తొమ్మిది నెలల క్రితం అదృశ్యం.. ఎముకలుగా ప్రత్యక్ష్యం

2 Apr, 2019 17:53 IST|Sakshi
ఘటన స్థలంలో లభించిన మృతుడి పుర్రె ,ఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న ఎస్సై రమేష్‌,భూక్యా కృష్ణమహర్షి ఆధార్‌కార్డు

మహబూబాబాద్‌ శివారు సాలార్‌ తండాలో ఘటన 

సాక్షి, మహబూబాబాద్‌ రూరల్‌: తొమ్మిది నెలల క్రితం అదృశ్యమైన భూక్యా కృష్ణమహర్షి(30) సోమవారం తండా శివారులోని జక్కుంటబోడ్‌ ప్రాంతంలో ఆస్థిపంజరంగా ప్రత్యక్షమైన ఘటన సంచలనం రేపింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పోలీసులు, వైద్యులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. టౌన్‌ సీఐ సుంకరి రవికుమార్‌ ఆదేశాల మేరకు టౌన్‌ ఎస్సై సీహెచ్‌.రమేష్‌బాబు మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. సాలార్‌ తండాకు చెందిన భూక్యా కృష్ణమహర్షి భార్య అరుణ పది నెలల క్రితం కుటుంబ తగాదాల నేపథ్యంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి.. ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. భార్య మృతి అనంతరం నెల రోజుల తర్వాత కృష్ణ కూడా మనస్తాపానికి గురై పురుగుల మందు తాగాడు. ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కొద్ది రోజులకు కోలుకోని మళ్లీ అదే విధంగా ప్రవర్తించసాగాడు. అనంతరం తన తాతకు చెందిన టీవీఎస్‌ ఎక్సెల్‌ వాహనాన్ని తీసుకుని ఇంటి నుంచి 2018 జూన్‌ 23న వెళ్లాడు. మళ్లీ వస్తాడులే అనుకుని మృతుడి తండ్రి భూక్యా లక్‌పతి, ఇతర బంధువులు ఎదురు చూశారు. 2018 జూలై 9వ తేదీన కృష్ణ మేనత్త  ఇస్లావత్‌ పద్మ టౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అతడి ఆచూకి ఎంత వెతికినా దొరకలేదు. సోమవారం ఉదయం సమయంలో సాలార్‌తండా వాసులు జక్కుంటబోడ్‌ సమీపంలోని వారి వ్యవసాయ భూముల్లో పచ్చజొన్న చేను వద్ద పనులు చేసుకుంటున్నారు. కోతులు వచ్చి జొన్న కంకులను పాడు చేస్తుండటంతో వాటిని తరముకుంటూ జక్కుంటబోడ్‌పైకి వెళ్లారు. అక్కడ మనిషికి సంబంధించిన ఎముకలు కనిపించాయి.

ఏమిటిదీ అని పరిశీలిస్తుండగా కృష్ణ ఆధార్‌కార్డు, మొబైల్‌ ఫోన్‌ కొంత మేరకు దగ్ధమైపోయి కనిపించాయి. ఓ చెట్టుకు ఉరేసుకుని మృతి చెందినట్లు తాడు కూడా దొరికింది. ఆధార్‌కార్డు ద్వారా మృతుడిని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడు పర్కాల వినీల్‌రెడ్డి ఘటన స్థలానికి వచ్చి పరిశీలించాడు. వ్యక్తి ఉరివేసుకుని చనిపోయి 6 నెలలు గడవడంతో ఆ వ్యక్తికి సంబంధించిన ఎముకలు చెల్లాచెదురుగా పడ్డాయని నిర్ధారణకు వచ్చారు. అంతే కాకుండా అడవిని కాల్చివేసిన సందర్భంలో కూడా మృతదేహం పూర్తిగా కాలిపోయి ఎముకలు మిగిలిపోయి ఉండవచ్చన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని వివిధ కోణాల్లో సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. విషయం తెలుసుకున్న తండావాసులు ఘటన స్థలానికి వచ్చి ఉరేసుకుని మృతి చెందిన రోజుల్లో కనీసం వాసన కూడా రాకపోవడంతో ఎలాంటి సమాచారం తెలియలేదని వాపోయారు. ఏఎస్సై కృష్ణారావు, హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకన్న వివరాలు సేకరించారు.


 

మరిన్ని వార్తలు