నందీశ్వర్‌ గౌడ్‌ కుమారుడిపై కేసు నమోదు

1 Dec, 2019 08:30 IST|Sakshi

పబ్‌లో మాజీ ఎమ్మెల్యే కుమారుడి వీరంగం 

బిగ్‌ బాస్‌–2 కంటెస్టెంట్‌ సంజనపై దాడికి యత్నం 

నోవాటెల్‌ ఆర్టిస్ట్రీ పబ్‌లో ఘటన  

సాక్షి, హైదరాబాద్‌ : పటాన్‌ చెరువు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌ గౌడ్‌  కుమారుడు ఆశిష్‌ గౌడ్‌ మాదాపూర్‌లోని నోవాటెల్‌లో గల ఆరిస్ట్రీ పబ్‌లోయువతులపై వీరంగం సృష్టించాడు. దీంతో బాధితురాలు బిగ్‌ బాస్‌ –2 కంటెస్టెంట్‌ అన్నె సంజన పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు.. బిగ్‌ బాస్‌–2 కాంటెస్టెంట్‌ అన్నె సంజన స్నేహితులు వి.శివాణి, వి.సంజన , రమేష్‌లతో కలిసి ఆదివారం తెల్లవారు జామున 2 గంటలకు నొవాటెల్‌లోని ఆర్టిస్ట్రీ పబ్‌కు వెళ్లింది. మొదటి అంతస్తులోని టేబుల్‌ వద్ద  ఉండగా కింది ఫ్లోర్‌లో ఉన్న అశిష్‌ గౌడ్‌ 2.45 గంటలకు 8 మంది స్నేహితులు కలిసి పైకి వచ్చారు. మద్యం మత్తులో ఉన్న అశిష్‌ గౌడ్‌ నన్ను గుర్తు పట్టావా అని అడగ్గా లేదని సమాధానమిచ్చింది. దీంతో రెచ్చిపోయిన అతను ఇగో ఎక్కువ .. ఎందుకు గుర్తు పడతావంటూ చెప్పలేని రీతిలో దూషణలకు దిగాడు. 

అంతటితో ఆగక ఖాళీ మద్యం బాటిళ్లను విసిరాడు.  వి.సంజన అనే యువతి తృటిలో తప్పించుకుంది.  సంజన చేయి పట్టుకొని అసభ్యంగా ప్రవర్తించాడు.  స్నేహితుడు రమేష్‌ అడ్డుకోవడంతో వెనక్కు తగ్గారు. అక్కడే ఉన్న బౌన్సర్‌ అజార్‌ పట్టించుకోకపోవడంతో అశీష్‌ మరింత రెచ్చిపోయాడు.  3 గంటల సమయంలో పోలీస్‌ కంట్రోల్‌ రూ మ్‌కు ఫోన్‌ చేయడంతో 15 నిమిషాల వ్యవధిలో మాదాపూర్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.  బౌన్సర్లు యువతులను వెనక ద్వారం వద్ద ఉంచి అశిష్‌ గౌడ్‌ అతని స్నేహితులను ప్రధాన ద్వారం నుంచి  బయటకు పంపారు. సంజనతో పాటు మరో మగ్గురు స్నేహితులు కలిసి తెల్లవారు జామున 4.30 గంటలకు మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితులపై ఐపీసీ 354, 354ఏ, 309 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.  

బాటిళ్లు విసిరి, తోసేశాడు...
గుర్తు పట్టలేదన్నందుకు మాటల్లో చెప్పలేని బూతులు తిట్టాడని బాధితురాలు అన్నె సంజన ‘సాక్షి’కి తెలిపారు. బూతులు తిడుతూ చేయి పట్టుకొని అసభ్యంగా ప్రవర్తించాడన్నారు.  తోసివేయడంతో ఓ దశలో కింది ఫ్లోర్‌లో పడిపోతానేమోనని భయమేసిందని, నా స్నేహితుడు అడ్డుకోవడంతో బయటపడ్డానని పేర్కొంది. ఆర్టిస్ట్రి పబ్‌ యాజామాన్యానికి కాల్‌ చేసినా పట్టించుకోలేదని ఆమె ఆరోపించారు. ఎస్‌ఐ శ్రీనివాస్‌ సీసీ పుటేజి స్పష్టంగా లేదని చెబుతున్నాడని, కేసు విత్‌డ్రా చేసుకోవాలని అశిష్‌ గౌడ్‌ చాలా మందితో ఫోన్లు చేయిస్తున్నాడని బాధితురాలు తెలిపింది.  

ఆ పబ్‌కు నిబంధనలు వర్తించవు... 
నోవాటెల్‌  వీకెండ్‌లో పబ్‌లకు రాత్రి 1 గంటలకు పోలీసుల అనుమతి ఉంటుంది. ప్రతి వీకెండ్‌లో తెల్లవారు జామున 3.30 గంటల వరకు నోవాటెల్‌లోని అర్టిస్ట్రీ పబ్‌ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. సైబరాబాద్‌ కమిషనరేట్‌కు కూతవేటు దూరంలో ఉన్న ఆదివారం తెల్లవారు జామున 3 గంటలకు గలాట జరిగిందంటే నిబంధనలకు విరుద్ధంగా పబ్‌ను నిర్వహిస్తున్నట్లు స్పష్టమవుతోంది. మాదాపూర్‌ పోలీసులతో పాటు సైబరాబాద్‌ ఎస్‌వో టీ పోలీసులు పబ్‌లపై నిఘా ఉంచుతున్నారు. తెల్లవారుజాము వరకు ఆర్టిస్ట్రీ పబ్‌ నడిచినా పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదనే విమర్శలు నెలకొన్నాయి.   

స్నేహితుడి కూతురితో అసభ్య ప్రవర్తన 
వాట్సాప్‌కు అశ్లీల చిత్రాలు 
మైనర్‌ బాలికకు అసభ్య మెసేజ్‌లు పంపిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.  కాచిగూడ ఇన్స్‌పెక్టర్‌ హాబీబుల్లా ఖాన్‌ తెలిపిన మేరకు.. హిమాయత్‌నగర్‌ రాయల్‌ డిమ్‌ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న మహ్మద్‌ వాహిదోద్దిన్‌ (43)  హరియంత్‌ మెడికల్‌ షాపులో పనిచేస్తున్నాడు. అక్కడ కొన్నేళ్లనుంచి మహ్మద్‌ వాహిదోద్దీన్‌ ఖాన్‌కు పంకజ్‌తో స్నేహం ఏర్పడింది. వాహిదోద్దీన్‌ తరచుగా ఇసామియా బజార్‌లో ఉంటున్న పంకజ్‌ ఇంటికి వచ్చి వెళ్లుతున్నాడు. దీంతో ఇంటర్మీడియట్‌ చదువుతున్న పంకజ్‌ కూతురు (17)తో వాహీదోద్దీన్‌ పరిచయం పెంచుకున్నాడు. ఆమె వద్ద ఫోన్‌ నెంబర్‌ తీసుకుని ఫోన్‌లో వాట్సప్‌లో అశ్లీల చిత్రాలను పంపిస్తూ వేధింపులకు గురిచేస్తున్నాడు. ఎంత చెప్పినా, మందలించినా వాహిదోద్దీన్‌ ఖాన్‌లో ఏమాత్రం మార్పురాలేదు. శనివారం రాత్రి పంకజ్‌ కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేశారు. పోలీసులు  వాహిదోద్దిన్‌ ఖాన్‌ ను అరెస్ట్‌ చేసి ఆదివారం రిమాండ్‌కు తరలించారు. 

మరిన్ని వార్తలు