కొత్తపేటలో భారీ చోరీ

1 Oct, 2019 09:33 IST|Sakshi
దొంగతనం జరిగిన బీరువాలో ఫింగర్‌ ప్రింట్స్‌ పరిశీలిస్తున్న నిపుణులు, సిఐ శ్రీనివాసరావు, ఎస్సై కోటయ్య 

51 సవర్ల బంగారు ఆభరణాలు, రూ. 15 లక్షల నగదు అపహరణ 

సాక్షి, చీరాల(ప్రకాశం) : చీరాలకు కూతవేటు దూరంలోని కొత్తపేటలో సోమవారం ఓ వ్యాపారవేత్త ఇంట్లో భారీ చోరీ జరిగింది. దొంగలు ఇంటి తాళాలు పగలకొట్టి బీరువాను బద్దలు కొట్టి అందులోని 51 సవర్ల బంగారు ఆభరణాలు, రూ. 15 లక్షల నగదును దోచుకెళ్లారు. ఈ సంఘటన సోమవారం ఉదయం వెలుగుచూసింది. బాధితులు పోలీసులకు అందించిన వివరాల మేరకు...వేటపాలెం మండలం కొత్తపేట ప్రధాన కూడలి అయిన పంచాయతీరాజ్‌ శాఖ భవనాల సముదాయం వద్ద గోగినేని హనుమంతరావు, ధనలక్ష్మి వృద్ధ దంపతులు నివాసముంటున్నారు. హనుమంతరావు కలప వ్యాపారం నిర్వహిస్తున్నారు. వీరికి  కుమారుడు, కుమారై ఉన్నారు. కుమారుడు వ్యాపారం నిమిత్తం చెన్నైలో నివసిస్తుండగా కుమారై అమెరికాలో ఉంటున్నారు. ఈ క్రమంలో ధనలక్ష్మి అనారోగ్యంతో నెలన్నర క్రితం చెన్నైలోని తన కుమారుడి వద్దకు వెళ్లింది. ఆమె భర్త హనుమంతరావు మాత్రం ఇంటివద్దనే ఉన్నాడు.

అయితే 15 రోజులు క్రితం హనుమంతరావు కూడా చెన్నైలోని కుమారుడి వద్దకు వెళ్లాడు. చెన్నైకి వెళ్లిన అతనికి కూడా అనారోగ్యంగా ఉండడంతో కొన్ని రోజులుగా  అక్కడే ఉంటున్నారు. ఈ క్రమంలో వారికి శ్రేయోభిలాషిగా ఉండే వ్యక్తి ప్రతిరోజు హనుమంతరావు ఇంటికి వచ్చి బాగోగులు చూస్తుంటాడు. రోజు మాదిరిగా సోమవారం ఉదయం వచ్చిన అతనికి ఇంటి ప్రధాన ద్వారం తాళం పగలకొట్టి ఉండడం గమనించాడు. దీంతో అతడు హనుమంతరావుకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించాడు. వెంటనే స్పందించిన హనుమంతరావు తనకు ఉన్న పరిచయాలతో స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న డీఎస్పీ జయరామ సుబ్బారెడ్డి, సీఐలు నాగ మల్లేశ్వరరావు, శ్రీనివాసరావు, ఇంకొల్లు సీఐ రాంబాబు, ఎస్సైలు సంఘటనా స్థలానికి చేరుకుని చోరీ జరిగిన ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. సమాచారం అందుకున్న డాగ్‌ స్క్వాడ్, ఫింగర్‌ ప్రింట్‌ నిపుణులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. 

చీరాలకు చేరుకున్న బాధితులు.
ఇంటిలో దొంగతనం జరిగిందన్న సమాచారం అందుకున్న బాధితులైన హనుమంతరావు, ధనలక్ష్మి దంపతులు సాయంత్రం 3 గంటలకు చెన్నై నుంచి చీరాలకు చేరుకున్నారు. అప్పటి వరకు ఆ ఇంట్లో కోటి రూపాయలు నగదు, బంగారం దొంగలు అపహరించారనే పుకార్లు పట్టణంలో షికార్లు చేశాయి. బాధితులు వచ్చే వరకు ఇతర వ్యక్తులు ఎవ్వరిని ఆ ఇంట్లోకి వెళ్లనీయలేదు. బాధితులు వచ్చి పగిలిన బీరువాను పరిశీలించారు. అలానే కొన్ని బ్యాంకులకు వారు స్వయంగా వెళ్లి లాకర్లను పరిశీలించుకున్నారు. అన్నింటినీ పరిశీలించుకున్న తరువాత 51 సవర్ల బంగారు ఆభరణాలు, రూ. 15 లక్షల నగదు చోరీకి గురయ్యాయని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

మరో ఇంటికి కన్నం వేసేందుకు ప్రయత్నం..
దొంగతనం జరిగిన ఇంటికి కూత వేటు దూరంలోనే మరో ఇంట్లో చోరీకి దొంగలు విశ్వ ప్రయత్నం చేశారు. ఎవరూ ఇంట్లో లేరని గుర్తించిన దొంగలు ఇంటి ప్రధాన ద్వారం తాళం పగలకొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఎంతకూ తాళం పగలకపోవడంతో హనుమంతరావు ఇంట్లో దొంగతనం చేసినట్లు పోలీసులు నిర్థారణకు వచ్చినట్లు సమాచారం.

సీసీ కెమెరా లేకపోవడంతోనే..
కొత్తపేటలోని ప్రధాన కూడలిలో జనం నిత్యం జనసంచారం ఉండే ప్రదేశంలో దొంగతనం జరగడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. పెద్ద భవంతిలోనే దొంగలు పడి దోచుకుంటే సామాన్యుల ఇళ్లు దొంగలకు పెద్ద పనికాదని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆ పెద్ద భవంతికి సీసీ కెమెరా లేకపోవడం కూడా దొంగలకు కలిసి వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. అయితే దొంగతనం జరిగిన ఇంటి ముందు పోలీసులు ఏర్పాటు చేసిన భారీ సీసీ కెమెరా ఉంది. దొంగలు సీసీ పుటేజీలో పడే అవకాశం ఉంది.  ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా ప్రజలు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతోనే దొంగతనాలు జరుగుతున్నాయని డీఎస్పీ పేర్కొన్నారు. ఊరికి వెళ్లే సమయంలో లాక్‌డ్‌ మానిటరింగ్‌ సిస్టంను ఉపయోగించుకుని ఉంటే దొంగతనం జరిగి ఉండేది కాదని, పోలీసులు నిరంతరం ఆ ఇంటిని కాపాలా కాస్తుండేవారని డీఎస్పీ తెలిపారు.

మరిన్ని వార్తలు