ఓ తల్లి..8మంది కొడుకులు..100 కేసులు

6 Nov, 2017 18:58 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జీవితమంతా నేరాలు చేస్తూ బతికా. ఇంక ఈ బతుకు నాకొద్దు. ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నా.. అంటోంది మామ అలియాస్‌ బసిరన్‌(62) అనే నేర సామ్రాజ్ఞి. దేశ రాజధాని ఢిల్లీలో తన ఎనిమిది మంది కొడుకులతో పలు నేరాలకు పాల్పడుతూ పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై 89కేసులు నమోదు చేసి జైలుకు పంపించారు. వివారల్లోకి వెళ్తే రాజస్థాన్‌కు చెందిన బసిరన్‌ అనే మహిళ తన ఎనిమిది మంది కొడుకులు, నలుగురు కుమార్తెలతో 2000లో ఢిల్లీకి వలస వచ్చింది.

మొదట్లో దొంగసారా విక్రయించడం మొదలు పెట్టింది. క్రమేణా నాలుగు లిక్కర్‌ దుకాణాలను తెరిచింది. వ్యాపారం పెరిగే కొద్దీ కొడుకులు చదువులు మానేసి తల్లి పనుల్లో భాగస్వాములయ్యారు. నేరాలకు పాల్పడ్డటం మొదలు పెట్టారు. అడ్డూ అదుపు లేకుండా నేరాలకు పాల్పడేవారు. పోలీసులకు లంచాలు ఇస్తూ నేరగాళ్లు, దొంగలకు ఆశ్రయం ఇవ్వడం అలవాటు చేసుకున్నారు. వీరి ముఠా ఎంతగా తెగించిందంటే ఎవరైనా పోలీసులు అరెస్టు చేయడానికి వెళ్తే బట్టలు చింపుకొని, కేకలు పెడుతూ వేధిస్తున్నారంటూ నానా హంగామా సృష్టించేది. దీంతో పోలీసులు ఏమీ చేయలేక వెనుదిరిగి వచ్చేవారు. అప్పుడప్పుడు పట్టుపడినా నిమిశాల్లోనే బయటకు వచ్చేవారు. ఇప్పటి వరకూ వీరిపై దాదాపు 100కు పైగా కేసులు నమోదైనట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. 

అయితే ఎట్టకేలకు ఈ ముఠాకు చెక్‌పెట్టాలని పోలీసులు భావించారు. గత ఫిబ్రవరిలో సంగం విహార్‌లోని మామ మూడంతస్తుల సొంతింటిపై పోలీసులు మూకుమ్మడి దాడి చేశారు. బసిరన్‌తోపాటు ఎనిమిది మంది కొడుకులను అదుపులోకి తీసుకున్నారు. ఈమొత్తం తతంగాన్ని వీడియోకూడా తీయించారు. దీంతో వారి నాటకాలకు తెరపడింది. నిందితులను కోర్టులో హాజరు పరచగా వారి నేరాలకు తగ్గట్టుగా కోర్టు శిక్షలు విధించింది. 

కొడుకుల్లో ఏడుగురు జైలు శిక్ష అనుభవిస్తుండగా మైనర్‌ కుమారుడిని జువైనల్‌ హోంకు తరలించారు. ఇంత జరుగుతున్నా బసిరన్‌ భర్త మల్కన్‌సింగ్‌ మాత్రం గొర్రెలు కాసుకుంటూ ప్రశాంతంగా జీవితం గడుపుతున్నాడు. భార్య నేరాలకు అతడు మౌనసాక్షిగా మిగిలాడు. అంతేకాదు, ఈ దంపతుల నలుగురు కుమార్తెలపై కూడా ఎటువంటి కేసులు లేవు. వారిలో ఇద్దరికి పెళ్లిళ్లు కూడా అయ్యాయి.శిక్ష అనంతరం బయటకు వచ్చిన మామ(బసిరన్‌) నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని భావిస్తోంది. ఇందుకోసం ఢిల్లీలోని రూ.50లక్షల విలువ చేసే ఇంటిని అమ్మేసి ఫరిదాబాద్‌లో ప్రశాంత జీవనం గడపాలని భావిస్తోంది.

మరిన్ని వార్తలు