వీడిన కేరళ హత్యల మిస్టరీ

6 Aug, 2018 16:47 IST|Sakshi
హత్యకు గురైన కుటుంబం ( ఫైల్‌ ఫోటో)

సాక్షి, తిరువనంతపురం: నాలుగు రోజులక్రితం వెలుగులోకి వచ్చిన కేరళలోని ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని హత్యచేసి, ఇంటి వెనుక పూడ్చిపెట్టిన దారుణ ఘటన మిస్టరీ వీడింది.  హత్యకు గురైన కన్నట్ కృష్ణన్ (52) స్నేహితుడు అనీష్‌ ఈ కేసులో ప్రధాన నిందుతుడుగా పోలీసులు  గుర్తించారు.  కేరళలోని ఇడుక్కి జిల్లా తొడుపుజాలో చోటు చేసుకున్న ఈ హత్యలకు అనుమానం,  చేతబడి(బ్లాక​ మ్యాజిక్‌) కారణమని పోలీసులు తేల్చారు.

పోలీసులు అందించిన సమాచారం  ప్రకారం, ప్రధాన నిందితుడు  అనీష్‌, హతుడు కృష్ణన్  కుటుంబానికి చాలా సన్నితుడు.  భూత వైద్యుడిగా, జ్యోతిష్యుడిగా స్థానికంగా పేరొందిన కృష్ణన్‌ వద్ద చేతబడులు తదితర క్షుద్రపూజలు నేర్చుకున్నాడు. ఈ క్రమంలో కొంతకాలం తర్వాత, అనీష్ తన సొంత బిజినెస్‌ ప్రారంభించాడు. అయితే తనకు బాగా కలిసి రాకపోవడంతో కృష్ణన్‌పై అనీష్‌ అనుమానం పెంచుకున్నాడు. తన శక్తులను, పవర్‌ను కృష్ణన్‌ లాగేసుకుంటున్నాడంటూ పగతో రగిలిపోయాడు, అతణ్నిఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని  ప్లాన్‌ వేశాడు.  అంతేకాదు అతని దగ్గర ఉన్న తాళపత్ర గ్రంథాలను  కూడా సొంతం  చేసుకోవాలనుకున్నాడు. ఇందుకోసం తన  స్నేహితుడు లిబీష్‌ సహాయంతో  ఒక పథకం ప్రకారం కృష్ణన్‌ కుటుబాన్ని హత మార్చాడు.  గత ఆరు నెలలుగా ఇదే పథకంలో ఉన్నఅనీష్‌,  స్నేహితుడు సహకారంతో ఈ హత్యలకు పూనుకున్నాడు.

ఇడుక్కి ఎస్‌పీ వేణుగోపాల్ ఈ ఘటన వివరాలను  మీడియాకు వివరించారు. జూలై 29వ తేదీ  అర్థరాత్రి  నిందితులిద్దరూ అనీష్‌, లీబేష్‌ బైక్‌ విడిభాగాలను మారణాయుధాలుగా వెంట  తీసుకెళ్లారు. (ఈ కేసులో మరో నిందితుడు లిబీష్‌కు టూవీలర్‌ వర్క్ షాప్ ఉంది)  పథకం ప్రకారం కృష్ణన్‌కు బయటకు  రప్పించే  ప్లాన్‌లో భాగంగా, వారి ఇంటిముందు కట్టేసి ఉన్న మేకను కొట్టారు.  మేక అరుపులు  విన్న కృష్ణన్ బయటకు రాగానే అతని తలపై మోది హత్య చేశారు.  ఈ అలికిడికి బయటికి వచ్చిన భార్య సుశీల (50)పై లిబీష్‌ ఎటాక్‌ దాడిచేశాడు.  అయితే ఆమె తప్పించుకుని లోపలికి  వెళ్లినా వదల్లేదు. ఇంతలో కూతురు అర్ష (21) రాడ్‌ తీసుకొని స్వీయ రక్షణకు ప్రయత్నించింది. అనీష్‌ తలపై కొట్టింది. బిగ్గరగా అరవడం ప్రారంభించింది. కానీ అనీష్‌ ఆమెను కొట్టి  అరచేతితో నోటిని గట్టిగా మూసి మరీ కొట్టాడు. ఇక చివరగా మానసిక వికలాంగుడైన కొడుకు అర్జున్ (18)ను కూడా కత్తితో గాయపర్చారు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న వారదరూ చనిపోయారని నిర్ధారించుకున్న తరువాత ఇంట్లోని బంగారు ఆభరణాలు, నగదును తీసుకొని నిందితులు పారిపోయారు. మరుసటిరోజు మృతదేహాలను మాయం చేసేందుకు తిరిగి సంఘటనా స్థలానికి వచ్చారు నిందితులు.  అయితే అప్పటికి అర్జున్ ఇంకా బతికే ఉండటంతో అమానవీయంగా అతని తలపై మరోసారి సుత్తితో కొట్టి హత్య చేశారని ఎస్‌పీ  వేణుగోపాల్‌ వెల్లడించారు. అయితే  ప్రధాన నిందితుడు అనీష్  ఇంకా పరారీలో ఉన్నాడని, అతడి స్నేహితుడు, కరీకోడ్ నివాసి లిబీష్‌ను అరెస్టు చేసినట్లు చెప్పారు. కాగా పొరుగింటివారి ఫిర్యాదుతో  వెలుగు చూసిన ఈ దారుణం కలకలం రేపింది.  కుటుంబంలోని నలుగురినీ చంపి,  ఇంటివెనక పాతిపెట్టిన వైనం స్థానికులను కలవరపర్చింది.

మరిన్ని వార్తలు