రూ. 24 లక్షలు గోవిందా! బ్యాంకు అధికారులు బుక్‌

1 Jan, 2020 10:43 IST|Sakshi

బీఎస్‌ఎన్‌ఎల్‌కు నకిలీ చెక్‌ల సెగ

రూ. 24 లక్షలు విత్‌ డ్రా

 బ్యాంకు అధికారులపై కేసు

సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ ఖాతానుంచి రూ. 24 లక్షలు మోసపూరితంగా దారి మళ్లాయి.  ఢిల్లీలోని  కేజీ మార్క్‌వద్ద ఉన్న ఒక ప్రభుత్వ రంగ బ్యాంకులో బీఎస్‌ఎన్‌ఎల్‌ చెక్కుల పేరుతో  అక్రమంగా నగదు విత్‌ డ్రా అయింది.  తద్వారా నకిలీ చెక్కులతో  అక్రమార్కులు, అటు బ్యాంకునకు, ఇటు బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థకు కుచ్చు టోపీ పెట్టారు.  ఈ విషయాన్ని ఆలస్యంగా గ్రహించిన బీఎస్‌ఎన్‌ఎల్‌  అధికారులు  సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అధికారికంగా తాము ఎలాంటి చెక్కులు జారీ చేయకుండానే తమ ఖాతా నుంచి రూ .24 లక్షలకు పైగా  నగదును తప్పుగా డెబిట్ చేశారనే డీప్యూటీ మేనేజర్‌ లీలా రామ్‌ మీనా ఆరోపించారు.  ఈ విషయమై బ్యాంకు అధికారులను సంప్రదించి, తమ డబ్బును తిరిగి ఖాతాలో జమచేయాల్సిందిగా కోరామని దీనికి బ్యాంకు తిరస్కరించిందని తెలిపారు. నవంబర్ 21న రూ. 66,505 విలువైన చెక్‌తోపాటు మొత్తం మూడు చెక్కులిచ్చామని, అయితే అవి సంబంధిత  లబ్దిదారులకు చేరింది, కానీ తాము జారీ చేయని (బీఎస్‌ఎన్‌ఎల్‌) మరో మూడు చెక్కులను అనధికారింగా బ్యాంకు క్లియర్ చేసిందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.  దీంతో  రూ .24,25,635 నష్టాన్ని చవిచూశామని  బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆరోపించింది. ఈ ఫిర్యాదు మేరకు బ్యాంకు అధికారులపై  కేసు నమోదు చేసినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. ప్రాథమిక విచారణ తరువాత, అదే నెంబర్‌తో మరో మూడు చెక్కులను బ్యాంకుకు సమర్పించినట్లు నిర్ధారించారు. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని  సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

మరిన్ని వార్తలు