రగ్బీ టీం కోసం దొంగయ్యాడు!

20 Feb, 2020 03:00 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న రైల్వే ఎస్పీ అనురాధ

రైళ్లలో చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న హోంగార్డు అరెస్ట్‌

116 గ్రాముల బంగారు ఆభరణాలు, 1.50 లక్షల నగదు స్వాధీనం

అడ్డగుట్ట: రైల్వే ప్రయాణికులను టార్గెట్‌ చేసుకొని వరుస చోరీలకు పాల్పడుతున్న ఓ తాత్కాలిక హోంగార్డును నిజామాబాద్‌ జీఆర్పీ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. బుధవారం సికింద్రాబాద్‌లోని రైల్వే ఎస్పీ కార్యాలయంలో దీనికి సంబంధించిన వివరాలను ఎస్పీ అనురాధ మీడియాకు వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన మోహన్‌దేవ్‌రావు చావన్‌ (28) నాందేడ్‌ జిల్లాలో హోంగార్డుగా పని చేస్తున్నాడు. ఒక టీంను తయారు చేసి రగ్బీ ఆడిపించాలనే ఉద్దేశంతో పలువురికి ఉచితంగా కోచింగ్‌ ఇచ్చేవాడు. ఈ క్రమంలో గేమ్‌కు సంబంధించి బాల్స్, డ్రెస్‌లు, ఇతర మెటీరియల్స్‌కు డబ్బులు లేకపోవడంతో ఈజీ మనీకి అలవాటుపడ్డాడు. నాందేడ్‌ జిల్లాలోని చిక్కల తండాకు చెందిన ప్రదీప్‌తో కలసి చైన్‌ స్నాచింగ్‌లు ప్రారంభించాడు. 

ఒకే ట్రైన్‌లో 8 స్నాచింగ్‌లు
2019 నుంచి మోహన్‌దేవ్‌రావు, ప్రదీప్‌లు ఒకే ఏడాదిలో 8 చోరీలు చేశారు. బాసర రైల్వే స్టేషన్‌లో నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులోనే ఈ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. ఆభరణాలను ముంబైలో విక్రయించి సొమ్ము చేసుకున్నారు. మిగతా వాటిని విక్రయించేందుకు మోహన్‌ దేవ్‌రావు నిజామాబాద్‌ వచ్చాడు. దీనిపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు స్టేషన్‌లో అతన్ని పట్టుకున్నారు. విచారణ జరుపగా నేరాలను ఒప్పుకున్నాడు. నిందితుడి నుంచి 116 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.1.50 లక్షలు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. మరో నిందితుడు ప్రదీప్‌ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు