వృద్ధురాలిపై ఎలుగుబంటి దాడి

9 May, 2018 13:41 IST|Sakshi
ఆస్పత్రిలో లక్ష్మి

డిచ్‌పల్లి, నిజామాబాద్‌ : గ్రామంలో వచ్చిన ఎలుగుబంటి ఓ వృద్ధురాలిపై దాడి చేసి గాయపరిచింది. స్థానికులు కర్రలతో వెంటబడడంతో అడవిలోకి పరుగు తీసింది. ఈ ఘటన మండలంలోని ధర్మారం(బి)లో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వృద్ధురాలు కాసం లక్ష్మి ఉదయాన్నే నిద్ర లేచి ఇంటి బయట గేటును తెరుస్తుండగా ఒక్కసారిగా ఎలుగుబంటి దాడి చేసింది. దీంతో ఆమె చేతులకు గాయాలయ్యాయి.

ఆమె భయంతో కేకలు వేయగా చుట్టుపక్కల వారు వచ్చి కర్రలతో ఎలుగుబంటిని తరిమేశారు. మదన్‌పల్లి వైపు ఎలుగుబంటి పారిపోయిందని గ్రామస్తులు తెలిపారు. స్థానికులు కొద్దిగా ఆలస్యంగా వచ్చి ఉంటే లక్ష్మితో పాటు అక్కడే ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులను ఎలుగుబంటి తీవ్రంగా గాయపరిచి ఉండేదని సర్పంచ్‌ ఈదర కస్తూరి, ఉప సర్పంచ్‌ ఎడవెల్లి సోమనాథ్‌ లు తెలిపారు.

యపడిన బాధితురాలిని 108 వాహనంలో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌ కిమ్స్‌లో చేర్పించారు. అటవీ ప్రాంతంలో తాగునీరు లేకపోవడంతో ఎలుగుబంటి గ్రామంలోకి వచ్చి ఉంటుందని స్థానికులు పేర్కొన్నారు. ఎలుగుబంటి దాడితో ధర్మారం(బి), మదన్‌పల్లి, కేశాపూర్‌ గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. 

మరిన్ని వార్తలు