జాయ్‌ రైడర్లకు జైలు

6 Jun, 2019 07:22 IST|Sakshi
పోలీసుల అదుపులో ప్రణయ్‌

సరదా కోసం బైక్‌ల చోరీ  

గంజాయి కొనేందుకు దోపిడీలు

మైనర్‌ సహా మరో యువకుడి అరెస్ట్‌

సాక్షి, సిటీబ్యూరో: విద్యార్థులైన వారిద్దరిలో ఒకరు మేజర్‌... మరొకరు మైనర్‌. బైక్‌లపై తిరగాలనే కోరిక ఉన్నా వీరికి ఆ స్థోమత లేదు... గంజాయి బానిసలైన వీరికి వాటిని కొనేందుకు డబ్బులు లేవు. దీంతో వీరిద్దరూ దొంగలుగా మారారు. కేవలం 12 రోజుల వ్యవధిలో నగర వ్యాప్తంగా నాలుగు బైక్‌ల దోపిడీ, ఓ సెల్‌ఫోన్‌ చోరీకి పాల్పడిన వీరిని నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు బుధవారం తెలిపారు. వీరిద్దరిపై గతంలోనూ కేసులు ఉన్నాయన్నారు. ప్రకాశం జిల్లా గండుపల్లికి చెందిన మామిడి ప్రణయ్‌ తల్లిదండ్రులు కొన్నాళ్ల క్రితం నగరానికి వలసవచ్చారు. వీరి కుటుంబం ప్రస్తుతం సైనిక్‌పురి నిర్మలనగర్‌లో నివసిస్తుండగా ప్రణయ్‌ డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. మద్యం, గంజాయి సహా అనేక దురలవాట్లకు బానిసైన అతడికి వాటిని కొనేందుకు డబ్బులు లేవు. ద్విచక్ర వాహనాలపై షికార్లు చేయాలనే కోరిక ఉన్నప్పటికీ ఇతడికి బైక్‌ లేదు.

బైక్‌ కావాలని అడిగినా  అడిగినా తల్లిదండ్రులు కొనిచ్చే పరిస్థితి లేకపోవడంతో జాయ్‌ రైడింగ్‌ కోసం బైక్‌ల చోరీకి పాల్పడుతున్నాడు. మరికొన్ని చిన్న చిన్న చోరీలు చేస్తూ జల్సా చేసేవాడు. అదే ప్రాంతానికి చెందిన విద్యార్థి అయిన మరో మైనర్‌ (16) కూడా ఇలాంటి నేపథ్యమే కలిగి ఉండి ఇతడితో జట్టు కట్టాడు. ప్రణయ్‌పై గతంలో కుషాయిగూడ ఠాణాలో ఒకటి, మైనర్‌పై రామ్‌గోపాల్‌పేట్, మియాపూర్, కుషాయిగూడ ప్రాంతాల్లో నాలుగు కేసులు నమోదై ఉన్నాయి. ముఠాగా ఏర్పడిన వీరి గత నెల 19 నుంచి మళ్లీ నేరాలు చేయడం మొదలెట్టారు. అదే రోజు చందానగర్‌ పరిధిలో బైక్‌ను చోరీ చేశారు. 21న రాత్రి దీనిపై తిరుగుతూ బేగంపేటలోని బైసన్‌పోలో గ్రౌండ్స్‌ వద్దకు వచ్చారు. రాత్రి 10.30 గంటల ప్రాంతంలో సెల్‌ఫోన్‌లో చాటింగ్‌ చేసుకుంటూ వెళ్తున్న వ్యక్తిని అడ్డగించిన వీరు ఆ ఫోన్‌ లాక్కుని పరారయ్యారు.

బాధితుడి ఫిర్యాదుతో దోపిడీ కేసు నమోదైంది. 25న దుండిగల్‌ పరిధిలో మరో బైక్, 30న తార్నాకలో ద్విచక్ర వాహనం చోరీ చేశారు. వీటితో పాటు మరో వాహనాన్ని వీరు తస్కరించినా దానిపై ఎక్కడా కేసు నమోదు కాలేదు. ఈ వాహనాలపై పెట్రోల్‌ అయిపోయే వరకు తిరిగే వీరు  ఆపై ఏదో ఒక ప్రాంతంలో వదిలేస్తుంటారు. ఇలా చేసే వారిని సాంకేతిక పరిభాషలో జాయ్‌ రైడర్స్‌ అంటారు. బేగంపేట పరిధిలో నమోదైన దోపిడీ కేసు దర్యాప్తు చేపట్టిన నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఘటనాస్థలిలోని సీసీ కెమెరాల్లో నమోదైన ఫీడ్‌ ఆధారంగా అనుమానితులను గుర్తించారు. ఇన్‌స్పెక్టర్‌ కె.నాగేశ్వర్‌రావు నేతృత్వంలో ఎస్సైలు బి.పరమేశ్వర్, కె.శ్రీకాంత్, జి.రాజశేఖర్‌రెడ్డి  బుధవారం నిందితులను అదుపులోకి తీసుకుని వీరి నుంచి నాలుగు బైక్‌లు, సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం వారిని బేగంపేట పోలీసులకు అప్పగించారు. 

మరిన్ని వార్తలు