ఆటో..ద్విచక్రవాహనం ఢీ

20 Apr, 2019 11:53 IST|Sakshi
సంఘటన ప్రాంతంలో పడి ఉన్న బైక్‌

ఆరుగురికి తీవ్ర గాయాలు

తీవ్రంగా గాయపడిన ముగ్గురిని నరసరావుపేట, వినుకొండ వైద్యశాలలకు తరలింపు

ప్రకాశం, యర్రగొండపాలెం టౌన్‌:  వేగంగా వస్తున్న ద్విచక్రవాహనం ఎదురుగా వస్తున్న ఆటోను ఢీ కొన్న సంఘటనలో ద్విచక్రవాహనం నడుపుతున్న వ్యక్తితో పాటు ఆటో డ్రైవర్, ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణీకులు గాయపడ్డారు. ఆటోలో ప్రయాణిస్తూ గాయపడిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఈ సంఘటన యర్రగొండపాలెం మండలంలోని మార్కాపురం రోడ్‌లో అన్నకుంట సమీపంలో శుక్రవారం సాయంత్రం జరిగింది. పోలీసులు కథనం ప్రకారం యర్రగొండపాలెం పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న పి.మల్లారెడ్డి మార్కాపురం నుంచి ద్విచక్ర వాహనంపై యర్రగొండపాలెం వస్తుండగా, బోయలపల్లె గ్రామానికి చెందిన పిన్నిక వెంకటేశ్వర్లు, పిన్నిక శివమ్మ(దంపతులు) ఆవులమంద నర్సమ్మ, నక్కా కోటేశ్వరరావులు యర్రగొండపాలెం నుంచి యల్లారెడ్డిపల్లె గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్‌ శ్రీను ఆటోలో బోయలపల్లెకు వెళుతున్నారు.

మార్గం మధ్యలోని అన్నకుంట సమీపంలో యర్రగొండపాలెం వైపు వేగంగా వస్తున్న హోంగార్డు మల్లారెడ్డి ద్విచక్ర వాహనం బోయలపల్లె వైపు వెళుతున్న ఆటోను ఢీకొట్టింది. ద్విచక్ర వాహనం నడుపుతున్న మల్లారెడ్డి, ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు, ఆటో డ్రైవర్‌ శ్రీనులు గాయపడ్డారు. ప్రమాదంలో హోంగార్డు మల్లారెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. ఇతని కుడికాలి వేళ్లు తెగి పోయాయి. ఆటోలో ప్రయాణిస్తున్న ఆవులమంద నర్సమ్మ(వృద్ధురాలు) ఎడమచేయి గూడ తొలిగిపోయి, తీవ్రంగా గాయపడింది. ఆటోడ్రైవర్‌ శ్రీను కుడికాలు విరిగి, తీవ్రంగా గాయపడ్డాడు. పిన్నిక వెంకటేశ్వర్లుకు తలకు, రెండు మోకాళ్లకు, ఎడమ చేయి మణికట్టుకు గాయాలయ్యాయి. పిన్నిక శివమ్మకు కుడి మోకాలు, ఎడమకాలు పాదానికి గాయాలయ్యాయి. నక్కా కోటేశ్వరరావుకు మోకా ళ్లకు, తలకు స్వల్పగాయాలయ్యాయి. సమీపంలోని కొందరు గాయపడిన వారిని ఆటోలో స్థానిక ప్రభు త్వ వైద్యశాలకు తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం తీవ్రంగా గాయపడిన హోంగార్డు మల్లారెడ్డి, ఆటో డ్రైవ ర్‌ శ్రీనులను మెరుగైన వైద్యం కోసం నరసరావుపేట వైద్యశాలకు ప్రత్యేక వాహనాల్లో తరలించారు. ఆవులమంద నర్సమ్మను వినుకొండ వైద్యశాలకు తరలించారు. పిన్నిక వెంకటేశ్వర్లు, శివమ్మలు స్థానిక వైద్యశాలలో చికిత్స పొందుతుండగా, స్వల్పంగా గాయపడిన కోటేశ్వరరావు ప్రాథమిక చికిత్స అనంతరం స్వగ్రామం బోయలపల్లెకు వెళ్లాడు. ఎస్సై ఎం.దేవకుమార్‌ ఈ సంఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని వార్తలు