పండుగ మిగిల్చిన విషాదం

15 Nov, 2018 08:41 IST|Sakshi
మృతదేహంతో ధర్నా చేస్తున్న సంగమేశ్వర్‌రెడ్డి కుటుంబీకులు, బంధువులు సంగమేశ్వర్‌రెడ్డి (ఫైల్‌)

రాజేంద్రనగర్‌: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతిచెందాడు. ప్రమాదానికి కారణమైన వ్యక్తి ఇంటి ముందు బాధిత కుటుంబీకులు, బంధువులు మృతదేహంతో ధర్నా చేపట్టారు. ఈ సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బాబుల్‌రెడ్డినగర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాబుల్‌రెడ్డినగర్‌ ప్రాంతానికి చెందిన సంగమేశ్వర్‌రెడ్డి(40) తన కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి(15)తో కలిసి ఈ నెల 7వ తేదీ దీపావళి పండుగ రోజు దుర్గానగర్‌లో బాణసంచా కొనుగోలు చేసేందుకు వెళ్లారు. రోడ్డు దాటుతున్న క్రమంలో పల్సర్‌ వాహనంపై వేగంగా వచ్చిన ముగ్గురు యువకులు వీరిని ఢీకొట్టారు. తీవ్రంగా గాయపడిన తండ్రీకొడుకులను చికిత్స నిమితం నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న సంగమేశ్వర్‌రెడ్డి బుధవారం మధ్యాహ్నం పరిస్థితి విషమించి కన్నుమూశారు.

దీంతో బాధిత కుటుంబ సభ్యులు ప్రమాదానికి కారణమైన వాహన యజమాని బాబుల్‌రెడ్డినగర్‌కు చెందిన రణవీర్‌సింగ్‌ ఇంటి ముందు మృతదేహంతో ధర్నాకు దిగారు. రణవీర్‌సింగ్‌ ఇంట్లో అద్దెకు ఉంటున్న యువకుడు ఈ వాహనాన్ని పండుగ రోజున తీసుకువెళ్లి తండ్రీకొడుకులను ఢీకొట్టాడు. విషయం తెలుసుకున్న మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతుడి కుటుంబ సభ్యులను, బంధువులను సముదాయించారు. వాహనం నడిపిన యువకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తమ కుటుంబాన్ని ఆదుకోవాలని మృతుడి బంధువులు డిమాండ్‌ చేస్తున్నారు. కాగా రాత్రయినా ధర్నా కొనసాగుతోంది.

మరిన్ని వార్తలు