భానుప్రియ పనిమనిషి కేసులో కొత్త ట్విస్టు

2 Feb, 2019 09:18 IST|Sakshi

సాక్షి, చెన్నై: నటి భానుప్రియ పనిమనిషి వ్యవహారంలో కొత్త ట్విస్టు చోటుచేసుకుంది. భానుప్రియ ఇంట్లో పనిమనిషిగా చేరిన బాలిక సంధ్య, ఆమె తల్లి ప్రభావతిని చోరీ కేసులో పాండీబజార్‌ పోలీసులు అరెస్టు చేశారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం, పండ్రవాడ గ్రామానికి చెందిన ప్రభావతి కుమార్తె సంధ్యను మూడేళ్ల క్రితం చెన్నైలోని భానుప్రియ ఇంట్లో పనిచేయడానికి పంపించారు. అయితే ఓ ఏడాది నుంచి భానుప్రియ సోదరుడు గోపాలకృష్ణ తమ కుమార్తెను లైంగిక వేధిస్తున్నాడని, అంతేకాకుండా తన కుమార్తెపై దొంగతనం కేసు పెడతామని బెదిరిస్తున్నాడని ప్రభావతి కొద్దిరోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలపై స్పందించిన భానుప్రియ.. ఆ బాలిక చెన్నైలోని తమ ఇంట్లో వస్తువులు, డబ్బు, నగలు దొంగతనం చేసిందని తెలిపారు. ఈ విషయాన్ని గుర్తించిన తాము పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించడంతో బాలిక తల్లి ఐప్యాడ్‌, వాచ్‌లు, కెమెరా తెచ్చి ఇచ్చిందని.. నగలు, డబ్బు మాత్రం ఇవ్వలేదన్నారు. అవి కూడా ఇవ్వాలని అడగడంతో.. వాటిని తెస్తానని వెళ్లి తమపై తప్పుడు కేసు పెట్టిందని తెలిపారు.

మరోవైపు మైనర్‌ అమ్మాయిని ఇంటి పనిమనిషిగా పెట్టుకున్న వ్యవహారంలో భానుప్రియ, ఆమె సోదరుడు చట్టపరమైన చర్యలు ఎదుర్కొనే అవకాశముందని తెలుస్తోంది. మైనర్‌ బాలలను పనిలో పెట్టుకోవడం నేరం అవుతుంది. బాలకార్మిక చట్టం ప్రకారం ఇలా వ్యవహరించిన వారిపై రెండేళ్ల జైలు శిక్ష, రూ.50 వేల జరిమానా పడే అవకాశం ఉంది. తాను ఏజెంట్‌ ద్వారా పనిపిల్లను నియమించుకున్నానని, అందువల్ల ఆ పిల్ల వయసు తెలియలేదని భానుప్రియ చెబుతున్నారు. ఈ వ్యవహారాన్ని పోలీసులు బాలకార్మిక చట్టం పరిధిలోకి తీసుకుంటుంటారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు