ఇది కథ కాదు..బిచ్చగాడి ముసుగులో 

26 Jul, 2019 12:00 IST|Sakshi

సాక్షి, లక్నో: బిచ్చగాళ్ల రూపంలో పొంచి వున్న అరాచకవాదుల గురించి సినిమాల్లో చూశాం. కథల్లో విన్నాం. కానీ ఉత్తరప్రదేశ్‌లో తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక ఉదంతం కథ కాదు. కఠోర వాస్తవం.  గురువారం సాయంత్రం లక్నో,  మున్షిపులియా ప్రాంతంలో విజయ్ బద్రి అలియాస్ బంగాలీ (55)ని  అరెస్ట్‌ చేయడంతో  బెగ్గర్ ర్యాకెట్‌ గుట్టు రట్టయింది. 

బిచ్చగాడుగా యాచకవృత్తి ముసుగులో తిరుగుతూ మైనర్లను హింసించి భయపెట్టి దొంగతనాలకు పాల్పడటం, ముఖ్యంగా మైనర్‌ అమ్మాయిలను బలవంతంగా వ్యభిచారంలోకి దింపడం ఇతగాడి మోడస్‌ ఓపరాండీ. అయితే ఎంతటి నేరగాడికైనా పతనం తప్పదు. గట్టు రట్టు కాక తప్పదు కదా. విజయ్‌ కబంధ హస్తాలనుంచి తప్పించుకున్న బాధితులు (ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు) తప్పించుకునే ప్రయత్నంలో పోలీసులకు చిక్కారు.  బారాబంకి వెళ్లే రైలులో బాద్షా నగర్ రైల్వే స్టేషన్‌ పరిధిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని  రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) సిబ్బందిని ప్రశ్నించినప్పుడు.. తమ గోడు వెళ్లబోసుకుంటూ కన్నీటి సంద్రాలే అయ్యారు.  తమ మాస్టర్‌ అసాంఘిక కార్యకలాపాల గుట్టు విప్పారు. 

15,16,14 సంవత్సారాల పిల్లలతో రైల్వే ప్లాట్‌ఫాంలలో దొంగతనాలకు ఉసిగొల్పుతాడు..అంతేకాదు మత్తుమందు ఇచ్చి పిల్లల శరీరాలపై గాయం చేసి, ఆ రక్తాన్ని తన వికలాంగ కాలి బ్యాండేజిపై పూసుకొని సానుభూతి పొందేవాడు. పిల్లలు చోరీ చేసిన మొబైల్ ఫోన్లు, వాలెట్లు, ఇ-రిక్షా బ్యాటరీలు, ఇతర వస్తువులను  అక్రమంగా విక్రయించి సొమ్ము చేసుకునేవాడు. దీనికి ప్రతిగా పిల్లలకు దక్కేది మాత్రం. రోజుకి  రూ.100,  పేవ్‌మెంట్ల మీద నిద్ర.

తప్పించుకునే ఉద్దేశంతో ఎలాగోలా రూ.70 దాచుకున్నామని బాధిత పిల్లలు చెప్పారు. గతంలో చాలాసార్లు పారిపోవడానికి  ప్రయత్నించి, దొరికిపోయి దెబ్బలుతిన్నామని విలపించారు. తమతోపాటు మరో పది మంది అతని చెరలో ఉన్నట్టు చెప్పారు. వీరి  ఫిర్యాదు ఆధారంగా  రంగంలోకి దిగిన పోలీసులు  అతగాడి ఆటకట్టించారు. 

విజయ్‌ని మున్షిపులియాలో అరెస్ట్‌ చేశామని కిడ్నాప్, పిల్లల అక్రమ రవాణా, దోపిడీ  కేసులు  నమోదు చేశామని  పోలీసులు వెల్లడించారు.  దీని వెనక పెద్ద రాకెట్‌ ఉన్నట్టు అనుమానిస్తున్న అధికారులు, ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరో ముగ్గురితో కలిసి ఈ రాకెట్టును నడుపుతున్నట్లు నిందితుడు విజయ్‌ ఒప్పుకున్నాడని పోలీసు అధికారులు ఎం.కె.ఖాన్, రాజ్దేవ్ మిశ్రా తెలిపారు. రక్షించిన నలుగురు బాధిత మైనర్లను లక్నోలోని చైల్డ్‌లైన్‌కు అప్పగించి, ఛైల్డ్‌ వెల్‌ఫేర్‌ కోర్టు ముందు  హాజరుపరిచామని కమిటీ సభ్యులు సంగీత శర్మ చెప్పారు. వారి తల్లిదండ్రులను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు.

 బెంగాల్‌కు చెందిన విజయ్ బద్రి ఒక ప్రమాదంలో కాలు కోల్పోయాడు. అనంతరం బిక్షాటన ద్వారా పొట్ట పోసుకునేవాడు. క్రమంగా మురికివాడల్లోని పిల్లలే టార్గెట్‌గా పథకం వేశాడు. బట్టలు, బువ్వ, డబ్బు పేరుతో వారిని మభ్యపెట్టి  తనవైపు తిప్పుకునేవాడు. అలా వారిని వ్యభిచారం, ఇతర నేరాలకు ఉపయోగించుకోవడం ప్రారంభించాడు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా