బండిని చూస్తే మాయం చేస్తాడు..

12 Jun, 2018 07:25 IST|Sakshi
స్వాధీనం చేసుకున్న బైక్‌లు, నిందితుడితో డీఎస్పీ భరత్‌మాతాజీ, సీఐ కృపానందం తదితరులు

నిందితుడి నుంచి 23 బైక్‌లు స్వాధీనం

ధవళేశ్వరం (రాజమహేంద్రవరం రూరల్‌): బండిని చూస్తే క్షణాల్లో మాయం చేస్తాడు... ఆదమరచి హ్యండిల్‌ లాక్‌ వేయకుంటే బండితో పరారవుతాడు. రాజమహేంద్రవరం గోరక్షణపేటకు చెందిన పెదపూడి రవి. సీసీ టీవి ఫుటేజి ఆధారంగా ధవళేశ్వరం పోలీసులు వల పన్ని ఇతడిని చాకచక్యంగా పట్టుకున్నారు. అతని వద్ద సుమారు రూ.2.30 లక్షల విలువైన 23 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సోమవారం డీఎస్పీ భరత్‌మాతాజీ నిందితుడు రవిని, అతని వద్ద స్వాధీనం చేసుకున్న బైక్‌లను విలేకరుల ఎదుట ప్రవేశపెట్టారు. ఈ కేసు వివరాలను డీఎస్పీ ఇలా వివరించారు. గత నెల 20న ధవళేశ్వరం ఎన్‌ఎంఈ చర్చి ఎదురుగా పార్కు చేసిన తెనాలి అచ్యుత్‌ అనే వ్యక్తి బైక్‌ చోరీ అయింది.

చర్చిలో ఉన్న సీసీ కెమెరా ఆధారంగా నిందితుడిని గుర్తించి ఈ నెల 10న ధవళేశ్వరం మార్కెట్‌ వద్ద ధవళేశ్వరం సీఐ ఎం. కృపానందం ఆధ్వర్యంలో పోలీసులు పట్టుకున్నారు. ధవళేశ్వరంలో 3 బైక్‌లు, త్రీటౌన్‌ పరిధిలో 2, బొమ్మూరు పోలీసు స్టేషన్‌ పరిధిలో ఒకటి, రావులపాలెంలో 5, కొత్తపేట, ఆలమూరు, రాజమహేంద్రవరం టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఒక్కో బైక్‌ను చోరీ చేశాడు. మరో తొమ్మిది వాహనాల వివరాలు తెలియాల్సి ఉందని డీఎస్పీ తెలిపారు. వాహనాలు చోరీకి గురైనవారు ధవళేశ్వరం పోలీస్‌స్టేషన్‌కు స్వాధీనం చేసుకున్న వాహనాలను చూసుకోవాలని కోరారు. ఈ నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్న ధవళేశ్వరం సీఐ ఎమ్‌ కృపానందం, ఎస్సైలు ఎస్‌ వెంకయ్య, సీహెచ్‌ సుమన్, కానిస్టేబుళ్లు ఎస్‌కే కరీం, ఎం.స్వామి, పి శ్రీనివాసరావు, ఎ.అశోక్, సీహెచ్‌ దుర్గారావులను డీఎస్పీ అభినందించారు.

మరిన్ని వార్తలు