స్నాచర్లను పట్టుకుంటే గ్యాంగ్‌ దొరికింది

17 Dec, 2019 09:34 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌

వేర్వేరుగా ముఠాలు నిర్వహిస్తున్న మెకానిక్‌

వాహనచోరీలతో పాటు స్నాచింగ్స్‌ కూడా

11 మందిని పట్టుకున్న టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌

ఆటో సహా 28 వాహనాలు,ఫోన్లు స్వాధీనం

సాక్షి, సిటీబ్యూరో: సైఫాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్న ఓ సెల్‌ఫోన్‌ స్నాచింగ్‌ కేసులో నిందితులను అదుపులోకి తీసుకున్న సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వారి నుంచి ఓ బైక్‌ స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఆరా తీయగా అది పేట్‌ బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోరీకి గురైనట్లు తేలింది. దీంతో లోతుగా విచారించిన అధికారులు 11 మంది సభ్యులతో కూడిన వాహనచోరీలు, చైన్‌ స్నాచింగ్‌ల  ముఠాను పట్టుకున్నారు. ఈ గ్యాంగ్‌లీడర్‌ ఆదేశాల మేరకు సభ్యులు వేర్వేరు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడినట్లు నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావుతో కలిసి సోమవారం తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. బజార్‌ఘాట్‌ ప్రాంతానికి చెందిన అబ్దుల్‌ వాహెద్‌ అలియాస్‌ అఫ్రోజ్‌ అలియాస్‌ అఫ్రోజ్‌ ఖాన్‌ ఎనిమిదితో తరగతితో చదువుకు స్వస్థి చెప్పాడు. ఆపై కొన్నాళ్ల పాటు ఆటోడ్రైవర్‌గా పని చేసిన ఇతను చివరకు బైక్‌ మెకానిక్‌గా మారాడు. దురలవాట్లకు బానిసైన అతను ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు వాహనచోరీలకు పాల్పడాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆసిఫ్‌నగర్‌కు చెందిన మహ్మద్‌ అల్తాఫ్, జిర్రాకు చెందిన సయ్యద్‌ జమీల్, రాజేంద్రనగర్‌కు చెందిన అమీర్, మోతీదర్వాజ ప్రాంతానికి చెందిన మరో మైనర్‌తో కలిసి ముఠా ఏర్పాటు చేశాడు. వృత్తిరీత్యా మెకానిక్‌ అయిన వాహెద్‌కు వాహనాల తాళాలు పగులకొట్టడం, అసలు తాళం చెవి లేకుండా స్టార్ట్‌ చేయడంపై పట్టుంది. దీనిపై తన గ్యాంగ్‌ సభ్యులకు అవగాహన కల్పించిన అతను వాహన చోరీలకు పురిగొల్పాడు. మహ్మద్‌ అల్తాఫ్‌ ద్వారా వహీద్‌కు కుమ్మర్‌వాడికి చెందిన ఎలక్ట్రీషియన్‌ హర్షవర్ధన్‌తో పరిచయం ఏర్పడింది.

అతడినీ ఈ ‘రంగం’లోకి దింపిన వాహెద్‌ చోరీలకు ప్రోత్సహించాడు. దీంతో ఇతగాడు తన స్నేహితులైన అభిషేక్, ఉదయ్‌కిరణ్, అభిలాష్, మల్లేష్‌లతో ముఠా కట్టాడు. వీరు వాహనచోరీలతో పాటు స్నాచింగ్స్‌లకు పాల్పడేవారు. ఈ చోరీ సొత్తును తీసుకునే వాహెద్‌ దానిని జిర్రాలో వెల్డింగ్‌ దుకాణం నిర్వహించే సయ్యద్‌ జమీల్‌తో పాటు ఆసిఫ్‌నగర్‌కు చెందిన సేల్స్‌మెన్‌ షేక్‌ జమీర్‌లకు విక్రయించేవాడు. అలా వచ్చిన సొమ్మును అందరూ పంచుకునే వారు. రిసీవర్‌గా ఉన్న సయ్యద్‌ జమీల్‌ ఈ గ్యాంగ్స్‌తో కలిసి కొన్ని నేరాలు కూడా చేశాడు. దాదాపు నాలుగు నెలలపాటు ఈ ముఠాలు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండలతో పాటు సంగారెడ్డి జిల్లాలోనూ పంజా విసిరాయి. వీరు ప్రధానంగా పార్కింగ్‌ ప్లేసులు, మాల్స్, ఇళ్ల వద్ద నిలిపి ఉంచిన వాహనాలనే ఎత్తుకెళ్లేవారు. సాయికిరణ్, మల్లేష్‌లు కొన్నాళ్ల క్రితం పేట్‌ బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ పార్కింగ్‌ ఏరియా నుంచి బైక్‌ చోరీ చేశాడు. గత నెల 17న దానిపై వెళ్లిన హర్షవర్థన్, ఉదయ్‌ కిరణ్, అభిషేక్‌ సైఫాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ సెల్‌ఫోన్‌ స్నాచింగ్‌కు పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ జావేద్‌ నేతృత్వంలో ఎస్సైలు టి.శ్రీధర్, కె.శ్రీనివాసులు, మహ్మద్‌ షానవాజ్‌ షఫీలతో కూడిన బృందం ఘటనాస్థలిలోని సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టింది.

ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని స్నాచింగ్‌కు ఉపయోగించిన వాహనాన్ని స్వా«ధీనం చేసుకున్నారు. ఇది తమ బంధువుకు చెందినదని నిందితులు చెప్పడంతో వాహనం పత్రాల కోసం  ఆరా తీశారు. వారి వద్ద అవి లేకపోవడంతో వాహనంతో పాటు ఇంజిన్, చాసిస్‌ నంబర్‌ ఆధారంగా సదరు బైక్‌ కొన్నాళ్ల క్రితం పేట్‌ బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోరీకి గురైనట్లు గుర్తించారు. దీంతో నిందితులను విచారించగా మొత్తం ముఠాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మైనర్‌తో పాటు చోరులు, రిసీవర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి ఆటో, బుల్లెట్, కేటీఎంలతో సహా 28 వాహనాలు, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలు సిటీలో మూడు, సైబరాబాద్‌లో 22, రాచకొండలో 5, సంగారెడ్డిలో 3 నేరాలు చేసినట్లు గుర్తించారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితులను వారు నేరం చేసిన ప్రాంతాల వారీగా స్థానిక పోలీసులకు అప్పగించారు. హర్షవర్ధన్, ఉదయ్‌కిరణ్, అభిషేక్, జమీర్‌లను సైఫాబాద్, అమీర్‌ఖాన్, అల్తాఫ్, సమీల్‌లను ఎస్సార్‌నగర్, అబ్దుల్‌ వాహెద్‌తో పాటు మైనర్‌ను మీర్‌చౌక్, సాయికిరణ్, మల్లేష్‌లను పేట్‌ బషీరాబాద్‌ పోలీసు స్టేషన్లకు అప్పగించినట్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు