మద్యం ఎట్లా పారుతున్నదంటే..!

12 Jul, 2018 13:23 IST|Sakshi
మాచవరం ఎస్సీ కాలనీలోని బెల్ట్‌ షాపు ,మాచవరం ప్రధాన రోడ్డులో నిర్వహిస్తున్న బెల్ట్‌ షాపు

మద్యం మత్తులో పల్లెలు

పుట్టగొడుగుల్లా వెలసిన బెల్ట్‌ షాపులు

ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయం

గుల్లవుతున్న పేద, మధ్య తరగతి కుటుంబాలు

పట్టించుకోని ఎక్సైజ్‌ శాఖ అధికారులు

కందుకూరు రూరల్‌: పల్లెలు మద్యం మత్తులో తూలుతున్నాయి. బెల్ట్‌ షాపుల నివారించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నా పెద్దగా ఫలితం ఉండటం లేదు. లైసెన్స్‌ ఉన్న ఏ షాపు నుంచీ మద్యం బయటకు వెళ్లకూడదని నిబంధనలు ఉన్నా అందుకు విరుద్ధంగా బెల్ట్‌ షాపులకు తరలిస్తున్నారు. దీన్ని నివారించాల్సిన ఎక్సైజ్‌ అధికారులు మామూళ్ల మత్తులో తూగుతున్నారు. బెల్ట్‌ షాపులను బహిరంగంగా బంకుల్లో పెట్టి విక్రయాలు జరుపుతున్నా అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. బెల్ట్‌ షాపుల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో మధ్య తరగతి కుటుంబాలు గుల్లవుతున్నాయి. కూలీనాలి చేసుకొని జీవనం సాగించే కుటుంబాల్లోని పురుషులు మద్యానికి బానిసై ఆర్థిక ఇబ్బందుల్లో పడుతున్నారు. గ్రామంలోనే అందుబాటులో మద్యం దొరుకుతుండటంతో క్వార్టర్‌కు డబ్బులుంటే చాలు నేరుగా బెల్ట్‌ షాపుల్లో కూర్చొని మద్యం తాగుతున్నారు. అదే గ్రామంలో అందుబాటులో మద్యం లేకుంటే దూర ప్రాంతాలైన పట్టణాలకు వెళ్లి మద్యం తాగడం కష్టంగానే ఉంటుంది. గ్రామీణ ప్రాతాల్లో బడ్డీ కొట్లు, కూల్‌డ్రింక్‌ షాపులు నిర్వహిస్తున్న వ్యాపారులు యథేచ్చగా మద్యం విక్రయిస్తున్నారు. ఇది ఇలా ఉంటే కొన్ని గ్రామాల్లో బంకుల్లో కాకుండా నేరుగా సంచులు, జేబుల్లో పెట్టుకొని మద్యం బాటిళ్లు విక్రయిస్తున్నారు. మద్యం కావాలని ఫోన్‌ కొడితే మందు సీసా జేబులో పెట్టుకొని ఇంటికి తెచ్చిస్తున్నారు.

అదనపు వసూలు
మద్యం నేరుగా ఇంటికి తీసుకొచ్చి ఇస్తే క్వార్టర్‌ సీసాపై రూ.20 నుంచి రూ.40ల వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. ఇక బంకుల్లో రూ.10 నుంచి రూ30ల వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. బంకుల్లో ప్రారంభంలో స్వచ్ఛమైన మద్యం ఇస్తున్నారు. ఆ తర్వాత మత్తులో ఉండగా సీల్‌ చేసిన మద్యం సీసాలో నీరు కలిపి మందు బాబులకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మండలంలోని ఓగూరులో బస్టాండ్‌ దగ్గరలో రెండు షాపుల్లో మద్యం విక్రయిస్తున్నారు. పట్టణాల నుంచి సైతం అక్కడికి వెళ్లి తాగుతున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మాచవరం ఎస్సీ కాలనీలో కేవలం మద్యం విక్రయాలనికే బంకు ఏర్పాటు చేశారు. ఇంతక ముందు బెల్ట్‌ షాపుల్లో ఒక చీప్‌ లిక్కర్‌ మాత్రమే విక్రయించే వారు. ప్రస్తుతం బీర్లుతో పాటు కొన్ని బ్రాండ్లు విక్రయిస్తున్నారు. యువత కూడా మద్యానికి బానిసవుతున్నారు.

లైసెన్స్‌ షాపుల నుంచే సరఫరా
లైసెన్స్‌ షాపుల నుంచి మద్యం బెల్ట్‌ షాపులకు వెళ్లకూడదు. కానీ మహదేవపురం, పలుకూరు గ్రామాల్లో ఉన్న మద్యం దుకాణాల నుంచి బెల్ట్‌ షాపులకు మద్యం వెళ్తున్నట్లు సమాచారం. బైక్‌పై నేరుగా ఆయా గ్రామాలకు వెళ్లి బంకుల్లో మద్యం కేసులు వేసి వస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఎక్సైజ్‌ అదికారులు కూడా బెల్ట్‌ షాపులపై దాడులు చేసిన దాఖలాలు లేకపోవడంతో బెల్ట్‌ షాపుల నిర్వాహణ మూడు క్వార్టర్లు.. ఆరు ఫుల్‌లుగా సాగుతోంది. అధికారులు మాత్రం తమకేమీ తెలియదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మద్యం దుకాణాలు, బెల్ట్‌షాపుల నుంచి నేరుగా మామూళ్లు వెళ్తుండటంతోనే అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. బెల్ట్‌ షాపులు నిర్వహకులపై ఉక్కుపాదం మోపాలని ఎక్సైజ్‌ ఉన్నతాధికారులు ఆదేశాలు ఉన్నా బేఖాతర్‌ చేస్తున్నారు. బెల్ట్‌ షాపులు నిర్వహించే వారు అధికంగా అధికార పార్టీకి చేందిన వారే కావడంతో ఎక్సైజ్‌ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు