దారి తప్పి.. చోరీల బాటపట్టి

9 Aug, 2018 13:08 IST|Sakshi
స్వాధీనం చేసుకున్న ద్విచక్ర వాహనాలు

14 ద్విచక్ర వాహనాలు అపహరించిన యువకులు

ముగ్గురిని అరెస్ట్‌ చేసిన భీమిలి పోలీసులు

భీమునిపట్నం ,విశాఖపట్నం: వ్యసనాలకు బానిసలయ్యారు... అందుకు అవసరమైన డబ్బుల కోసం చోరీల బాటపట్టారు. ఈక్రమంలో అపహరించిన బైక్‌లు విక్రయించేందుకు యత్నించగా... అనుమానించిన పోలీసులు అరెస్ట్‌ చేసి కటకటాల వెనక్కునెట్టారు. భీమిలి పోలీస్‌ స్టేషన్‌లో క్రైం డీసీపీ దామోదర్‌ వెల్లడించిన వివరాల ప్రకారం... భీమిలి సమీపంలోని బ్యాంక్‌ కాలనీకి చెందిన కొల్లేటి శ్రావణకుమార్‌(19) వెల్డర్‌గా పని చేస్తున్నాడు. ఇతను ప్రధాన సూత్రధారిగా ఉండగా అదే ప్రాంతానికి చెందిన కారు మెకానిక్‌ కర్రిశెట్టి పైడిరాజు(21), విజయగరానికి చెందిన పల్లి రవీంద్రకుమార్‌(27) జట్టుకట్టారు. వీరు ముగ్గురూ కలిసి భీమిలి, విశాఖపట్నం, విజయనగరం ప్రాంతాల్లో ఆరు బుల్లెట్‌లు, ఆరు స్కూటీలు, రెండు బైక్‌లు అపహరించారు.

వరుస చోరీలపై అందిన ఫిర్యాదులపై స్థానిక ఎస్‌ఐ కె.మధుసూదనరావు దర్యాప్తులో భాగంగా పలుచోట్ల నిఘా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో వెల్డర్‌ శావణ్‌కుమార్‌ రోజుకో ద్విచక్ర వాహనంపై తిరుగుతుండడంతో అనుమానం వచ్చిన పోలీసులు అతనిపై కదలికలను పరిశీలించారు. ఈ క్రమంలో శ్రావణ్‌ ఓ మెకానిక్‌ షాప్‌ వద్దకు వెళ్లి... తన వద్ద కొత్త ద్విచక్ర వాహనం ఉందని, దాన్ని విక్రయించేస్తానని చెప్పాడు. అనుమానించిన సదరు మెకానిక్‌ ఆ ప్రతిపాదనను తిరస్కరించాడు. ఈ విషయం తెలుసుకున్న భీమిలి పోలీసులు శ్రావణ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా మొత్తం విషయం వెలుగుచూసింది. దీంతో పైడిరాజు, రవీంద్రకుమార్‌ను అరెస్ట్‌ చేశారు. వీరి నుంచి మొత్తం 14 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ చోరీలతో సంబంధం ఉందని భావిస్తున్న కొందరు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని డీసీపీ తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్‌ఐ, ఇతర సిబ్బందికి రివార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఏసీపీలు గోవిందరావు, నాగేశ్వరరావు, ఇన్‌స్పెక్టర్‌ బాలసూర్యారావు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు