భరోసా ఇచ్చినా.. తొలగని భయం!

17 Jan, 2020 04:39 IST|Sakshi

భైంసా ఘటనలో 55 మంది అరెస్టు

కర్ఫ్యూ ఎత్తివేసినా తెరుచుకోని మార్కెట్లు

భైంసా: నిర్మల్‌ జిల్లా భైంసా పట్టణంలో రెండు రోజులుగా పరిస్థితి మెరుగు పడింది. ఆదివారం జరిగిన అల్లరి మూకల దాడుల తర్వాత వదంతుల వ్యాప్తి ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది. పోలీసులు భరోసా ఇచ్చినా.. వదంతులతో భయాందోళనకు గురవుతున్నారు. అల్లర్ల ఘటనకు కారకులైన 55 మందిని అరెస్టు చేసినట్లు సీఐ వేణుగోపాల్‌రావు తెలిపారు. మున్సిపల్‌ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ప్రచారం చేసుకోవచ్చని చెబుతున్నప్పటికీ స్థానికంగా ఆ సందడి కనిపించడంలేదు.

మరో రెండు రోజుల్లో ఇంటర్‌నెట్‌ సేవలు పునరుద్ధరించనున్నామని, ఎన్నికలయ్యే వరకూ భైంసాలో అదనపు బలగాలు ఉంటాయని పోలీసులు చెబుతున్నారు. 240 మంది ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్, 150 మంది స్పెషల్‌ పోలీసులు, ఏఆర్, సివిల్‌ కానిస్టేబుళ్లు ప్రత్యేక బలగాలతో కలిపి 900 మంది బందోబస్తులో ఉన్నారు. ప్రతిరోజు భైంసాలో కవాతు నిర్వహిస్తున్నారు. కరీంనగర్, వరంగల్‌ ఐజీలు నాగిరెడ్డి, ప్రమోద్‌కుమార్‌ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతాయని భరోసా ఇస్తున్నారు. కర్ఫ్యూ, 144 సెక్షన్‌ ఎత్తివేసినప్పటికీ దుకాణాలు మాత్రం తెరుచుకోవడంలేదు. చాలా మంది తమ బంధువుల ఇళ్లకు వెళ్లిపోతున్నారు. దీంతో ఈనెల 22న జరిగే పోలింగ్‌పై ఈ ప్రభావం పడనుందని పరిశీలకులు చెబుతున్నారు.

బీజేపీ మాజీ ఎమ్మెల్యే గృహ నిర్బంధం
సుభాష్‌నగర్‌(నిజామాబాద్‌ అర్బన్‌): బీజేపీ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణను పోలీసులు గురువారం రాత్రి నిజామాబాద్‌లో హౌజ్‌ అరెస్ట్‌ చేశారు. నిర్మల్‌ జిల్లా భైంసాలో జరిగిన ఘటనపై సమీక్షించేందుకు వెళ్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు ఆయనను ఇంట్లోనే నిర్బంధించారు. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో ఆయన ఇంటికి చేరుకున్నారు.

మరిన్ని వార్తలు