అప్రమత్తతతోనే చోరీలకు అడ్డుకట్ట 

30 Mar, 2018 11:23 IST|Sakshi

అనుమానితులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలి

 ప్రజలకు పోలీసుల సూచన

పటాన్‌చెరు టౌన్‌: వేసవి కాలం అంటే కేవలం ఉక్కపోత.. వడదెబ్బే కాదు.. దొంగలు.. దొంగతనాల బాధలూ అధికంగానే ఉంటాయి. వేసవిలో చాలా వరకు ప్రజలు ఉక్కపోత తట్టుకోలేక రాత్రి సమయంలో హాయిగా ఆరు బయట నిద్రపోతుంటే దొంగలు ఇంట్లోకి చొరపడి వారి పని వారు కానిచ్చేస్తారు. బీరువాల్లోని బంగారం, నగదు చోరీ చేసి పారిపోతుంటారు. ఇక వేసవిలో పిల్లల స్కూళ్లకు సెలువులు కావడంతో వివాహాలు, విహారయాత్రలు, తీర్థ యాత్రలు, బంధువుల ఇంటికంటూ చాలా మంది ఇంటికి తాళం వేసి ఊళ్లకు వెళుతుంటారు. దీన్ని అదనుగా చేసుకొని దొంగలు హస్తలాఘవం ప్రదర్శిస్తారు. ఇలాంటి సమయంలో పోలీసులు సైతం దొంగలను గుర్తించలేకపోయే అవకాశం ఉంది.
అందుకే ప్రజలు చైతన్యవంతులైతే చోరీలకు అడ్డుకట్ట వేయడం తేలికవుతుందంటున్నారు డీఎస్పీ సీతారాం.. దొంగతనాలకు వేసవి అనువుగా ఉంటుందని చెప్తున్నారాయన. దొంగలు ఎంచుకున్న ఇంటి పరిసరాలను రెండు రోజులు పరిశీలిస్తారని, అంటే.. చెత్త కాగితాలు, వాకిట్లో శుభ్రతను భిక్షగాళ్లుగా వచ్చి చుట్టు పక్కల పరిశీలించిన తర్వాత ప్రణాళిక ప్రకారం సులువుగా పని ముగించుకుంటారని చెప్తున్న డీఎస్పీ కొన్ని  జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 
చోరీలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
æ    చోరీలకు వచ్చే దొంగలు ఒక రోజు ముందే పరిసర ప్రాంతాలను పరిశీలిస్తారు. అందువల్ల అనుమానాస్పదంగా కనిపించిన వారిపై పోలీసులకు సమాచారం ఇవ్వాలి.
æ    ఇంటి కిటికీలను మూసివేయాలి. వాటికి ఉన్న బోల్టులు, బెడాలు సక్రమంగా ఉన్నాయో లేదో ఎప్పటికప్పుడు చూసుకోవాలి.
æ    దుస్తుల్లో డబ్బులు పెట్టి కిటికీలకు, తలుపులకు తగిలించవద్దు.
æ    ఆరుబయట, డాబాలపై నిద్రించే వారు అప్రమత్తంగా ఉండాలి. ఇంటికి ఒకటి లేదా  రెండు తాళాలు వేసుకోవాలి.
æ    బంగారు ఆభరణాలు ఒంటిపై వేసుకొని ఆరుబయట నిద్రించవద్దు. ఇంట్లో పడుకున్నా ఆభరణాలు ఒంటిపై వేసుకున్నవారు కిటికీలు తెరిచి ఉన్న వైపు పడుకోకూడదు.
æ    దూర ప్రాంతాలకు వెళ్లేవారు తమ ఇంటి చిరునామా, ఫోన్‌ నంబర్‌ను సంబంధిత పోలీస్‌ స్టేషన్‌లో తెలియజేయాలి. 
æ    రాత్రి సమయంలో కొత్తవారు ఎవరైనా వస్తే వారి వివరాలు సేకరించి పెట్టుకోవడం మంచిది.
æ    అనుమానితులు ఎవరైనా కనిపిస్తే వెంటనే సంబంధిత పోలీసులకు సమాచారమివ్వాలి.
æ బంగారం, నగదు ఇంట్లో ఉంచేకన్నా బ్యాంకు లాకర్లలో భద్రపర్చుకోవడం అన్ని విధాలా ఉత్తమం.
     

మరిన్ని వార్తలు