భార్యను హతమార్చి భర్త ఆత్మహత్య

23 Jul, 2018 08:23 IST|Sakshi
భర్త మాధవ్‌తో సుమలత (పైల్‌ ఫోటో)

పెళ్లైన పది నెలలకే విషాదం

మృతురాలు ఏడు నెలల గర్భిణి

హైదరాబాద్‌: భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలతో మనస్తాపం చెందిన ఓ బ్యాంక్‌ ఉద్యోగి ఏడు నెలల గర్భవతి అయిన భార్యను దారుణంగా హతమార్చాడు. ఆ తరువాత భార్య మృతదేహాన్ని బెడ్‌రూమ్‌లోనే ఉంచి, ఇంటికి తాళం వేసి, రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ జిల్లా కేతేపల్లికి చెందిన బయ్య లింగమల్లమ్మ, సర్వయ్య దంపతుల కుమార్తె సుమలత(25)కు మిర్యాలగూడకు చెందిన ఎం.మలయాద్రి కుమారుడు మేకల మాధవ్‌ (30)తో కిందటేడాది అక్టోబర్‌ 5న వివాహం జరిగింది. ఆ సమయంలో అల్లుడు మాధవ్‌కు రూ.6 లక్షల నగదు, మూడు తులాల బంగారు ఆభరణాలు కట్నంగా ఇచ్చారు. వివాహం అయిన కొంతకాలం వీరి కాపురం సజావుగా నడిచింది.

భార్య మెడ చుట్టూ చున్నీ బిగించి..
నల్లకుంట సిండికేట్‌ బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తున్న మేకల మాధవ్‌ శంకరమఠం ఎదురు వీధిలో గల ఆరో విల్లా అపార్ట్‌మెంట్‌ మూడో అంతస్తులోని ఫ్లాట్‌ నంబర్‌ 303లో అద్దెకు దిగాడు. ఏడు నెలల గర్భవతి అయిన సుమలత గత కొంతకాలంగా పుట్టింట్లోనే ఉంటూ ఈ నెల 16న తల్లితో కలసి భర్త వద్దకు వచ్చింది. తల్లి ఈ నెల 18న సాయంత్రం కుమార్తెను ఇక్కడే వదిలి స్వగ్రామానికి వెళ్లిపోయింది. ఇంట్లో జరిగిన విషయాలకు మనస్తాపం చెందిన మాధవ్‌ శనివారం మధ్యాహ్నం భార్య సుమలత మెడ చుట్టూ చున్నీతో బిగించి హత్య చేశాడు. ఆ తరువాత ఆమె మృతదేహాన్ని బెడ్‌రూమ్‌లోనే ఉంచి, ఇంటికి తాళం వేసి సమీపంలో ఉన్న రైలు పట్టాలపైకి వెళ్లి.. నడుస్తున్న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుకుని ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు.. మృతుని ఐడీ కార్డు ఆధారంగా వివరాలు తెలుసుకుని అతని తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

భర్త ఆత్మహత్యతో బయటపడిన భార్య హత్య
మాధవ్‌ తండ్రి మలయాద్రి శనివారం సాయంత్రం 4.30కి వియ్యంకురాలు లింగమల్లమ్మకు ఫోన్‌ చేసి తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. వెంటనే లింగమల్లమ్మ కుమార్తెకు ఫోన్‌ చేయగా స్పందన లేదు. దీంతో అనుమానం వచ్చిన లింగమల్లమ్మ బంధువులతో కలసి రాత్రి 8.30 గంటలకు నల్లకుంటలో కుమార్తె నివాసముంటున్న ఇంటి వద్దకు చేరుకుంది. ఇంటికి తాళం వేసి ఉండటంతో.. పోలీసుల సమక్షంలో తాళం పగులగొట్టి చూడగా సుమలత బెడ్‌రూమ్‌లో విగత జీవిగా పడి ఉంది. ఆదివారం మధ్యాహ్నం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. నల్లకుంట సీఐ వి.యాదగిరిరెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు