అగ్రికల్చర్‌ యూనివర్సిటీలో రోడ్డు ప్రమాదం

16 May, 2019 08:03 IST|Sakshi
వాహనంలో 90 స్పీడ్‌ చూపిస్తున్న మీటర్‌

అతివేగంతో ప్రధాన గేటును ఢీకొట్టిన విద్యార్థి

తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలింపు

రాజేంద్రనగర్‌:  ప్రొఫెసర్‌జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీ క్యాంపస్‌లో మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి తీవ్ర గాయాలపాలయ్యాడు. వివరాల్లోకి వెళితే.. వర్సిటీలో మొదటి సంవత్సరం చదువుతున్న రాహుల్‌æ(22) తన సీనియర్‌కు చెందిన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ వాహనాన్ని తీసుకోని రాత్రి ఒంటి గంట ప్రాంతంలో బయటకు వెళ్లేందుకు బయల్దేరాడు. 90 కిలోమీటర్ల వేగంతో దూసుకువచ్చిన ఎన్‌ ఫీల్డ్‌ వాహనం మూసి ఉన్న వర్సిటీ ప్రధాన గేట్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో రాహుల్‌ ప్రొఫెసర్‌ జయశంకర్‌ విగ్రహం పక్కనే ఉన్న ఫుట్‌పాత్‌పై ఎగిరి పడ్డాడు.

అదే సమయంలో దారి గుండా వెళ్తున్న యువకులు  రక్తపు మడుగులో పడి ఉన్న రాహుల్‌ను  గమనించి 108కు సమాచారం అందించారు. రాహుల్‌ సెల్‌కు వచ్చి న ఫోన్‌ను రిసీవ్‌ చేసి విషయాన్ని తెలపడంతో విద్యార్థులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్నారు. 108 సిబ్బంది గాయపడిన రాహుల్‌కు ప్రథమ చికిత్స నిర్వహించి ఉస్మానియాకు తరలించారు. ప్రమాదంలో ఎన్‌ఫీల్డ్‌ ముందుభాగం ధ్వంసం కాగా, గేటు సైతం విరిగిపోయింది. తోటి విద్యార్థులు రాజన్న జిల్లాకు చెందిన రాహుల్‌ తండ్రి నర్సింలుకు సమాచారం అందించడంతో బుధవారం తెల్లవారుజామున కుటుంబీకులు ఉస్మానియా ఆస్పత్రికి చేరుకున్నారు.   కేసు నమోదు చేసిన రాజేంద్రనగర్‌ పోలీసులు దర్యాప్త# చేస్తున్నారు.

మరిన్ని వార్తలు