వాళ్లు నన్ను చంపేస్తారు; ఉద్యోగిని ఆత్మహత్య

18 Oct, 2019 11:17 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఉన్నతాధికారి వేధింపులు తాళలేక బీహెచ్‌ఈఎల్‌ ఉద్యోగిని ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. లైంగిక వేధింపులకు పాల్పడి తనను చిత్రవధ చేస్తున్నారని సూసైడ్‌ నోట్‌ రాసి ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ రఘురాం కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. భోపాల్‌కు చెందిన రాజుకుమారి, తులసీరాం దంపతుల కుమార్తె నేహా చౌక్‌సే (33) బీహెచ్‌ఈఎల్‌లో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో జైపూర్‌కు చెందిన సునీల్‌ కండిల్‌వాల్‌తో ఆమెకు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. కాగా భోపాల్‌లోని బీహెచ్‌ఈఎల్‌ కంపెనీలో అకౌంట్‌ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్న నేహా.. తన భర్త 2018 సెప్టెంబర్‌లో హైదరాబాద్‌కు రావడంతో ఆమె కూడా ఆర్సీపురంలోని బీహెచ్‌ఈఎల్‌కు బదిలీ చేయించుకుంది. ప్రస్తుతం వీరిద్దరు మియాపూర్, ప్రజయ్‌సిటీలోని భానుటౌన్‌షిప్‌లో నివాసముంటున్నారు. 

ఈ నేపథ్యంలో భోపాల్‌లో పని చేసే సమయంలో అదే కంపెనీలో పనిచేస్తున్న డీజీఎం నేహను తరచూ వేధింపులకు గురి చేసేవాడు. అయితే బదిలీ అయి నగరానికి వచ్చిన తర్వాత కూడా అతడి వేధింపులు కొనసాగాయి. ఇందులో భాగంగా గత కొన్నిరోజులుగా తన ఫోన్‌ టాపరింగ్‌ చేసి రికార్డింగ్‌ చేస్తున్నాడని నేహా నోట్‌లో పేర్కొంది. సదరు డీజీఎం తన పలుకుబడితో తనపై కంపెనీలో చెడుగా ప్రచారం చేస్తున్నారని మనస్తాపానికి లోనైంది. ‘ఆర్థర్‌ కిషోర్‌ కుమార్‌ అనే వ్యక్తి నాపై అత్యాచారానికి పాల్పడి.. చంపాలని చూస్తున్నాడు. ఆ తర్వాత నా సంతకాన్ని ఫోర్జరీ చేసి ఓ నకిలీ లేఖను సృష్టించి కేసు నుంచి తప్పించుకోవాలని పథకం వేశాడు. ఈ నోట్‌ను నేను వాష్‌రూంలో రాస్తున్నా. నేను ఆఫీసు నుంచి వచ్చే ముందు ఓ వ్యక్తి నన్ను కలిశాడు. ఈరోజు ఎలాగైనా నాపై లైంగిక దాడికి పాల్పడతామని చెప్పాడు. గతంలో కూడా వాళ్లు ఇలాగే చేశారట. ఈ విషయం గురించి నాకు ఒకరు చెప్పారు. ఆధారాలు లేనిదే అత్యాచారాన్ని నిరూపించలేరనే ధైర్యంతో తనపై దుర్మార్గానికి పాల్పడ్డారని చెప్పారు. వాళ్లు కచ్చితంగా నన్ను చంపేస్తారు’ అని నేహ తన డైరీలో రాసుకున్నారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా