కన్ను పడిందా బైక్‌ మాయం

25 May, 2018 08:05 IST|Sakshi
విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా ఎస్పీ రాజకుమారి

వందకు పైగా మోటారు సైకిళ్లు చోరీ చేసిన నిందితుడి అరెస్ట్‌

బైక్‌ చోరీ చేస్తున్న ముగ్గురు అంతర్‌ జిల్లా చోరుల అరెస్ట్‌

42 బైక్‌లు స్వాధీనం చేసుకున్న రాజమహేంద్రవరం క్రైం బ్రాంచ్‌ పోలీసులు

రాజమహేంద్రవరం క్రైం: కొంతకాలంగా రాజమహేంద్రవరం బొల్లినేని ఆసుపత్రి వద్ద చికిత్స కోసం వచ్చే వారి బైక్‌లు మాయం కావడంపై పోలీసులకు ఫిర్యాదు అందాయి. నెలరోజుల్లో సుమారు ఎనిమిదికి పైగా బైక్‌ చోరీలు జరిగాయి. దీంతో స్పందించిన అర్బన్‌ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి క్రైం బ్రాంచ్‌ పోలీసులను రంగంలోకి దింపారు. వారు 12 రోజుల పాటు ఆసుపత్రి ప్రాంతంలో నిఘా ఏర్పాటు చేయడంతో బైక్‌లకు చోరీ చేస్తున్న నిందితులు పట్టుబడ్డారు. వారి వివరాలను రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి గురువారం త్రీటౌన్‌ క్రైం పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా, ఉండ్రాజవరం మండలం, సత్యవాడ గ్రామానికి చెందిన కుప్పాల రంగారావు, పెరవలి మండలం కానురు గ్రామానికి చెందిన వీరమల్లు నాగేశ్వరరావు, కొవ్వూరు మండలం వాడపల్లి గ్రామానికి చెందిన కోరాడ వెంకటేశ్వర్లు అనే ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేశారు. వీరి వద్ద నుంచి 42 మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు.

వందకుపైగా చోరీలు
ఉండ్రాజవరం గ్రామానికి చెందిన కుప్పాల రంగారావు పాత నేరస్తుడు. ఇతడు సుమారు 20 ఏళ్లుగా మోటారు సైకిళ్లను చోరీ చేస్తున్నాడు. రావులపాలెం, భీమవరం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం, నూజివీడు, రాజమహేంద్రవరం, తదితర పట్టణాల్లో ఇప్పటి వరకు సుమారు వంద మోటారు సైకిళ్లకు పైగా చోరీలకు పాల్పడ్డాడు జైలు శిక్షలను కూడా అనుభవించాడు. ఇతడికి ఉండారజవరం పోలీస్‌ స్టేషన్‌లో హిస్టరీ షీట్‌ ఉందని తెలిపారు. గత ఏడాది 2017 ఆగస్టులో నూజివీడు సబ్‌జైల్‌ నుంచి విడుదలై 2018 మార్చి నుంచి మోటారు సైకిళ్లు చోరీలు చేయడం తిరిగి మొదలు పెట్టి ధవళేశ్వరంలో ఒకటి, రాజమహేంద్రవరంలో 17, పాలకొల్లులో ఐదు, భీమవరంలో ఏడు మొత్తం 30 మోటారు సైకిళ్లు చోరీ చేశాడు. రంగారావుకు సహాయకుడిగా వీరమల్లు నాగేశ్వరరావు ఉన్నాడు. కొవ్వూరు మండలం, వాడపల్లి గ్రామానికి చెందిన కోరాడ వెంకటేశ్వర్లు తాపీ పని కూలిపనులు చేస్తూ వ్యసనాలకు బానిసై మోటారు సైకిళ్ల చోరీలకు పాల్పడుతున్నాడు.

రాజమహేంద్రవరం బొల్లినేని హాస్పిటల్‌ వద్ద, ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద, మండపేట, రావులపాలెంలలో 12 మోటారు సైకిళ్లు చోరీ చేసి తన ఇంటి వద్ద దాచి ఉంచాడు. క్రైం బ్రాంచ్‌ డీఎస్పీ ఎ.త్రినాథరావు, ఇన్‌స్పెక్టర్‌ పి.మురళీకృష్ణా రెడ్డి, ఎస్సై కె.విశ్వనాథ్, ప్రకాష్‌ నగర్‌ ఎస్సై పి. వెంకన్నలు ముద్దాయిలపై నిఘా ఉంచి గౌతమి ఘాట్‌ వద్ద రంగారావు, వీరమల్లు నాగేశ్వరరావులను, బొల్లినేని హాస్పిటల్‌ వద్ద కోరాడ వెంకటేశ్వర్లును అరెస్ట్‌ చేసినట్టు తెలిపారు. వీరి నుంచి 42 మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ సుమారు రూ. 25 లక్షలు ఉంటుందని వివరించారు. నిందితులను అరెస్ట్‌ చేసి భారీ స్థాయిలో మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్న క్రైం బ్రాంచ్‌ డీఎస్పీ త్రినాథరావును, సీఐ పి.మురళీకృష్ణా రెడ్డిని, క్రైం సిబ్బంది సురేష్, రమణ, శ్రీను, గౌతమ్, మణికంఠ, కె. బూరయ్య, స్వామి లను అభినందించారు. వారికి రివార్డులు అందిస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు