ముఠా చిక్కిందా?

5 Jan, 2019 12:58 IST|Sakshi
సీసీఎస్‌ పోలీసులు అరెస్ట్‌ చేసిన బైక్‌ దొంగలు (ఫైల్‌)

పెరిగిన బైక్‌ దొంగతనాలు

సీసీఎస్‌ పోలీసుల ప్రత్యేకదృష్టి

అదుపులో ముఠా సభ్యులు?    

నెల్లూరు(క్రైమ్‌): బైక్‌ దొంగతనాలు జిల్లావాసులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఇల్లు, బయట అన్న తేడా లేకుండా ఎక్కడా పార్కింగ్‌ చేసినా దుండగులు అపహరించుకెళుతున్నారు. నెల్లూరు నగరంతోపాటు, శివారు ప్రాంతాల్లో బైక్‌ చోరీలు అధికంగా జరుగుతున్నాయి. రూ.వేలు వెచ్చించి కొనుగోలు చేసిన వాహనాలు అపహరణకు గురవడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బైక్‌ పోయిందని ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వెళితే దొంగల కోసం గాలిస్తున్నామని దొరికితే వాహనాలు ఇస్తామని చెప్పి పంపుతున్నట్లు బాధితులు పేర్కొంటున్నారు. 

నిఘా ముమ్మరం
ఈ నేపథ్యంలో నెల్లూరు సీసీఎస్‌ పోలీసులు బైక్‌ దొంగతనాలపై దృష్టి సారించారు. చోరీలకు పాల్పడి పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న నిందితుల కోసం విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. పాతనేరస్తుల కదలికలపై నిఘా ముమ్మరం చేశారు. ఇప్పటికే పలువురు నిందితులను అరెస్ట్‌చేసి రూ.లక్షలు విలువచేసే బైక్‌లను స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించారు. తాజాగా నెల్లూరు నగరంలో ఓ ముఠాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. వారి వద్ద నుంచి పెద్దసంఖ్యలో బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మరిన్ని బైక్‌లను రాబట్టే పనిలో పోలీసులు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా పట్టుబడుతున్న దొంగల్లో అందరూ కొత్తవారే. 25 ఏళ్లలోపు ఉన్న యువకులే కావడం కలవరపాటుకు గురిచేస్తోంది.

జల్సాల కోసం నేరాలబాట
కొందరు యువకులు విలాసవంతమైన జీవితం కోసం చోరీలకు పాల్పడుతున్నట్లు చెబుతున్నారు. బెట్టింగ్, మద్యం, వ్యభిచారం, పేకాట తదితర జల్సాలకు అలవాటుపడిన కొందరు నేరాల బాట పడుతున్నారు. దొంగలించిన సొత్తును విక్రయించి జల్సాగా జీవనం సాగిస్తున్నారు. ఇటీవల ముగ్గురు యువకులు బైక్‌ దొంగతనాలకు పాల్పడుతూ సీసీఎస్‌ పోలీసులకు చిక్కిన విషయం విధితమే. సదరు నిందితులు విచారణలో మత్తు ఉత్ప్రేరకాలు, మద్యం తాగేందుకు డబ్బులు లేకపోవడంతో చోరీలు చేస్తున్నామని వెల్లడించారు. బాలాజీనగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేసిన వారిలో ఓ మైనర్‌ ఉన్నాడు. గతంలో ఈ తరహా దొంగతనాలు పాతనేరస్తులు చేసేవారు. ఇప్పుడు కొత్తవారు ఆర్థిక అవసరాల కోసం దొంగలుగా మారి విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.   

పలు ఘటనలు.. 
నెల్లూరు మూలాపేటకు చెందిన అరుణ్‌కుమార్‌ ఇటీవల నగరంలోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌కు వెళ్లాడు. అక్కడ తన బైక్‌ను పార్క్‌చేసి హాస్పిటల్‌లో ఉన్న బంధువులను పలకరించి వచ్చేలోగా అతని బైక్‌ అపహరణకు గురైంది.
నెల్లూరు నవాబుపేటకు చెందిన చాన్‌బాషా విజయమహాల్‌గేటు సమీపంలోని కల్యాణమండపం వద్ద బైక్‌ను పార్క్‌చేసి టికెట్ల కోసం ఎస్‌–2 థియేటర్‌కు వెళ్లాడు. తిరిగి వచ్చేలోపు అతని బైక్‌ చోరీకి గురైంది.
నెల్లూరు బట్వాడిపాళెంకు చెందిన పీటర్‌ బంధువులను రైలు ఎక్కించేందుకు బైక్‌పై రైల్వేస్టేషన్‌కు వెళ్లారు. తిరిగి వచ్చిచూసేసరికి బైక్‌ను దుండగులు అపహరించారు. ఇలా నిత్యం ఏదో ఒక ప్రాంతంలో బైక్‌ దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి.

>
మరిన్ని వార్తలు