కోరిక తీరిస్తే రుణం ఇస్తా..

24 Jun, 2018 02:24 IST|Sakshi

మహారాష్ట్రలో మహిళా రైతు పట్ల బ్యాంక్‌ మేనేజర్‌ అసభ్య ప్రవర్తన

బుల్దానా: రుణం మంజూరు కావాలంటే తన కోరిక తీర్చాలంటూ ఓ మహిళారైతును బ్యాంక్‌ మేనేజర్‌ కోరారు. ఈ ఫోన్‌ సంభాషణను రికార్డు చేసిన ఆ మహిళ, భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహారాష్ట్రలోని దతాలా గ్రామానికి చెందిన ఓ మహిళా రైతు పంట రుణం కోసం ఈ నెల 18వ తేదీన స్థానిక సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శాఖ మేనేజర్‌ రాజేశ్‌ హివాసేను సంప్రదించారు. ఆమె దరఖాస్తును పరిశీలించిన మేనేజర్, ఫోన్‌ నంబర్‌ను అడిగి తీసుకుని తనతో ‘టచ్‌’లో ఉండాల్సిందిగా కోరారు. అనంతరం ఆమెకు ఫోన్‌ చేసి అభ్యంతరకరంగా మాట్లాడారు. 22వ తేదీన బ్యాంక్‌ ప్యూన్‌ మనోజ్‌ చవాన్‌ ఆమెకు ఫోన్‌ చేసి.. మేనేజర్‌ కోరిక తీరిస్తే రుణం ఎక్కువ మంజూరవుతుందంటూ మాట్లాడాడు.

అయితే, ఆ మహిళ వీరిద్దరి ఫోన్‌ సంభాషణలను రికార్డు చేశారు. ఈ సంభాషణలతో కలిపి ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు బ్యాంకుకు వెళ్లగా మేనేజర్‌తోపాటు ప్యూను వారిని చూసి పరారయ్యారు. అయితే, ఈ విషయం తెలిసిన గ్రామస్తులు వందలాది మంది బ్యాంకుకు చేరుకుని ఆందోళన చేపట్టారు. బ్యాంక్‌ మేనేజర్‌ కనిపిస్తే చంపేస్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, బ్యాంక్‌ మేనేజర్‌తోపాటు ప్యూన్‌పై పోలీసులు కేసులు నమోదు చేశారు. పరారీలో ఉన్న మేనేజర్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ కేసును జిల్లా కలెక్టర్‌ నిరుపమా దాంగే ప్రత్యేకంగా పర్యవేక్షిస్తారని ప్రభుత్వం తెలిపింది.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు