బెట్టింగ్‌ బంగార్రాజులు 

17 Apr, 2019 08:02 IST|Sakshi

సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ 

గ్రామాలు, పట్టణాల్లో జోరుగా బెట్టింగ్‌ 

చేతులు మారుతున్న రూ.లక్షలు

మహబూబ్‌నగర్‌ క్రైం: క్రీడాభిమానులకు ఐపీఎల్‌ జ్వరం పట్టుకున్నట్లు.. రాజకీయ అభిమానులకు కూడా అదే జ్వరం పట్టుకుంది. మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌లో ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తాడు.. అనే దానిపై బెట్టింగ్‌ జోరుగా సాగుతోంది. నిన్న మొన్నటి వరకు రాజకీయ రణక్షేత్రంలో హోరాహోరీగా తలపడిన నేతల్లో విజేత ఎవరోననే ఉత్కంఠ రేపుతోంది. అభ్యర్థులు, వారి అనుచరులతోపాటు రాజకీయ నేతలతో పాటు ప్రజలు కూడా ఫలితాలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

వచ్చేనెల 23 వరకు ఆగాల్సిందే.. 
పోటీలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం తేలడానికి ఇంకా సమయం ఉంది. అందుకే ఫలితాలపై ఆసక్తి పెరగడంతో లక్షల్లో బెట్టింగ్‌ కాస్తున్నారు. ప్రభుత్వ వ్యాపారులు, యువత, నాయకులు, ఉద్యోగులు సైతం బెట్టింగ్‌పై దృష్టి పెట్టారంటే పోరు ఎంత రసవత్తరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మహబూబ్‌నగ్‌ పార్లమెంట్‌ పరిధిలో ఉన్న ఏడు  నియోజకవర్గాల్లో ఎక్కడ చూసినా ఈ అంశమే వినవస్తోంది. ఎన్నికలు ముగిసి వారం కావస్తున్నా అభ్యర్థుల గెలుపోటములు, మెజార్టీలపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుంది. ఈ పార్లమెంట్‌ పరిధిలో ఉన్న కార్యాలయాల్లో, హోటళ్లలో, దుకాణాల్లో అందరినోటా ఇదే ముచ్చట వినపడుతోంది.

ఎవరి అంచనాలో వారు.. 
ఈనెల 11న సాయంత్రం 5గంటలకు పార్లమెంట్‌ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్‌ ముగిసింది. అప్పటి నుంచి ఎవరి అంచనాల్లో వారున్నారు. మరోవైపు కొందరు ఎవరు నాయకుడు అవుతాడనే అంశంపై బెట్టింగ్‌ వేస్తున్నారు. ఇప్పటికే ఫలితాలకు సంబంధించి ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వెలువరించినా.. పార్టీల వారీగా ఉన్న కార్యకర్తలు, అభిమానులు ఎవరి ధీమాలో వారున్నారు. ఇ అంతట ఇదే చర్చ పోలింగ్‌ ప్రక్రియ ముగియడంతో ఎక్కడికి వెళ్లినా ఫలితాలపై అందరు ఇదే చర్చ జరుగుతోంది.

ఉదయం వేళ మైదానంలో రన్నింగ్‌ చేస్తున్న వారి దగ్గరి నుంచి సాయంత్రం టీ దుకాణాల దగ్గర ముచ్చట్లు పెట్టే వ్యక్తుల వరకు ప్రతి ఒక్కరు ఫలితాలు ఎట్లుంటయోనని ఒకటే ముచ్చట్లు పెడుతున్నారు. టీ కొట్లు, హోటల్స్, స్నాక్స్‌ దుకాణాలు, పని చేసే ప్రదేశాలు, వాకింగ్‌ మైదానాలు ఇలా ఎక్కడికి వెళ్లినా ఫలితాలపైనే ఆసక్తికర సంభాషణలు నడుస్తున్నాయి. ఫలానా వ్యక్తి గెలువబోతున్నారని ఒకరంటే.. కాదు కాదు ఇంకో వ్యక్తి గెలుస్తారంటూ వాదనలకు  దిగుతున్నారు. ఏదేమైనా ఫలితాల ఎలా ఉండబోతున్నాయని తెలుసుకోవాలంటే వచ్చేనెల 23వరకు ఆగాల్సిందే.

మరిన్ని వార్తలు