్షల రూపాయలు పక్కకు తీసి.. ఆన్‌లైన్‌లో మాత్రం రూ.40 లక్షలనే పెట్టినట్లుగా చూపిం చేవాడు. అలాగే బంగారు ఆభరణాలను కూడా ప్రొద్దుటూరులోని తన భార్య మంజులత ఖాతా లో తనఖా పెట్టి.. ఆ డబ్బును మరలా తన ఖాతా లోకి జమ చేసుకునే వాడు. ఏరోజుకారోజు షేర్స్‌లో డబ్బులు పెడుతుండడంతో.. లాభాలు వచ్చి న తర్వాత అదే డబ్బును మరలా మరుసటి రోజు షేర్స్‌లో పెట్టేవాడు. ఎక్కువ మొత్తం వస్తుందని ఆశ పడడం, మరలా నష్టపోవడం పరిపాటిగా మారింది. గతంలో మైదుకూరులో జరిగిన సంఘటన పునరావృతం అవుతుందని భావించాడు. ఆడిటింగ్‌ వారు కూడా వస్తారని, అదే సమయంలో తాను చేసిన చీటింగ్‌ వ్యవహారం బట్టబయలవుతుందని పసిగట్టాడు. మార్చి 28న తన భార్యతోపాటు రూ. 91 లక్షల నగదు, బంగారు ఆభరణాలు తీసుకుని పరారయ్యాడు.

ఆటకట్టు
గురుమోహన్‌రెడ్డి బద్వేలు, చెన్నైలో ఉన్న సురేష్‌రెడ్డి, కుమార్‌కు లక్షల్లో డబ్బులను ఇచ్చి తమ అవసరాలకు వాడుకోవాలని.. మరలా తాను తీసుకుంటానని చెప్పాడు. ఈ క్రమంలోనే తన వెంట తెచ్చుకున్న డబ్బును మరలా షేర్లలో పెట్టడంతో..  వస్తూ పోతూ ఉండడం గమనించాడు. ఈ వ్యవహారాన్ని తెలుసుకున్న భార్య అతనితోపాటు ఉండకుండా ప్రొద్దుటూరులో తాము ఉంటున్న ఇంటికి వచ్చేసింది. అప్పటికే పోరుమామిళ్ల పోలీసులకు బ్యాంకు అధికారులు, ఖాతాదారులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. భార్య పోలీసులకు చిక్కిందని తెలుసుకున్న గురుమోహన్‌రెడ్డి తన దగ్గర ఉన్న డబ్బులు, బంగారు నగలు తీసుకుని వచ్చేశాడు. ఈ నెల 11న కడప ఆర్టీసీ బస్టాండు సమీపంలో ఉండగా మైదుకూరు డీఎస్పీ బీఆర్‌ శ్రీనివాసులు, పోరుమామిళ్ల సీఐ మధుసూదన్‌గౌడ్, ఎస్‌ఐలు ఘన మద్దిలేటి, పెద్ద ఓబన్న తమ సిబ్బందితో కలసి గురుమోహన్‌రెడ్డిని, అతనికి ఆశ్రయం కల్పించిన సురేష్‌రెడ్డి, కుమార్‌ను అరెస్టు చేశారు.

నిందితుల అరెస్టుతోపాటు బంగారు, నగదు రికవరీ
పోరుమామిళ్ల టౌన్‌లోని రంగసముద్రం ఎస్‌బీఐలో క్యాష్‌ ఇన్‌చార్జిగా పని చేసిన గురుమోహన్‌రెడ్డి, అతని స్నేహితులు సురేష్‌రెడ్డి, కుమార్‌ను అరెస్టు చేసినట్లు ఓఎస్‌డీ అద్నాన్‌ నయీమ్‌ అస్మి తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి రూ. 56.76 లక్షల నగదు, రూ. 51.54 లక్షల విలువైన 1.718 కిలో గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం కోటి ఎనిమిది లక్షల రూపాయలు ఉంటుంది. నిందితులను అరెస్టు చేయడంలో కృషి చేసిన పోలీసు అధికారులను ఓఎస్‌డీ అభినందించారు.

మరిన్ని వార్తలు