గిఫ్ట్‌ల పేరుతో గాలం

4 Jan, 2020 08:08 IST|Sakshi
నిందితులు సందీప్‌ కుమార్, మాణిక్‌చంద్‌ పాశ్వాన్, తౌసిఫ్‌ అహ్మద్, వికాస్‌ కుమార్‌

ఈ కామర్స్‌ నకిలీ కంపెనీల పేరుతో రూ. 5 కోట్లు టోకరా

వందల సంఖ్యలో బాధితులు సైబరాబాద్‌ పరిధిలోనే 80 కేసులు

బీహారీ గ్యాంగ్‌ అరెస్ట్‌

గచ్చిబౌలి: కొంపల్లికి చెందిన ఓ మహిళ గత అక్టోబర్‌ 8న ఆన్‌లైన్‌లో రూ.228 చెల్లించి స్నాప్‌డీల్‌ డాట్‌ కామ్‌లో స్పైరల్‌ పొటాటో కట్టర్‌ను కొనుగోలు చేసింది. అదే కంపెనీ పేరును పోలి ఉన్న క్యూపీఎస్‌ఎన్‌డీల్‌ పేరుతో ఆమెకు గత నవంబర్‌ 11న రూ.6.90 లక్షల నగదు లేదా టాటా నెక్సా కారు గెలిచారని మెసేజ్‌ వచ్చింది. మెసేజ్‌లోని టోల్‌ ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌ చేయడంతో తక్షణమే రూ.6500 చెల్లించాలని సూచించారు. కారు గెలిచానన్న ఆనందంలో ఆమె ఆన్‌లైన్‌లో ఆ మొత్తాన్ని చెల్లించింది. అనంతరం ఆమెకు ఫోన్‌ చేసిన గుర్తుతెలియని వ్యక్తులు జీఎస్‌టీ, ట్రాన్స్‌పోర్ట్, షోరూమ్, టోల్‌ గేట్‌ ఖర్చుల నిమిత్తం మరో రూ.2.30 లక్షలు చెల్లిస్తే టాటా నెక్సా కారు పంపిస్తామని, కారు రంగు కూడా ఎంపిక చేసుకోవచ్చునని నమ్మబలికారు. వెంటనే ఆ మొత్తాన్ని వారు సూచించిన బ్యాంక్‌ ఖాతాకు టాన్స్‌ఫర్‌ చేసింది. మరుసటి రోజు తనకు ఫోన్‌ వచ్చిన నంబర్‌కు కాల్‌ చేయగా సదరు టోల్‌ ఫ్రీ, వాట్సాప్‌ నంబర్‌లు అందుబాటులో లేకపోవడంతో ఆమె నివ్వెరపోయింది.  తాను మోసపోయినట్లు గుర్తించిన నవంబర్‌ 13న సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు బీహార్‌ ముఠా ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా ఇదే తరహాలో వందలాది మందిని మోసం చేసి దాదాపు రూ. 5 కోట్లు టోకరా వేసినట్లు విచారణలో వెల్లడైంది. శుక్రవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీ.సీ.సజ్జనార్‌  వివరాలు వెల్లడించారు.

ఫొటోతో ఎర..
బీహార్‌ రాష్ట్రం, షైక్‌పురా జిల్లా, కబీర్‌పుర గ్రామానికి చెందిన సందీప్‌ కుమార్‌ అలియాస్‌ ఆర్యన్‌ ఇంటర్‌తో చదువుకు స్వస్తి చెప్పాడు. అతను అదే రాష్ట్రానికి చెందిన బిపిన్‌ కుమార్, సందీప్‌ పాశ్వాన్, మాణిక్‌చంద్‌ పాశ్వాన్‌తో కలిసి ముఠా ఏర్పాటు చేశాడు. ఈ కామర్స్‌ కంపెనీల పేరుతో మోసాలకు పాల్పడాలని పథకం పన్నిన వీరు గజియాబాద్‌కు చెందిన తౌసిప్‌ నుంచి వోడా ఫోన్, ఎయిటెల్‌ టోల్‌ ఫ్రీ నంబర్లు తీసుకున్నారు. అనంతరం న్యూ ఢిల్లీకి చెందిన వికాస్‌ కుమార్‌తో కలిసి 13 నకిలీ వెబ్‌ సైట్లను సృష్టించారు. స్నాప్‌డీల్, ఫ్లిప్‌కార్ట్, హోమ్‌షాప్‌–18, షాప్‌క్లూస్, నాప్‌టాల్, అమెజాన్, క్లబ్‌ ఫ్యాక్టరీ తదితర ఈ కామర్స్‌ వినియోగదారుల డాటాను సేకరించారు. అనంతరం వారికి ఆయా కంపెనీల పేరుతో రూ.6.90 లక్షల నగదు లేదా టాటా నెక్సా కారును బంపర్‌ ప్రైజ్‌గా గెలిచారని బల్క్‌ మేసేజ్‌లు పంపేవారు. మెసేజ్‌లో ఉన్న టోల్‌ ఫ్రీ నెంబర్, వాట్సాప్‌ నంబర్‌కు ఫోన్‌ చేస్తే ఆన్‌లైన్‌ కొనుగోలు చేసిన వస్తువు పేరు, ఐడీ నంబర్, డేట్‌ చెబుతూ వారి నమ్మకాన్ని సంపాదిస్తారు. అనంతరం వాట్సాప్‌కు వారి పేరు బంపర్‌ ప్రైజ్‌ను గెలిచిన టికెట్‌తో పాటు నెక్సా కారు ఫొటోను పంపుతారు. 

కారు లేదా నగదు కావాలంటే ముందు రూ.6500 చెల్లించాలని కోరుతారు. ఆ తర్వాత ట్యాక్స్‌ల పేరుతో రూ.లక్షలు బ్యాంక్‌ ఖాతాలో డిపాజిట్‌ చేస్తే వెంటనే కారు పంపిస్తామని నమ్మబలుకుతారు. అంతేగాక తాము ఈ కామర్స్‌ కంపెనీ ఉద్యోగులమని నమ్మించేందుకు తమ నకిలీ ఐడీ, పాన్, ఆధార్‌ కార్డులను వాట్సాప్‌లో పంపుతారు. నగదు బ్యాంక్‌ ఖాతాలో జమ కాగానే టోల్‌ ప్రీ నంబర్, వాట్సాప్‌ నంబర్లకు కాల్‌ రాకుండా ఆయా నంబర్లను రిజక్ట్‌లో పెడతారు. ఇదే తరహాలో వీరు వందల మందిని మోసగించారని, సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోనే వీరి బాధితులు 80 మంది ఉన్నట్లు సీపీ తెలిపారు.నిందితులు సందీప్‌ కుమార్‌ అలియాస్‌ ఆర్యన్, మాణిక్‌చంద్‌ పాశ్వాన్, తౌసిఫ్‌ అహ్మద్, వికాస్‌ కుమార్‌లను అరెస్ట్‌ చేశామని, మరో ఇద్దరు నిందితులు బిపిన్‌ కుమార్, సందీప్‌ పాశ్వాన్‌ పరారీలో ఉన్నట్లు సీపీ తెలిపారు. వారి నుంచి 12 సెల్‌ ఫోన్లు, రెండు ల్యాప్‌టాప్‌లు, స్కానర్‌ కమ్‌ ప్రింటర్, స్కార్పియో కారు, 19 సిమ్‌ కార్డులు, నకిలీ పాన్, ఆధార్, ఓటర్‌ ఐడీ కార్డులు ,4 డెబిట్‌ కార్డులు, 5 స్నాప్‌ డీల్‌ ఐడీ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.

నకిలీ టోల్‌ ఫ్రీ నంబర్లపై విచారణ
కేవైసీ డాక్యుమెంట్లు లేకుండా టోల్‌ ఫ్రీ నెంబర్లు ఇవ్వడంపై సెల్‌ఫోన్‌ కంపెనీలను విచారించనున్నట్లు సీపీ సజ్జనార్‌ తెలిపారు. అంతే కాకుండా ఈ కామర్స్‌ వినియోగదారుల డాటా చోరీపై సదరు కంపెనీలను ప్రశ్నిస్తామన్నారు. గిఫ్ట్‌ వచ్చిందనే మెసేజ్‌లను నమ్మ వద్దని, వాటిని వెంటనే డిలీట్‌ చేయాలని ఆయన సూచించారు. ఈ కామర్స్‌ కంపెనీలు ఎవరికి గిఫ్ట్‌లు ఇవ్వవని సీపీ పేర్కొన్నారు. సమావేశంలో సైబరాబాద్‌ క్రైమ్స్‌ అడిషనల్‌ డీసీపీ కవిత, సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ శ్రీనివాస్, ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాస్, రామయ్య, చంద్రశేఖర్, ఎస్‌ఐలు విజయ్‌ వర్ధన్, రాజేంద్ర, గౌతమ్‌ తదితరులు పాల్గొన్నారు.  

చదివింది ఇంటర్‌..మోసాల్లో మాస్టర్స్‌
ఈ ముఠా సభ్యులు ఇంటర్‌తో చదువు ఆపేసినా మోసాల్లో మాత్రం ఆరితేరారు. బీహర్‌లోని నలంద, నవాడ, వస్లీగంజ్‌ జిల్లాల్లోని ములంద్, పంచ్, చాక్వాయ్, డాక్రా, కబీర్‌పుర్, కటర్దీ, భగవాన్‌పూర్, మాయాపూర్, మీర్‌బీగా గ్రామాల నుంచి ఈ ముఠా సభ్యులు రోజుకు 50 మంది చొప్పున బల్క్‌ ఎస్‌ఎంఎస్‌లు పంపిస్తారు. స్పందించిన వారిని నగదు, కారు పేరుతో బుట్టలో పడేస్తారు. ఆపై ఆన్‌లైన్‌లో నగదు డిపాజిట్‌ చేయించుకుని టోకరా వేస్తారు. నిందితుల స్నేహితుడైన సూరజ్‌ సింగ్‌ ఎస్‌బీఐ అకౌంట్‌తో పాటు మరో ఇద్దరు స్నేహితుల ఖాతాల్లో డబ్బులు జమ అయినట్లు పోలీసులు గుర్తించారు. గతంలో గుడిసెల్లో నివాసం ఉండే వీరు నేడు భవనాలు నిర్మించుకున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు