'అడ్డు వస్తే హత్యలకు కూడా వెనుకాడరు'

12 Feb, 2020 18:05 IST|Sakshi
ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతున్న సీపీ అంజనీకుమార్‌

సాక్షి,హైదరాబాద్‌ : బంజారాహిల్స్‌ పీఎస్‌ పరిధిలో బంగారు ఆభరణాలు, వజ్రాలు చోరీ చేస్తున్న బీహార్‌కు చెందిన అంతరాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేసినట్లు హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌  పేర్కొన్నారు. నిందితుల వద్ద నుంచి రూ.  కోటి విలువైన నగలు, ఒక టీవీఎస్ అపాచీ బైక్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా బషీర్‌బాగ్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. గత సంవత్సరం డిసెంబర్‌ 9న పెద్ద మొత్తంలో   డైమండ్‌, బంగారు ఆభరణాలు చోరీ జరిగినట్లు బంజారాహిల్స్‌ పీఎస్‌కు ఫిర్యాదు వచ్చిందని తెలిపారు. దీంతో కేసును ఒక సవాలుగా తీసుకొని చేధించినట్లు సీపీ అంజనీ కుమార్‌ వెల్లడించారు. నిందితులందరూ బీహార్‌ రాష్ట్రంలోని మధుబని ప్రాంతానికి చెందినవారని, వీరి గ్యాంగ్‌కు రామషిష్‌ ముఖియా నేతృత్వం వహిస్తున్నాడని పేర్కొన్నారు. దొంగతనానికి పాల్పడే ముందు నెల రోజుల ముందే రెక్కీ నిర్వహించి వంట మనుషులుగా చేరుతామని వచ్చి వారిని నమ్మించి ఆ తర్వాత పెద్ద మొత్తంలో చోరీలకు పాల్పడుతారని వెల్లడించారు.

ఇదే విధంగా గత డిసెంబర్‌లో బాధితుని ఇంట్లో వంట మనుషులుగా చేరి వారందరూ ఫంక్షన్‌కు వెళ్లగానే రూ 1.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, డైమండ్‌ నగలను చోరీ చేశారని సీపీ తెలిపారు. గతంలోనూ రామషిష్‌ ముఖియాపై బీహార్‌తో పాటు మరో నాలుగు రాష్ట్రాల్లో కేసులు నమోదైనట్లు తెలిసిందని వెల్లడించారు.  A1 రామాషిష్ ముఖియా, A2 భగవత్ ముఖియా,A3 రాహుల్ ముఖియా,  A4 పీతాంబర్ మండల్, A5 బోలా ముఖియా, A6 హరిష్ చంద్ర ముఖియాపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీపీ అంజనీ కుమార్‌ స్పష్టం చేశారు.

డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ..  ఈ గ్యాంగ్‌ చాలా ప్రమాదకరమని, చోరీలు చేసే సమయంలో ఎవరైనా అడ్డువస్తే హత్యలు చేయడానికి కూడా వెనుకాడరని తెలిపారు. కాగా వీరు చోరీకి పాల్పడిన తర్వాత బీహార్‌కు వెళ్లారని, ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నెలరోజుల పాటు బీహార్‌లో గాలించి నిందితులను పట్టుకున్నట్లు శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. అయితే చోరీ చేసిన డైమండ్‌ నగలను సిమెంట్‌తో కప్పి వేసి బంగారాన్ని మాత్రం ఓ దుకాణంలో అమ్మివేసినట్లు నిందితులు తెలిపారని శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా