వైద్యుడి నిర్లక్ష్యం : బిహార్‌లో మరో షాకింగ్‌ ఘటన

27 Jun, 2019 11:08 IST|Sakshi

దర్బంగా : బిహార్‌లో డాక్టర్ల నిర్ల​క్ష్యం మరోసారి బయటపడింది. ఒకవైపు మెదడువాపు వ్యాధితో వందల మంది పసిపిల్లలు చనిపోవడం కలకలం రేపుతోంది. మరోవైపు అదే ఆసుపత్రిలో వందలాది పుర్రెలు, అస్తిపంజరాలు బహిరంగంగా దర్శనమివ్వడం సంచలనం రేపింది. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఆసుపత్రుల్లో సౌకర్యాల లేమి, అపరిశుభ్రత తాండవిస్తుండటంపై సర్వత్రా చర్చకు దారితీసింది. ఇది ఇలా కొనసాగుతుండగానే మరో షాకింగ్ ఉదంతం వెలుగు చూసింది. ఒక బాలుడికి ఒక చేయి విరిగితే మరో చేతికి కట్టువేసి పంపించాడో డాక్టరు. బాలుడు, తల్లిదండ్రులు ఎంత చెబుతున్నా వినకుండా..అతి నిర్లక్ష్యంగా వ్యవహరించడం కలకలం రేపింది. దర్భంగా మెడికల్‌ కాలేజీ ఆసుపత్రిలో ఈ వైనం చోటు చేసుకుంది.

హనుమాన్‌ నగర్‌కు చెందిన ఫైజన్‌ మామిడి చెట్టు ఎక్కి అక్కడినుంచి కింద పడిపోయాడు. దీంతో అతని ఎడమ చేయి విరిగిపోయింది. ఆసుపత్రిలో ప్రాథకంగా పరీక్షలతోపాటు, ఎక్స్‌రేలో కూడా ఎడమ చేయి విరిగినట్టు స్పష్టంగా వుంది. అయితే ఆ బాలుడికి  చికిత్స చేసిన వైద్యుడు మాత్రం ఇవేమీ పట్టించుకోలేదు. ఎడమ చేతికి బదులు కుడిచేతికి సిమెంట్‌ కట్టు కట్టి పంపించాడు. దీంతో లబోదిబో మంటూ బాధితుడి తల్లిదండ్రులు ఆసుపత్రి సీనియర్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు.

తాను ఎంత చెబుతున్న వినకున్నా.. డాక్టరు హడావిడిగా కుడిచేతికి కట్టు కట్టారని బాధిత బాలుడు ఫైజన్‌ వాపోయాడు. దీనిపై తగిన  చర్యలు తీసుకోవాలని ఫైజన్‌ తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు. మరోవైపు  బాధితుల ఫిర్యాదును పరిశీలించిన పిదప తప్పు తమ సిబ్బందిదే అని ఆసుపత్రి  సూపరింటెండెంట్‌ రాజ్‌ రంజన్‌ ప్రసాద్‌ అంగీకరించారు. తక్షణమే తదుపరి చికిత్సను అందిస్తామనీ, విచారణ జరిపి బాధ్యులపై చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ వ్యవహారం రాష్ట్ర వైద్య విభాగానికి చేరింది. అటు రాష్ట్ర మంత్రి మంగళ్‌ పాండే ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించారు. దీనిపై నివేదిక అందించాల్సిందిగా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించారు.

మరిన్ని వార్తలు